
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, క్రేజీ డైరెక్టర్ ఇ.వి.వి. సత్యనారాయణ కాంబినేషన్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ‘అల్లుడా మజాకా’. 1995లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో సృష్టించిన మాస్ జాతర అంతా ఇంతా కాదు. కాస్త అడల్ట్ టచ్ ఉంటుంది.. చిరు ఇమేజ్‌కు సెట్ కాలేదనే విమర్శలు ఉన్నా కూడా మాస్ సెంటర్లలో రప్ఫాడించింది అల్లుడా మజాకా. అయితే దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ టీవీల్లో వస్తే అతుక్కుపోయేలా చేసే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాకి మొదట అనుకున్న టైటిల్ ‘అల్లుడా మజాకా’ కాదు.
అవును, మీరు విన్నది నిజమే. అప్పట్లో దేవీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత కె. దేవీవరప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భారీ చిత్రానికి మొదట ‘ఘరానా అత్త – గడుసు అల్లుడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ కథ మొత్తం అత్త, అల్లుళ్ళ మధ్య సాగే ఆధిపత్య పోరు చుట్టూ తిరుగుతుంది కాబట్టి, ఈ పేరు అయితేనే వంద శాతం న్యాయం చేస్తుందని అప్పట్లో చిత్ర యూనిట్ భావించింది. తాజాగా బయటపడిన నాటి పాత పత్రికా ప్రకటనను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ‘శివరంజని’ లాంటి సినీ పత్రికల్లో సైతం చిరంజీవి కొత్త చిత్రం పేరు ఇదేనంటూ అప్పట్లో అధికారికంగా వార్తలు రావడం విశేషం. ఇక ఈ పాత పత్రికా క్లిప్పింగ్ ప్రకారం.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జంటగా రమ్యకృష్ణ, రంభ కథానాయికలుగా నటించగా, అత్త పాత్రలో ప్రముఖ నటి లక్ష్మి నటించారు.
ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు ప్రముఖ దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి కథ, మాటలు అందించడం మరో విశేషం. అంతేకాదు కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, ఏవీయస్, మల్లికార్జునరావు, శ్రీహరి, చలపతిరావు లాంటి అప్పటి అగ్ర నటీనటులు ఈ చిత్రంలో భాగమయ్యారు. రాజ్-కోటి సంగీతం అందించిన ఈ సినిమా, అప్పట్లోనే అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కింది. నాటి షూటింగ్ అప్‌డేట్స్ కూడా ఈ క్లిప్పింగ్‌లో ఎంతో వివరంగా ఇచ్చారు. మద్రాసులో మొదలైన మూడో షెడ్యూల్ వారం రోజుల పాటు జరుపుకున్నాక, అక్టోబర్ 16న యూనిట్ మొత్తం ‘గోపిశెట్టిపాలెం’కు షిఫ్ట్ అయినట్లు అందులో ప్రచురించారు. అక్కడ 10 రోజుల పాటు ప్రధాన దృశ్యాలు, ఆ తర్వాత ఆగ్రాలో మరో 5 రోజులు చిత్రీకరణ ప్లాన్ చేశారు.
అనంతరం మద్రాసులోని స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో చిరంజీవి, రమ్యకృష్ణ, రంభలపై ఓ సూపర్ హిట్ సాంగ్‌ను చిత్రీకరించినట్లు సమాచారం. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్ నెలల్లో మరో రెండు షెడ్యూల్స్‌తో సినిమా నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. మొదట ‘ఘరానా అత్త – గడుసు అల్లుడు’ అనే టైటిల్‌తో అంతలా పబ్లిసిటీ చేసినప్పటికీ, సినిమా రిలీజ్ సమయానికి మాత్రం దాన్ని మార్చాల్సి వచ్చింది. ఆ పాత టైటిల్ కంటే కాస్త క్యాచీగా, మరింత మాస్ అప్పీల్ ఉండేలా ‘అల్లుడా మజాకా’ అని పెడితే బాగుంటుందని మేకర్స్ డిసైడ్ అయ్యారు. అలా పేరు మార్చుకుని థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో, వివాదాలను సైతం దాటుకుని ఎలా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మొత్తానికి ఒక పాత పత్రికా క్లిప్పింగ్.. టాలీవుడ్ క్లాసిక్ మాస్ సినిమా వెనుక ఉన్న ఇంతటి ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్‌ను మరోసారి మెగా ఫ్యాన్స్‌కు గుర్తుచేసిందన్న మాట..!