CM Vijay- Dhanush: మూడేళ్ల తర్వాత మళ్లీ.. సీఎం విజయ్‌కు స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పిన హీరో ధనుష్.. కారణమిదే

ధనుష్ నటించిన లేటెస్ట్ సినిమా 'ఓం'. అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన ఈ సినిమా ఈ శుక్రవారం (నవంబర్ 20) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ధనష్ తో పాటు మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

CM Vijay- Dhanush: మూడేళ్ల తర్వాత మళ్లీ.. సీఎం విజయ్‌కు స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పిన హీరో ధనుష్.. కారణమిదే
CM Vijay And Dhanush

Updated on: Nov 18, 2026 | 8:38 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 55వ చిత్రం ‘ఓం ‘. ‘అమరన్’ తో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాను తెరకెక్కించారు. ధనుష్‌కు చెందిన వండర్‌బార్ ఫిల్మ్స్ మరియు ఆర్.టెక్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ధనుష్ తో పాటు మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఓం సినిమా నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, సినిమా ప్రచార కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో, ధనుష్ నటించిన ‘ఓం’ చిత్రాన్ని తమిళనాడులో ఉదయం 6 గంటల నుంచి ప్రదర్శిస్తున్నారు. దీనికి అనుమతి ఇచ్చినందుకు గానూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ నటుడు ధనుష్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే.. తమిళనాడులో 2023 నుంచి ప్రీమియర్లు, ఎర్లీ మార్నింగ్ షోలను రద్దు చేశారు. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో అభిమాని చనిపోవడమే దీనికి కారణం. అయితే హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కొన్నిరోజుల క్రితం 6 గంటల షోలకు అనుమతి రాగా.. ఇ‍ప్పుడు ధనుష్ ‘ఓం’ సినిమాతో ఈ ట్రెండ్ తిరిగి మొదలుకానుంది.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి విజయ్‌కి థ్యాంక్స్ చెప్పిన ధనుష్.. అభిమానులకు కూడా ఓ విజ్ఞప్తి చేశాడు. ‘ఒక సినిమా విజయం అనేది వివిధ రంగాలకు చెందిన ఎంతో మంది వ్యక్తుల సమిష్టి కృషి, అంకితభావం అవసరం. సినిమా పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్కరికీ ప్రేక్షకులు అందించగలిగే అతిపెద్ద ప్రోత్సాహం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటమే. నవంబర్ 20న విడుదలవుతున్న ‘ఓం’ సినిమా ఉదయం 6 గంటల ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి మంజూరు చేసిన తమిళనాడు ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ విజయ్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉదయం 6 గంటల షోకు హాజరయ్యే అభిమానులందరూ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. సినిమాని థియేటర్లలో చూసి ఆనందించడమే నిజమైన వేడుక’ అని రాసుకొచ్చారు ధనుష్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

హీరో ధనుష్ ట్వీట్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us