Rathnam Review: విశాల్ రత్నం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే

| Edited By: Rajeev Rayala

Apr 26, 2024 | 2:41 PM

విశాల్ పేరుకు తమిళ హీరో అయినా తెలుగులోనూ ఆయనకు మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలోనే ఆయన నటించిన రత్నం సినిమా విడుదలైందిప్పుడు. పైగా దీనికి హరి దర్శకుడు కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? రత్నంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా లేదా అనేది చూద్దాం..

Rathnam Review: విశాల్ రత్నం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
Rathnam
Follow us on

మూవీ రివ్యూ: రత్నం

నటీనటులు: విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, విజయ్ కుమార్, మురళీ శర్మ, యోగిబాబు తదితరులు

ఎడిటర్: టిఎస్ జై

సినిమాటోగ్రఫర్: ఎమ్ సుకుమార్

సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్

నిర్మాతలు: జీ స్టుడియోస్, కార్తికేయన్ సంతానం

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: హరి

విశాల్ పేరుకు తమిళ హీరో అయినా తెలుగులోనూ ఆయనకు మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలోనే ఆయన నటించిన రత్నం సినిమా విడుదలైందిప్పుడు. పైగా దీనికి హరి దర్శకుడు కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? రత్నంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా లేదా అనేది చూద్దాం..

కథ:

ఆంధ్రా, తమిళనాడు బోర్డర్స్‌లోనే ఈ కథ అంతా సాగుతుంది. ఈ క్రమంలోనే చిత్తూరులోని ఒక కూరగాయల మార్కెట్లో పనిచేసే రత్నం (విశాల్)కు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతారు. అదే మార్కెట్‌లో ఉండే పన్నీర్ (సముద్రఖని) ను ఒకసారి ప్రాణాలకు తెగించి కాపాడతాడు.. ఫలితంగా ఒకర్ని చంపి జైలుకు కూడా వెళ్తాడు. దాంతో రత్నాన్ని సొంత కొడుకులా పెంచుకుంటాడు పనీర్. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రత్నం కోసం ఏదైనా చేస్తుంటాడు. అదే సమయంలో నగరి అమ్మాయి మల్లిక (ప్రియ భవాని శంకర్) ఓసారి నీట్ పరీక్ష రాసేందుకు చిత్తూరుకు వస్తుంది. ఆమెను చూడగానే రత్నంలో ఏదో తెలియని ఓ భావన కలుగుతుంది. అంతలోనే ఆమెను చంపడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అప్పుడు ఆమెను వాళ్ల నుంచి కాపాడతాడు రత్నం. అసలెందుకు కాపాడతాడు.. మల్లిక అంటే ఎందుకు రత్నంకు అంత ప్రాణం అనే దాని వెనక అసలు కథ ఉంటుంది. ఈ క్రమంలోనే మల్లికను చంపాలనుకుంటున్నది లింగం బ్రదర్స్ (మురళీ శర్మ, హరీష్ పేరడీ, అలాగే మరొకరు) అని తెలుసుకుంటాడు రత్నం. ఆ తర్వాత ఏం జరిగింది..? అసలెందుకు మల్లికను వాళ్లు చంపాలనుకుంటారు.. రత్నంకు మల్లికతో ఏంటి సంబంధం అనేది అసలు కథ..

కథనం:

హీరోలతో పని లేకుండా డైరెక్టర్స్ బ్రాండ్ మీద చూసే సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ రేంజ్ బ్రాండ్ ఉన్న దర్శకుడే హరి. చిన్న పాయింట్ పట్టుకుని.. స్క్రీన్ ప్లేతో కథను పరిగెత్తించడంలో హరి స్పెషలిస్ట్. సింగం నుంచి మొదలుపెడితే హరి చాలా సినిమాలు అలాగే వచ్చాయి.. సక్సెస్ అయ్యాయి కూడా. రత్నం కూడా హరి మార్క్ సినిమానే. కాకపోతే ఇంతకు ముందు సినిమాల్లో ఉన్న చమక్కులు ఇందులో లేవు. ఎప్పటిలాగే మాస్ తో పాటు.. ఇందులోనూ ఎమోషన్స్ కు పెద్ద పీట వేసాడు హరి. మొదటి అరగంట దారం తెగిన గాలిపటంలా కథ ఎటేటో వెళ్తుంది. ఫస్టాఫ్ అంతా చిత్తూరు, ఆంధ్రా, తమిళనాడు బోర్డర్ అంటూ అర్థం కాకుండా సాగుతుంది. అయితే ప్రతీ చిన్న సీన్‌కు ఎక్కడో వచ్చే మరో సీన్‌తో ముడి పెట్టుకుంటూ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు హరి. ఫస్టాఫ్‌లో అర్థం కాని చాలా సీన్స్‌కు సెకండాఫ్‌లో ఆన్సర్ దొరుకుతుంది. హీరోయిన్ ఎంట్రీ తర్వాత కథ పూర్తిగా గాడిన పడుతుంది. ఎప్పట్లా రొటీన్ లవ్ ట్రాక్ కాకుండా.. హీరో హీరోయిన్ మధ్య బాండింగ్ కొత్తగా చూపించడం బాగుంది. హీరోయిన్‌ను చంపాలని ఓ బ్యాచ్ తిరగడం.. వాళ్ల నుంచి ఆమెను కాపాడడం.. చివర్లో చిన్న ట్విస్ట్.. రత్నం సినిమా కథంతా ఇంతే. హరి గత సినిమాల్లో ఉన్న రేసి స్క్రీన్ ప్లే ఇందులో మిస్ అయింది. స్లో నెరేషన్ రత్నంకు మైనస్. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. కథ రొటీన్‌గానే సాగుతున్నా.. విశాల్ చేతికి కత్తి వచ్చినపుడు మాత్రం విజిల్స్ బాగానే పడతాయి. ఆ మాస్ మ్యాజిక్ అయితే చేసి చూపించాడు హరి. సెకండాఫ్‌లోనూ మాస్‌కు నచ్చే అంశాలు చాలానే ఉన్నాయి.

నటీనటులు:

విశాల్ కు ఈ క్యారెక్టర్ కొట్టినపిండి. ఎప్పట్నుంచో ఈ తరహా పాత్రలు చేస్తూనే ఉన్నాడు ఆయన. మరోసారి హరితో అలాంటి కారెక్టర్ చేసాడు విశాల్. ఇక హీరోయిన్ ప్రియా భవాని శంకర్ యాక్టింగ్ బాగుంది. సినిమా కథ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. మరో కీలక పాత్రలో సముద్రఖని నటన బాగుంది. విలన్స్‌గా మురళీ వర్మ, హరీష్ పేరడి ఓకే. యోగిబాబు కామెడీ సినిమాకు పెద్ద రిలీఫ్. మిగిలిన వాళ్లంతా వాళ్ల వాళ్ళ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

రత్నం సినిమాకు మేజర్ ప్లస్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది అలాగే డబ్బింగే అయినా పాటలు ఆకట్టుకుంటాయి. చెబుతావా పాట సాహిత్య పరంగానూ బాగుంది. ఎడిటింగ్ వీక్‌గా ఉంది. దర్శకుడి ఛాయిస్ కాబట్టి ఎడిటర్ జై వర్క్‌ను తప్పు బట్టలేం. కాకపోతే అక్కడక్కడా కొన్ని సీన్స్ తీసేసినా నష్టం అనిపించదు. సినిమాటోగ్రఫీ బాగుంది. హరి సినిమాకు కెమెరా మెన్ కీలకం. కథ కంటే వేగంగా ఆయన సినిమాల్లో కెమెరాలే పరిగెడుతుంటాయి. ఇందులోనూ అదే జరిగింది. ఇక దర్శకుడు హరి మరోసారి యాక్షన్‌నే నమ్ముకున్నాడు. దానికి కాస్త ఎమోషన్ జోడించాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా రత్నం.. హరి మార్క్ యాక్షన్ డ్రామా.. మాస్ ఆడియన్స్ కోసం..