మెగాస్టార్ చిరంజీవి ఇకపై పద్మ విభూషణుడు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మ విభూషణ్ పురస్కారాన్ని చిరంజీవి ఈరోజు అందుకున్నారు. ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని గురువారం సాయంత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసనతో కలిసి విచ్చేశారు. రిపబ్లిక్ డే రోజున పద్మ విభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవానికి చిరంజీవి హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈరోజు పద్మ విభూషణ్ అవార్డ్ ప్రదానం చేశారు. చిరుతోపాటు నృత్యకారిణి.. సీనియర్ నటి వైజయంతిమాల బాలి కూడా పద్మ విభూషణ్ అవార్డ్ అందుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి 1955 ఆగస్టు 22న మొగల్తూరులో జన్మించారు. అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఎలాంటి సెలబ్రేటీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకపోయినా నటనపై ఆసక్తితో వెండితెరపై తనను తాను నిరూపించుకునేందుకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 1978లో పునాది రాళ్లు సినిమాతో నటుడిగా సినీ ప్రయాణం మొదలుపెట్టాడు. కానీ ప్రాణం ఖరీదు సినిమా ముందుగా విడుదలయ్యింది. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు 150 చిత్రాలకు పైగా నటించారు.
సినీరంగంలో ఆయన చేసిన సేవలకుగానూ 2006లో కేంద్రం చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇక ఇవాళ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. 2006 నవంబరులో ఆంధ్ర విశ్వవిద్యాలంయ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 1998 నుంచి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే చిరంజీవి ఐ బ్యాంక్ నడుపుతున్నారు సేవ కార్యక్రమాల్లో ముందుంటున్నారు. కరోనా సమయంలో సినీ కార్మికులకు ప్రత్యేక సాయం చేశారు. సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ తనదైన మార్క్ వేశారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి.. 2009లో తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012 అక్టోబర్ నుంచి 2014 మే వరకూ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014 తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.