ఏపీ: ఆ మూడు లక్షణాలున్నా ఆసుపత్రిలో చేరొచ్చు..

వైరస్ ప్రధాన లక్షణాలైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువగా ఉన్నట్లయితే.. నిర్ధారణ పరీక్షలు అవసరం లేదని.. నేరుగా ఆసుపత్రికి వెళ్తే చేర్చుకుంటారని జవహర్ రెడ్డి వెల్లడించారు.

ఏపీ: ఆ మూడు లక్షణాలున్నా ఆసుపత్రిలో చేరొచ్చు..
Follow us

|

Updated on: Aug 09, 2020 | 10:47 PM

Having Those Three Symptoms Join Directly In Hospital: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. అయితే రికవరీ రేటు కూడా అధికంగా ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం. ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డి కరోనాపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

వైరస్ ప్రధాన లక్షణాలైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువగా ఉన్నట్లయితే.. నిర్ధారణ పరీక్షలు అవసరం లేదని.. నేరుగా ఆసుపత్రికి వెళ్తే చేర్చుకుంటారని జవహర్ రెడ్డి వెల్లడించారు. కోవిడ్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందన్న ఆయన.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్‌లాక్ తర్వాతే పాజిటివిటీ రేటు పెరిగిందని.. ప్రస్తుతం మరణాల నియంత్రణే మన ముందున్న కర్తవ్యమని జవహర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందన్న ఆయన.. ప్రజలు బయటికి వచ్చేటప్పుడు భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. కాగా, మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ప్రజలు 104, 14410, జిల్లాల్లో ఉన్న కాల్‌సెంటర్‌ నెంబర్లను ఉపయోగించుకోవాలని తెలిపారు.