రేణుస్వామి హత్య కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కన్నడ హీరో దర్శన్, అతడి ప్రియురాలు నటి పవిత్ర గౌడతోపాటు మరికొంత మంది నిందితులను బెంగుళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తన ప్రియురాలికి అసభ్యకర సందేశాలు పంపించడంతో తన వీరాభిమానిని కిడ్నాప్ చేయించి హత్య చేయించాడు దర్శన్. ఈ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం దర్శన్ తోపాటు పవిత్ర గౌడను విచారిస్తున్న పోలీసులకు నిర్ఘాంతపోయే సంగతులు తెలియడంతో షాకవుతున్నారు. తనకు అసభ్యకరంగా సందేశాలు పంపించాడనే కోపంతో అతడిని దారుణంగా హింసించాలని ప్రియుడు దర్శన్‌ను పవిత్ర ఉసిగొల్పినట్లు తెలుస్తోంది. ఇక రేణుస్వామి కిడ్నాప్ కోసం దర్శన్ అభిమాని సంఘాల నాయకుడు రాఘవేంద్ర రంగంలోకి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
రాఘవేంద్ర తన భర్త రేణుస్వామిని ఇంటి సమీపంలో వాహనం ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు రేణుస్వామి భార్య చెబుతుుంది. ఆ తర్వాత బెంగుళూరు సమీపంలోని షెడ్ లో అతడిని బంధించి కర్రలు, బెల్టుతో అతడిని దారుణంగా కొట్టారని.. తీవ్రంగా హింసించడంతో ఎముకలు విరిగి అక్కడికక్కడే రేణుస్వామి ప్రాణాలు విడిచాడని..ఆ తర్వాత మృతదేహాన్ని మురికి కాలువలో పడేసినట్లు తెలుస్తోంది. ఆ మృతదేహాన్ని వీధి కుక్కలు తినడం చూసి అటుగా వెళ్తున్న ఓ ఫుడ్ డెలివరీ బాయ్ పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం. రేణుస్వామి మృతదేహాన్ని కాలువలో పడేసిన తర్వాత దర్శన్ తన కారులో అక్కడికి వచ్చి చూశాడని సీసీటీవీ ఫుటేజ్ బయటకు రిలీజ్ చేశారు పోలీసులు. బుధవారం ఘటన స్థలికి తీసుకెళ్లి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసినట్లు తెలుస్తోంది.
రేణు స్వామి హత్య కేసులో పవిత్ర గౌడ ఏ1గా , దర్శన్ ఏ2గా, కె.పవన్ ఏ3గా ఉన్నారు. రాఘవేంద్ర ఏ4, నందీష్ ఏ5, జగదీష్ అలియాస్ జగ్గా ఏ6, అను ఏ7, రవి ఏ8, రాజు ఏ9, వినయ్ ఏ10, నాగరాజ్ ఏ11, లక్ష్మణ్ ఏ12, దీపక్ ఏ13, ప్రదోష్ ఏ14, కార్తీక్ ఏ15, కేశవమూర్తి ఏ16, నిఖిల్ నాయక్ ఏ17గా నమోదయ్యారు. ప్రస్తుతం 13 మంది పోలీసుల అదుపులో ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.