
సహజ నటి జయసుధ కేవలం 12 ఏళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తమిళ దర్శక దిగ్గజం కే. బాలచందర్ దర్శకత్వంలో అరంగేట్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె అతికొద్ది కాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన అందం, అభినయంతో దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. సుమారు 50 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కథానాయికగా, వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేశారు జయసుధ. ఓ వైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే, మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో మెప్పించారీ అందాల తార. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి.. ఇలా ఎందరో స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత స్టార్ హీరోలు, హీరోయిన్లకు అమ్మగా, అత్తమ్మగా, వదినగా నటించి మెప్పించారీ ముద్దుగుమ్మ. సినిమాల సంగతి పక్కన పెడితే.. బాలీవుడ్ స్టార్ జితేంద్ర సోదరుడు నితిన్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు జయసుధ. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారిలో చిన్న కుమారుడు శ్రేయాన్ హీరోగానూ నటించారు. కాగా 2017లో జయసుధ భర్త చనిపోయారు. ఇదిలాఉండగా.. 70, 80వ దశకాలలో జయసుధపై పలు రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా లోకనాయకుడు కమల్ హాసన్‌తో ఆమె రిలేషన్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో చిత్ర పరిశ్రమలో పుకార్లు వినిపించాయి. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడారు జయసుధ.
‘నేను, కమల్ హాసన్ స్టేజ్ మీద కలిసి పాడేవాళ్లం. కమల్ మంచి సింగర్. ఆయన పక్కన నిలబడితే నేను కూడా బాగా పాడేదానిని. మేం బాలచందర్ గారి సినిమాల్లో ఎక్కువగా నటించాం. ఆ రోజుల్లో పెద్ద వయసున్న హీరోలు ఉండేవారు. కమల్ హాసన్ మాత్రం గారు చిన్నగా, క్యూట్‌గా, హ్యాండ్సమ్గా కనిపిస్తూ జనం కళ్లలో పడ్డారు. ఈ అబ్బాయి ఎవరు? ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడు? ఇంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడు? అని అందరూ అనుకున్నారు. అప్పట్లో ఇతర హీరోలతో పోలిస్తే కమల్ హాసన్ కొత్తగా కనిపించాడు. అలాంటి సమయంలోనే నేను హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చాను. నన్ను కూడా ఈ అమ్మాయి చాలా క్యూట్‌గా, పెద్ద పెద్ద కళ్లు వేసుకుని అందంగా కనిపిస్తుందనుకునేవారు. అప్పట్లో బాలచందర్ గారి సినిమాలలో మేమిద్దరమే ఎక్కువగా ఉండేవాళ్లం. మేమిద్దరం బయట కనిపించినా, మేం స్టేజ్ మీద కలిసి పాడినా .. ఆ రోజుల్లో ఈ ఇద్దరూ జంటగా ఉంటే బాగుంటుంది, ముద్దు పెయిర్ అనుకునేవారు. దాంతో అసలు మీరు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు.. పాత విషయాలన్నీ అడుగుతారని మా స్నేహితులు చెప్పేవారు. కమల్ హాసన్ నాకు మంచి మిత్రుడు మాత్రమే. అంతకుమించి ఏం లేదు’ అని అసలు విషయం చెప్పేశారు జయసుధ. ప్రస్తుతం ఈ సహజ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.