చాలా మంది జంతువులను ఇష్టంగా పెంచుకుంటారు. ఇలా ఇష్టంగా పెంచుకునే వాటిల్లో కుక్కలు ముందు వరుసలో ఉంటాయి. ఆ తర్వాత ఎద్దులు, ఆవులు వస్తాయి. కుక్కలను పెంచుకునే వారి సంఖ్య ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. నమ్మకంగా కాపలా ఉండే జంతువు స్థాయి కుటుంబ సభ్యుడి స్థాయికి కుక్క ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే కుక్కల క్లినిక్స్ పెద్ద ఎత్తున నగరాల్లో వెలిశాయి. అయితే పాలీ డాక్టర్స్ అధ్యయనాల్లో కుక్కల్లోనూ ఆ వ్యాధి బయటపడింది. దీంతో జంతు ప్రేమికులు అలెర్ట్ గా ఉండాలని పాలీ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
షుగర్ వ్యాధీ లక్షణాలు…
కుక్కలు, పందెపు ఎద్దుల్లోనూ షుగర్ వ్యాధి బయటపడింది. అయితే గతంలో వీటి బారిన పడే జంతువుల సంఖ్య ఒక్క శాతం ఉంటే, ఇప్పుడది ఐదు శాతానికి పెరిగినట్లు పశు వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా కుక్క రక్తంలో 76 ఎంజీ/డిఎల్ నుండ 119 ఎంజీ/డిఎల్ వరకూ షుగర్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని కుక్కల్లో 120 ఎంజి/డిఎల్ నుండి 160 ఎంజీ/డిఎల్ వరకూ షుగర్ ఉన్నట్లు గుర్తించారు. అంటే అధిక మోతాదులో షుగర్ ఉన్నట్లు తేల్చారు. ఇటువంటి కుక్కల్లో ఎక్కువుగా నీళ్లు తాగడం, మూత్ర విసర్జన అతిగా చేయడం, కంటి చూపు మందగించడం, ఆకలి లేకపోవడం, నీరసంగా ఉండటం వంటి లక్షణాలను వైద్యులు గుర్తించారు.
షుగర్ వ్యాధికి అసలు కారణం..!
ప్రధానంగా షుగర్ వ్యాధి ప్రబలడానికి పిజ్జాలు, బర్గర్ లు పెట్డడంతో పాటు కూల్ డ్రింక్స్ త్రాగించడం, శారీరక శ్రమ లేకుండా చూసుకోవడం అని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు వయస్సు రీత్యా కూడా షుగర్ వస్తున్నట్లు గుర్తించారు. సాధారణంగా ఐదేళ్ల వయస్సు తర్వాత కుక్కులు షుగర్ వ్యాధి బారిన పడుతున్నాయన్నారు. కుక్కలతో పాటు పందెపు ఎద్దుల్లోనూ షుగర్ వ్యాధిని గుర్తించారు. మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన ఎద్దుల్లోనూ అధిక మోతాదులో షుగర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
కిడ్నీ ఫెయిల్యూర్స్..!
షుగర్ వ్యాధి బారిన పడిన జంతువుల్లో కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. డయాలసిస్ కోసం వీటిని గన్నవరం పంపించాల్సి వస్తుందంటున్నారు. గుంటూరులోని పశు వైద్యశాలలో డయాలసిసి యూనిట్ ఏర్పాటు చేస్తే గన్నవరం వరకూ వీటిని పంపించకుండా ఇక్కడే చికిత్స అందించవచ్చంటున్నారు. షుగర్ వ్యాధి గుర్తించిన మొదటి దశలో ఇన్సులిన్ కుక్క బరువును బట్టి ఇస్తున్నామని వైద్యులు తెలిపారు. ఐదు కిలోల బరువున్న కుక్కకి నాలుగు నుండి ఐదు యూనిట్ల వరకూ ఇన్సులిన్ ఇస్తున్నామన్నారు.
ఎటువంటి ఆహారం ఇవ్వాలి..
కుక్కలను ఎంతో ప్రేమగా చూసుకోవడంతో ఇష్టమైనవన్నీ పెడుతున్నారని, దీంతో వాటి బరువు విపరీతంగా పెరిగిపోతున్నాయని పశు వైద్యురాలు రత్నజ్యోతి చెప్పారు. కుక్కలకు అసలు చేపలు పెట్టకూడదన్నారు. కూల్ డ్రింక్స్, చాక్లెట్లు కూడా కుక్కల ఆరోగ్యానికి హానికరమే అన్నారు. అయితే కుక్కలు అనారోగ్యంగా ఉన్నట్లు గుర్తించిన వెంటనే పశు వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని వైద్యులు ఏడి నాగేశ్వరావు చెప్పారు. డయాలసిస్ యూనిట్ గుంటూరు ప్రభుత్వ పశు వైద్యశాలలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..