
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయిక శ్రీలీల, తన కెరీర్ మరియు సినిమాల ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ స్వీయ నిర్మాణంలో నటించిన ‘ఓం’ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలో ఆమె తన మనసులోని మాటలను పంచుకున్నారు. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో, ఎర్రచందనం స్మగ్లింగ్, కూలీలపై పోలీసు కాల్పుల వంటి వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో ధనుశ్ సరసన శ్రీలీల కథానాయికగా నటించగా, సాయిపల్లవి పవర్ఫుల్ ఐపీఎస్ అధికారిణి పాత్రలో కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల మాట్లాడుతూ.. “నేను ఎక్కడికి వెళ్లినా నన్ను ఒక తెలుగు అమ్మాయిగానే గుర్తిస్తారు. ఆ గుర్తింపు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని ఇస్తుంది.
ముంబయిలో మెడిసిన్ ఇంటర్న్‌షిప్ చేస్తున్న రోజుల్లోనే నాకు చాలా సినిమా అవకాశాలు వచ్చాయి, కానీ చదువు కారణంగా అప్పుడు వాటిని చేయలేకపోయాను” అని తెలిపారు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం వల్ల వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగానని ఆమె పేర్కొన్నారు. “ఒకానొక దశలో నా సినిమాల ఎంపికపై నాకే సందేహాలు కలిగాయి. ఖాళీ సమయం దొరికినప్పుడు నేను గతంలో చేసిన సినిమాల గురించి లోతుగా ఆలోచించేదాన్ని. ఆ ఆత్మపరిశీలన వల్లే కెరీర్ పరంగా నేను ఎక్కడ తప్పులు చేశానో నాకు స్పష్టంగా అర్థమైంది” అంటూ శ్రీలీల నిజాయితీగా ఒప్పుకున్నారు.
ఈ చిత్రం తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనదని చెబుతూ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామికి శ్రీలీల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “ఈ కథ చెప్పినప్పుడే ఇందులో పాటలు ఉండవని దర్శకుడు నాకు ముందే స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన ఆ మాటలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కథకు ఉన్న బలం అలాంటిది” అని ఆమె వెల్లడించారు. గత అనుభవాలు, పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటూ కొత్త తరహా కథలను ఎంచుకుంటున్న శ్రీలీల, కమర్షియల్ హంగులు లేని ‘ఓం’ లాంటి సీరియస్ సబ్జెక్ట్‌లో ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలంటే నవంబర్ 20 వరకు వేచి చూడాల్సిందే!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి