
హీరో సుమంత్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన తాజా చిత్రం న్యూతన్స్ థర్డ్ లా అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్, కీలక చిత్రాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తాను ఒక ఇంట్రోవర్ట్ అని, ఇది కాలక్రమేణా మరింతగా బలపడిందని ఆయన పేర్కొన్నారు. పది, ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తిత్వానికి, ప్రస్తుత తన వ్యక్తిత్వానికి చాలా తేడా ఉందని, వ్యక్తిత్వం నిరంతరం పరిణామం చెందుతూ ఉంటుందని సుమంత్ చెప్పుకొచ్చాడు. అలాగే సుమంత్ తన కెరీర్‌లో వదులుకున్న రెండు పెద్ద హిట్ల గురించి వివరంగా మాట్లాడారు. ఒకటి “నువ్వే కావాలి” కాగా, మరొకటి “దేశముదురు”. “నువ్వే కావాలి” చిత్రం మలయాళం సినిమా “నిరం” రీమేక్ అని, ఆ సినిమాను డేట్స్ సమస్యల వల్ల వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
అప్పట్లో “యువకుడు” ,”పెళ్లి సంబంధం” చిత్రాలలో నటిస్తూ ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేకపోయానని, ఈ చిత్రం మిస్ అయినందుకు తనకు ఇప్పటికీ బాధ ఉందని సుమంత్ తెలిపారు. అయితే, “దేశముదురు” చిత్రం గురించి మాట్లాడుతూ, తాను చేస్తే అది హిట్ అయ్యేది కాదని, అల్లు అర్జున్ మాత్రమే ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారని సుమంత్ తెలిపారు. పూరి జగన్నాథ్ మొదట ఈ కథను తనకే చెప్పారని, కానీ అది తనకు సెట్ అవదని తాను భావించానని అన్నారు. “ఇడియట్” చిత్రం కూడా మహేష్ బాబుకు ముందు ఆఫర్ చేశారని, ఇలాంటివి పరిశ్రమలో చాలా సాధారణమని సుమంత్ అన్నారు.
నాగార్జునతో కలిసి నటించిన “స్నేహం అంటే ఇదేరా” చిత్రం గురించి కూడా సుమంత్ ప్రస్తావించారు. 2002లో తాను 26-27 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఈ సినిమా చేశానని, చిన్న మామ (నాగార్జున) వయస్సులో చిన్నవాడిలా కనిపించడం వల్ల తమ జోడి స్నేహితులుగా ప్రేక్షకులను మెప్పించిందని అన్నారు. ఈ సినిమా కూడా మలయాళం సినిమా రీమేక్ అని, తమిళంలో విజయ్, సూర్య చేశారని, అక్కడ పెద్ద విజయం సాధించినప్పటికీ, తెలుగులో మాత్రం యావరేజ్ సినిమాగా నిలిచిందని తెలిపారు. మళ్ళీ రావా, సీతారామం వంటి చిత్రాలతో తన రెండో ఇన్నింగ్స్ విజయవంతంగా కొనసాగుతోందని సుమంత్ తెలిపారు. గౌతమ్ తిన్ననూరి, సన్నీ సంజయ్ వంటి కొత్త దర్శకులు తనను సంప్రదించారని, కొత్త దర్శకులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. మంచి స్క్రిప్ట్‌లు ఉంటే తనకు తెలియజేయమని తాను చాలా మందికి చెప్పానని, ఇది మంచి అవకాశాలకు దారి తీస్తుందని సుమంత్ అన్నారు. తాను మహేష్ బాబు అభిమానినని, రాజమౌళి సినిమాలో నటిస్తున్నారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి