
ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి.. దాదాపు అన్ని ప్రాంతాల్లో 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. దీనికి తోడు తీవ్రమైన వడగాలులు, ఉక్కపోతతో జనం విలవిలలాడుతున్నారు. అంతేకాకుండా.. వడదెబ్బతో పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. వేడి, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్యానికి ప్రమాదకరం.. రోజురోజుకు ఎండల తీవ్రత పెరగడంతో ప్రజల ఆరోగ్యం గణనీయంగా క్షీణిస్తోందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.. ఆసుపత్రులలో వడదెబ్బ, డీహైడ్రేషన్ కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది.. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడి గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతాయా? ఈ కాలంలో ముందు నుంచే గుండె జబ్బులు ఉన్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చెబుతున్నారు.. అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ అజిత్ జైన్.. పెరుగుతున్న వేడి నేరుగా గుండెపోటుకు కారణం కానప్పటికీ, అది గుండెను ప్రభావితం చేయగలదని వివరించారు. ముఖ్యంగా, ముందు నుంచే గుండె జబ్బులు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరం తనను తాను చల్లగా ఉంచుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుందని డాక్టర్ జైన్ వివరిస్తున్నారు. ఈ సమయంలో, శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి గుండె వేగంగా పనిచేయాల్సి ఉంటుంది. అధికంగా చెమట పట్టడం వల్ల శరీరంలో నీరు, అవసరమైన ఖనిజాలు నష్టపోతాయి.. ఇది రక్తపోటు – హృదయ స్పందన రేటును ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి ఎక్కువ కాలం నిర్జలీకరణానికి గురైతే, కొన్ని సందర్భాల్లో రక్తం చిక్కబడటానికి కారణమై, గుండెను ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో, ఇది గుండెపోటుకు కూడా కారణం కావచ్చు. రక్తం చిక్కబడటం వల్ల గుండె ధమనిలో రక్తం గడ్డ కట్టినప్పుడు ఇది జరుగుతుంది.
పెరుగుతున్న వేడిలో అందరికీ గుండెపోటు వచ్చే ప్రమాదం లేదని డాక్టర్ జైన్ వివరిస్తున్నారు. ఒక వ్యక్తి తగినంత నీరు తాగుతూ, ఎండలో తక్కువ సమయం గడుపుతూ, అధిక రక్తపోటు లేకుండా, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర లేకుండా ఉంటే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రోజంతా పుష్కలంగా నీరు త్రాగడం, తీవ్రమైన ఎండ, వేడిలో బయటకు వెళ్లకుండా ఉండటమే ఇక్కడ కీలకం.. అని జైన్ తెలిపారు.
అధిక రక్తపోటు ఉన్న రోగులు
ఏదైనా తీవ్రమైన గుండె జబ్బు
వృద్ధులు
ఎండలో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు
అకస్మాత్తుగా అధిక చెమటలు పట్టడం
హృదయ స్పందన రేటు పెరిగడం
తీవ్రమైన ఛాతీ నొప్పి
ఊపిరి ఆడకపోవడం..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..