
వెబ్ సిరీస్ రివ్యూ: సేవ్ ద టైగర్స్ 3
నటీనటులు: ప్రియదర్శి, అభినవ్ గోమఠం,కృష్ణ చైతన్య, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత తదితరులు
సంగీతం: అజయ్ అరసడ
సినిమాటోగ్రాఫర్: ఎస్.వి. విశ్వేశ్వర్
ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని
దర్శకుడు: శ్రీరామ్ ఎరగం
నిర్మాతలు: శివ మేక, సాహితీ చింతలపూడి
గత సీజన్ల మాదిరిగానే ఈ సీజన్ కూడా ఈ ముగ్గురు స్నేహితుల జీవితాల చుట్టూనే తిరుగుతుంది. ప్రముఖ నటి హంసలేఖ (సీరత్ కపూర్)తో జరిగిన ఒక చిన్న గొడవ తర్వాత గంటా రవి (ప్రియదర్శి) కుటుంబం తమ పాత ఇల్లు వదిలిపెట్టి కొత్త అపార్ట్‌మెంట్‌కు మారుతుంది. మరోవైపు రాహుల్ (అభినవ్ గోమఠం) తన కలలను పక్కనపెట్టి, ఏమాత్రం ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ విసుగు చెందుతుంటాడు. ఇక విక్రమ్ (కృష్ణ చైతన్య) పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. విడాకుల వ్యవహారంతో మనోవేదన అనుభవిస్తుంటాడు. ఇలా తమ జీవితాల్లోని కష్టాలతో, భార్యలతో వచ్చే సమస్యలతో పూర్తిగా విసిగిపోయిన ఈ ముగ్గురు ఏకంగా దేవుడినే నిలదీయాలని డిసైడ్ అవుతారు. సాక్షాత్తూ ఆ ఇంద్రుడినే (వెన్నెల కిషోర్) ప్రశ్నిస్తారు. అప్పుడు వీళ్ల జీవితాలను దారిలో పెట్టేందుకు చిత్రగుప్తుడు (గుండు సుదర్శన్) ఒక విచిత్రమైన, జీవితాలను మార్చేసే డీల్ (బంపర్ ఆఫర్) పట్టుకుని భూమి మీదకు వస్తాడు. అసలు ఆ డీల్ ఏంటి? దాని వల్ల ఈ ముగ్గురి భార్యాభర్తల జీవితాలు ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగాయి? అన్నదే ఈ మూడో సీజన్ కథ.
ఈ మూడో సీజన్‌కు శ్రీరామ్ ఎరగం కొత్తగా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే మొదటి రెండు సీజన్లను సూపర్ హిట్ చేసిన కామెడీ ఫార్ములాను ఆయన ఏమాత్రం మిస్ అవ్వలేదు. ఈసారి కథకు కొద్దిగా ఫాంటసీ (దేవుళ్లు భూమి మీదకు రావడం) టచ్ ఇవ్వడం వల్ల సిరీస్‌కి మంచి కొత్తదనం వచ్చింది. అది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి నవ్వులు పంచుతుంది. ప్రేక్షకులకు వినోదాన్ని ఇవ్వాలనే ఈ సిరీస్ అసలు ఉద్దేశం ఎక్కడా పక్కకు పోలేదు. కామెడీతో పాటు సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ కూడా చాలా సహజంగా పండాయి. అయితే కథనంలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మధ్యలో వచ్చే ఒకటి రెండు ఎపిసోడ్లు బాగా సాగదీసినట్లు అనిపిస్తాయి. సీన్స్ కాస్త నెమ్మదిగా బోర్ కొట్టేలా సాగుతాయి. స్క్రీన్‌ప్లే ఇంకాస్త క్రిస్పీగా, వేగంగా ఉంటే బాగుండేది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టేలా ఇందులో బూతు పదాలు మితిమీరి వాడారు. దీనికి తోడు వివాహేతర సంబంధాల గురించి పదే పదే వచ్చే సీన్స్ కుటుంబ ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. మొదటి రెండు సీజన్లకు ఫ్యామిలీస్ లో మంచి క్రేజ్ ఉన్నందున ఈ విషయాల్లో కాస్త జాగ్రత్త పడి ఉంటే రిజల్ట్ ఇంకా అద్భుతంగా ఉండేది.
ప్రియదర్శి, అభినవ్ గోమఠం ఎప్పటిలాగే తమదైన కామెడీ టైమింగ్‌తో ఇరగదీశారు. వాళ్ల ఎక్స్‌ప్రెషన్స్ ఎప్పటిలాగే నవ్విస్తాయి. కానీ ఈ సీజన్‌లో అందరినీ సర్ ప్రైజ్ చేస్తూ ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం విక్రమ్ పాత్ర చేసిన కృష్ణ చైతన్య. వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యే పాత్రలో ఆయన నటన, హావభావాలు, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉన్నాయి. ఈ సీజన్ కి బెస్ట్ పెర్ఫార్మర్ అతనే. ఇక భార్యల పాత్రల్లో జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి ఎప్పటిలాగే తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఈసారి దేవియాని శర్మకు ఒక సరికొత్త రోల్ దొరికింది. భర్త అంటే హడలిపోయే అమాయకపు భార్యగా ఆమె నటన భలేగా నవ్విస్తుంది. పనిమనిషిగా చేసిన రోహిణి సిరీస్‌కు పెద్ద బలంగా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రోహిణి నటన హైలైట్ అని చెప్పాలి. చిత్రగుప్తుడిగా గుండు సుదర్శన్ బాగా చేశారు. కానీ దేవుడిగా వెన్నెల కిషోర్ లాంటి గొప్ప కమెడియన్‌ను పెట్టుకుని, ఆయన టాలెంట్‌ను దర్శకుడు పూర్తిగా వాడుకోలేదనిపిస్తుంది. ఆయనకు మరిన్ని సీన్స్ ఇస్తే బాగుండేది.
సాంకేతికంగా ఈ సిరీస్ మునుపటి సీజన్ల స్థాయిలోనే చాలా నీట్‌గా ఉంది. అజయ్ అరసాడ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కామెడీ సీన్స్‌ని, ఎమోషన్స్‌ని బాగా ఎలివేట్ చేశాయి. రైటింగ్ డిపార్ట్‌మెంట్ ఎక్కడా నిరాశపరచలేదు. ముఖ్యంగా ప్రధాన పాత్రల మధ్య వచ్చే డైలాగులు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్.వి.విశ్వేశ్వర్ కెమెరా పనితనం సిరీస్ మూడ్‌ను పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్‌గా ఉన్నాయి. అయితే ఎడిటర్ శ్రవణ్ కటికనేని ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. మధ్యలో కొన్ని సాగదీత సీన్లను కట్ చేసి ఉంటే సిరీస్ మరింత స్పీడ్‌గా ఉండేది. కొత్త దర్శకుడు శ్రీరామ్ కొన్ని చిన్న చిన్న ల్యాగ్ సమస్యలను పక్కన పెడితే ఫ్రాంచైజీకి ఉన్న పేరును నిలబెట్టి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ అందించాడు.
ఓవరాల్ గా సేవ్ ద టైగర్స్ 3.. కొంచెం ఫాంటసీ, కొంచెం ఫ్రస్ట్రేషన్, బోలెడంత ఫన్..!