చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ సజ్జ హీరోగానూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సమంత నటించిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించిన తేజ.. ఆ తర్వాత హీరోగా మారాడు. జాంబీ రెడ్డి సినిమాతో మంచి విజయాన్ని ఆదుకున్నాడు తేజ. అలాగే అదృష్టం అనే సినిమా చేశాడు. ఇక ఇప్పుడు హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇండియన్ సూపర్ హీరో హనుమంతుడి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో జాంబీరెడ్డి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి హనుమాన్ అనే సినిమాతో రాబోతున్నారు.
ఇక ఈ మూవీని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది. ఈ సంక్రాంతి పండుగను టార్గెట్ చేసి చాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వీటిలో ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా రానుంది.
అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ని జనవరి 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే రవితేజ నటిస్తున్న ఈగల్ మూవీ కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ పోటీ తట్టుకొని హనుమాన్ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.