
మూవీ రివ్యూ: మహేంద్రగిరి వారాహి
నటీనటులు: సుమంత్, సిద్ధు జొన్నలగడ్డ, మీనాక్షి గోస్వామి, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్, మంజు భార్గవి, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, వంశీ చాగంటి, కమల్ కామరాజు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు..
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: ప్రతాప్ ఆర్. కృష్ణ
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి
నిర్మాతలు: మధు కలిపు, లక్ష్మణ్
సుమంత్ హీరోగా స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, అలీ లాంటి స్టార్ క్యాస్ట్ ఇందులో నటించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ నిర్మాణంలో సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
మహేంద్రగిరి వంశానికి చెందిన మగవారంతా సరిగ్గా 33 వయసు రాగానే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ క్రమంలోనే రాజేంద్ర వర్మ (సిద్ధూ జొన్నలగడ్డ) కూడా 33వ ఏట మరణిస్తాడు.. ఆయనతో పాటు భార్య (మాళవిక నాయర్) కూడా ప్రాణాలు కోల్పోతుంది. ఇదంతా వారాహి అమ్మవారి ఆగ్రహం వల్లే జరుగుతోందని నమ్మే ఆ కుటుంబం, ఆ శాపం నుంచి బయటపడటానికి ఎన్నో తరాలుగా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇదే సమయంలో హైదరాబాద్‌కు చెందిన ఒక యూట్యూబర్ సిద్ధార్థ్ (సుమంత్) అనుకోకుండా అన్నయ్య (కమల్ కామరాజు) పేరు మీద పూజలు చేయించడానికి మహేంద్రగిరి వస్తాడు. వారాహి అమ్మవారి గుడిలో అడుగు పెడతాడు. దేవుడంటే నమ్మకం లేని సిద్దూ.. అసలు అమ్మవారి పేరు మీద జరుగుతున్న ఈ వరుస మరణాల వెనక ఉన్న అసలు రహస్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత అతను ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు, అమ్మవారికి ఆ వంశానికి ఉన్న అసలు సంబంధం ఏంటి అనేది ఈ చిత్ర కథ..
అనగనగా ఓ ఊరు.. ఆ ఊళ్ళో ఓ గుడి.. రాజవంశానికి శాపం.. ప్రతీ 33 ఏళ్ళకు ఒకరి మరణం.. 200 ఏళ్లుగా సాగుతున్న ఆనవాయితీ.. ఇదంతా వింటుంటే మురారి సినిమా కథ గుర్తుకొస్తుంది కదా..? అలాంటి కథతోనే మహేంద్రగిరి వారాహి కూడా వచ్చింది. కాకపోతే కాన్సెప్ట్ ఒకేలా అనిపించినా.. ట్రీట్‌మెంట్ డిఫెరెంట్‌గా ఉంది.. వారాహి మొదలవ్వడమే చాలా ప్రామిసింగ్‌గా మొదలైంది.. ఫస్ట్ 15 నిమిషాలు సిద్ధూ జొన్నలగడ్డపైనే ఉండటం మేజర్ ప్లస్ పాయింట్. ఆ తర్వాత మెయిన్ స్టోరీ మొదలైంది.. అక్కడ్నుంచి కూడా టెంపో బాగానే మెయింటేన్ చేసారు.. మధ్యలో కొన్ని ల్యాగ్ సీన్స్ అనిపించినా.. ఇంటర్వెల్ ముందు సెట్ అయిపోతుంది. సెకండాఫ్‌కు చాలా ప్రశ్నలు వదిలేసి సస్పెన్స్ మెయింటేన్ చేసారు. అమ్మవారి శాపం నుంచి తప్పించుకోలేక వచ్చే మరణాలు చూస్తుంటే.. కచ్చితంగా దానివెనక ఏదో రహస్యం ఉందనే విషయం అర్థమైపోతుంది. క్లైమాక్స్ వరకు ట్విస్ట్ రివీల్ కాకుండా బాగానే లాక్కొచ్చాడు దర్శకుడు సంతోష్.. కానీ మరీ ఊహించలేనంత ట్విస్టులు మాత్రం ఉండవు.. ఆ టైమ్‌కు పాస్ అయిపోతాయి. సిద్ధూతో పాటు ఐశ్వర్య రాజేష్ క్యామియో బాగుంది.. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి సినిమాను మొదలుపెట్టిన విధానం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది.
అనవసరమైన రొమాంటిక్ ట్రాక్స్ లాంటివి ఇరికించకుండా తీసుకున్న పాయింట్‌కే కట్టుబడి ఉండటం మెచ్చుకోదగ్గ విషయం. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఊహించని మలుపు సెకండాఫ్‌పై అంచనాలు పెంచేలా చేస్తుంది. అలాగే ప్రీ క్లైమాక్స్, ముగింపు సన్నివేశాల్లో రివీల్ అయ్యే ట్విస్టులు, వాటిని రాసుకున్న తీరు ఎంతో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మధ్యలో వచ్చే సన్నివేశాలు కాస్త నెమ్మదించినట్లు అనిపించి బోర్ కొట్టిస్తాయి. దైవశక్తికి సంబంధించిన అంశాలు కేవలం క్లైమాక్స్‌లో మాత్రమే చూపించడం లాజిక్‌కు దూరంగా ఉంటుంది. అంతకుముందు జరిగిన ఘోరాలప్పుడు ఆ శక్తి ఎందుకు అడ్డుకోలేదు అనేదానికి ఎలాంటి సరైన వివరణ ఇవ్వకుండా వదిలేయడం నిరాశపరుస్తుంది. ఇక ప్రమోషన్స్‌లోనే ఐశ్వర్య రాజేష్ పాత్రను బయట పెట్టేయడం వల్ల థియేటర్లో ఆ థ్రిల్ చాలా వరకు మిస్ అవుతుంది. స్క్రీన్‌ప్లేను ఇంకొంచెం పకడ్బందీగా, లాజిక్స్‌తో రాసుకుని ఉంటే ఈ మిస్టిక్ థ్రిల్లర్ స్థాయి మరింత పెరిగి ఉండేది.
మోసాలను బయటపెట్టే యూట్యూబర్‌గా సుమంత్ నటన చాలా సహజంగా ఉంది. మిస్టరీని ఛేదించే క్రమంలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అతిథి పాత్రలో మెరిసిన సిద్ధు జొన్నలగడ్డ ఉన్నది కొద్దిసేపే అయినా సినిమాకు అద్భుతమైన బేస్ క్రియేట్ చేశాడు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, వంశీ చాగంటి తమ పాత్రల పరిధి మేర చక్కటి సపోర్ట్ ఇచ్చారు. మీనాక్షి గోస్వామి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా పర్వాలేదనిపిస్తుంది. మాళవిక నాయర్, మంజు భార్గవి, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, శ్రీనివాస్ వడ్లమాని పాత్రలు మెప్పించాయి.
ఇలాంటి సస్పెన్స్ సినిమాలకు టెక్నికల్ వాల్యూస్ చాలా కీలకం. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది.. ఆర్ఆర్ కూడా బాగానే ఉంది. అయితే గ్రాఫిక్స్ వర్క్ ఆకట్టుకోదు, పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం కూడా కొంత మైనస్ అయింది. ప్రతాప్ ఆర్ కృష్ణ కెమెరా పనితనం బాగుంది.. ఎడిటింగ్ విభాగం మిడిల్ పోర్షన్స్‌లో ఇంకొన్ని సీన్స్ కత్తిరించి ఉంటే బాగుండేది. దర్శకుడు కథను డీల్ చేసిన విధానం బాగున్నా, టెక్నికల్ అవుట్‌పుట్ పై మరింత శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్లేదు.
ఓవరాల్‌గా మహేంద్రగిరి వారాహి.. డీసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ మిస్టిక్ థ్రిల్లర్..!