
నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటించిన ‘రామాయణం: పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. అయితే ఈ సినిమాపై రోజుకో వివాదం తలెత్తుతోంది. తాజాగా శక్తిమాన్ సీరియల్ ఫేమ్ బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా రామాయణం సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్ం చేశారు. బి.ఆర్. చోప్రా ‘మహాభారతం’ సీరియల్లో భీష్మ పితామహుడి పాత్రలో నటించిన ముఖేష్ ఖన్నా, ఇప్పుడు ‘రామాయణం’ చిత్రంలో సీతామాతను చిత్రీకరించిన తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తన యూట్యూబ్ వ్లాగ్‌లో రామాయణ సినిమా గురించి మాట్లాడిన ముఖేష్ ఖన్నా ఇలా అన్నారు, “నేను హిందీ చిత్ర పరిశ్రమలోని నిర్మాతలను, దర్శకులను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. వాల్మీకి రామాయణంలోని వాస్తవాలను వక్రీకరించి, మీ కల్పనలకు అనుగుణంగా చూపించడం సరైనదేనా? సినిమా విడుదలైనప్పటి నుంచి ఇంటర్నెట్లో దీనిపై చర్చ జరుగుతోంది. కానీ ఇక్కడ, నిర్మాతలకు రామాయణ కథను నిజాయితీగా చెప్పడానికి బదులుగా, పెట్టుబడిగా పెట్టిన రూ. 4,000 కోట్ల బడ్జెట్‌ను తిరిగి రాబట్టుకోవడమే ప్రధాన ఎజెండాగా ఉంది’ అని ఘాటుగా విమర్శించారు శక్తిమాన్.
సినిమాలో సాయి పల్లవి పోషించిన సీతామాత పాత్రను కత్తితో పోరాడే యోధురాలిగా చిత్రీకరించడాన్ని ముఖేష్ ఖన్నా తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ సీతమాత ఝాన్సీ రాణిలాగా ఇద్దరు ముగ్గురు రాక్షసులతో పోరాడటంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేను వాల్మీకి రామాయణాన్ని పరిశీలించాను. అందులో అలాంటి ప్రస్తావన ఎక్కడా లేదు. నాకు తెలిసినంతవరకు, సీతామాత ఎప్పుడూ యుద్ధం చేయలేదు. ఆమె గనుక యోధురాలు అయితే, రావణుడు ఆమెను అపహరించడానికి వచ్చినప్పుడు అతనితో పోరాడి ఉండేది. రావణుడు ఆమెను అంత సులభంగా ఎలా అపహరించగలిగాడు?” అని ముఖేష్ ఖన్నా ప్రశ్నించారు.
కాగా ఈ విషయంపై చిత్ర బృందం ఇచ్చిన వివరణకు స్పందించిన ముఖేష్ ఖన్నా, “ఈ సన్నివేశాన్ని వాల్మీకి రామాయణం నుంచి కాకుండా ‘అద్భుత రామాయణం’ అనే పుస్తకం నుండి తీసుకున్నామని నిర్మాతలు చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అసలైన రామాయణం వాల్మీకి రాసినదే. దానికంటే రెండు అడుగులు ముందుకు వెళ్లే అధికారం ఎవరికీ లేదు. ఖురాన్ లేదా బైబిల్ కథను మార్చే ధైర్యం నిర్మాతలకు ఉందా? లేకపోతే, రామాయణాన్ని మార్చడానికి వారికి ఎంత ధైర్యం ఉంది?’ అని తీవ్రంగా విమర్శించారు శక్తిమాన్. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడి కామెంట్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి