Vishwak Sen: ఫలక్‌నుమా దాస్, పాగల్, హిట్ ,చిత్రాల తర్వాత హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `దాస్ కా ధమ్కీ`. ఈ మూవీ బుధవారం నాడు ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నివేత పేతురాజ్ పై ముహూర్తపు సన్నివేశం చిత్రీకరించారు. దీనికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. `ఎఫ్3` దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ తో పాటు గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా స్క్రిప్ట్‌ను నిర్మాత, దర్శకుడి కి రచయిత ప్రసన్నకుమార్ అందజేశారు. అనంతరం అల్లు అరవింద్ టైటిల్ లోగో ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతూ..యంగ్ హీరోలలో నా కిష్టమైన వారిలో విశ్వక్ ఒకరు. విశ్వక్ తొలి సినిమా నుంచి పరిశీలిస్తున్నాను. సంతోషం వచ్చినా ఏది వచ్చినా తట్టుకోలేడు. ఈ సినిమా మంచి విజయాన్ని చేకూర్చాలి. నివేత పేతురాజ్ కూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. `ధమ్కీ` టైటిల్‌కు తగినట్లే కథ వుంటుందనీ, అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాని అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ, హీరోగా విశ్వక్ సేన్ స్వంత నిర్మాణం లో చేస్తున్న రెండో సినిమా ఇది. దాస్ కా ధమ్కీ అనేది చాలా బాగుంది. రచయిత ప్రసన్నకుమార్ నాకు దిల్ రాజు గారి సినిమాలకు పనిచేసినప్పటి నుంచీ తెలుసు. మంచి స్క్రీన్ ప్లే రచయిత. పాగల్ దర్శకుడు నరేశ్ చేస్తున్న రెండవ సినిమా ఇది. విశ్వక్సేన్ మంచి స్నేహితుడు. మంచి విజయం చేకూరాలని ఆశిస్తున్నానని తెలిపారు.
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, సినిమా రంగంలో పోటీ వున్నా ప్రేక్షకులు నన్ను గుర్తించి విజయాలు ఇచ్చారు. ఒక్క ఛాన్స్ కోసం వెతుకుతూ తిరిగే స్థాయి నుంచి నిర్మాతగా ఎదిగే స్థాయికి వచ్చేలా చేశారు. ఈ సినిమాకు అన్ని వనరులు సమకూరాయి. మంచి టీమ్ దొరికింది. మంచి సినిమాలనే నేను తీస్తాను. మాస్ అప్పీల్ వుండే సినిమా ఇది. థియేటర్ లో చూసిన ప్రేక్షకులు ఊగిపోయేలా వుండే కథ ఇది. కృష్ణదాస్గాడి జీవితంలో జరిగే కథే ఈ సినిమా. ఈనెల 14నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని అన్నారు. అలాగే హీరోయిన్ నివేత పేతురాజ్ మాట్లాడుతూ, విశ్వక్ సేన్ సినిమాలో నటించడం చాలా సంతోషంగా వుంది. కథ చాలా ఆసక్తిగా వుంది. అందుకే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించానని అని తెలిపారు.
మరిన్ని ఇక్కడ చదవండి :