ఆరెంజ్ విటమిన్ సీకి మంచి మూలం అని మనందరీకి తెలిసిందే. చలికాలంలో దీన్ని అందరు చాలా ఇష్టంగా తింటారు. నారింజ తినడం వల్ల చర్మం, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతూ ఉంటారు. కానీ తరచూ నారింజ పండ్లను తిన్నప్పుడు వాటి తొక్కలను చెత్తలో వేస్తూ ఉంటాం. అయితే ఆరెంజ్ తొక్కలు ఎంత మేలు చేస్తుందో తెలుసా? వాటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మీ రోజువారీ జీవితాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఎలానో అర్థం కావడం లేదా? ఆరెంజ్ తొక్కతో ఆరోగ్యం, అందం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. రోజువారీ జీవితంలో నారింజ తొక్కలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం..
చర్మ సంరక్షణ
ఆరెంజ్ పీల్ పౌడర్ ఒక అద్భుతమైన నేచురల్ స్క్రబ్. ఇది చర్మంలోని టానింగ్‌ను తొలగించి, మొటిమలను తగ్గించి, ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. ఇందుకోసం తొక్కను ఎండబెట్టి పొడి చేసి అందులో తేనె, పాలు మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. దీన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. జుట్టు కోసం కూడా ఉపయోగించవచ్చు. నారింజ తొక్కలతో తయారు చేసిన హెయిర్ ప్యాక్ జుట్టును స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది.
రూమ్ ఫ్రెషనర్
ఆరెంజ్ తొక్కలు సహజ సువాసనను కలిగి ఉంటాయి, ఇది ఇంటిని సువాసనగా మార్చడంలో సహాయపడుతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలంటే? తొక్కలను ఎండబెట్టి, పర్సులో నింపి అల్మారాలో లేదా గదిలో ఉంచాలి. అంతే కాకుండా నీటిలో మరిగించడం ద్వారా గదిలో సువాసన వెదజల్లడానికి కూడా ఉపయోగపడుతుంది.
వంటగది శుభ్రపరచడం
నారింజ తొక్కలు ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వంటగదిలోని మరకలను తొలగించడంలో సహాయపడతాయి. ఆరెంజ్ తొక్కలను వెనిగర్‌ను వేసి కొన్ని రోజులు ఉంచాలి. ఇది సహజ క్లీనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. నారింజ తిన్న తర్వాత దాని తొక్కలను విసిరేయకండి వాటిని ఈ పద్ధతిలో ఉపయోగించండి.
నారింజ తొక్కలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు
నారింజ తొక్కలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. వీటిని టీలో కలిపి తాగడం వల్ల డిటాక్సిఫికేషన్ వస్తుంది. నారింజ తొక్కలను ఎండబెట్టి, వాటిని టీ పొడితో మరిగించి, టీ సిద్ధం చేయండి. దీన్ని ఆరోగ్యకరమైన టీగా కూడా తాగవచ్చు.
దంతాలను తెల్లగా మారుస్తుందా?
ఆరెంజ్ తొక్కలు దంతాల పసుపును తొలగించి తెల్లగా మార్చడానికి ఉపయోగపడతాయి. దంతాల మీద తాజా తొక్కలను సున్నితంగా రుద్దండి. ఇలా 2-3 సార్లు ఉపయోగించడం ద్వారా తెల్లటి దంతాలను పొందవచ్చు.
మొక్కలకు సహజ ఎరువులు
నారింజ తొక్కలో ఉండే పోషకాలు మొక్కలకు ఎరువుగా పనిచేస్తాయి. తొక్కలను ఎండబెట్టి, పొడి చేసి, కుండలోని మట్టిలో కలపాలి. ఇది మొక్కలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి