Itlu Arjuna Movie Review: ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. నగరంలో కొత్త పోరడు మ్యాజిక్ చేసాడా..?

ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోల సపోర్ట్.. టీమిండియా క్రికెటర్స్ నుంచి మెసేజెస్.. కింగ్ నాగార్జున సమర్పణ.. ఇవన్నీ కలిపి 'ఇట్లు అర్జున' సినిమాపై ఆసక్తి పెంచేలా చేసాయి. మహేష్ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ సినిమా ద్వారా అనీష్ రెడ్డి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. విడుదలకి ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం.. ప్రేక్షకుల అంచనాల అందుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Itlu Arjuna Movie Review: ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. నగరంలో కొత్త పోరడు మ్యాజిక్ చేసాడా..?
Itlu Arjuna Movie Review In

Edited By:

Updated on: Nov 13, 2026 | 6:58 AM

మూవీ రివ్యూ: ఇట్లు అర్జున

నటీనటులు: అనీష్ రెడ్డి, అనస్వర రాజన్, ముఖేష్ రిషి, కలైయరసన్, ఇలంగో కుమరవేల్, వెన్నెల కిషోర్ తదితరులు

ఎడిటింగ్: కోటి కె

సంగీతం: తమన్

సినిమాటోగ్రఫర్: రాజా మహాదేవన్

దర్శకత్వం: మహేష్ ఉప్పల

నిర్మాత: వెంకీ కుడుముల (వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్)

ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోల సపోర్ట్.. టీమిండియా క్రికెటర్స్ నుంచి మెసేజెస్.. కింగ్ నాగార్జున సమర్పణ.. ఇవన్నీ కలిపి ‘ఇట్లు అర్జున’ సినిమాపై ఆసక్తి పెంచేలా చేసాయి. మహేష్ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ సినిమా ద్వారా అనీష్ రెడ్డి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. విడుదలకి ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం.. ప్రేక్షకుల అంచనాల అందుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

పుట్టుకతోనే మాటలు రాని అర్జున్ (అనీష్) తన తండ్రితో కలిసి బాల్యం నుంచే దొంగతనాలను వృత్తిగా మార్చుకుంటాడు. దొంగ అనే ముద్ర పడటంతో అతడికి ఎవరూ స్నేహితులు కూడా ఉండరు. చిన్న వయసులోనే ఒక కేసులో జైలు శిక్ష కూడా అనుభవిస్తాడు. ఇదిలా ఉంటే, తన కుమారుడు మునిని పాలిటిక్స్ లోకి తీసుకురావడం కోసం పెద్దన్న (ముఖేష్ రుషి) హవాలా మార్గంలో ఏకంగా 1000 కోట్ల రూపాయలు రప్పించడానికి స్కెచ్ వేస్తాడు. కానీ ఆ భారీ మొత్తానికి సంబంధించిన డిజిటల్ కీ, పెన్ డ్రైవ్ వేరే వాళ్ళ చేతికి చిక్కుతాయి. అదే సమయంలో మునిని పెద్దన్న నమ్మిన బంటు గౌరీ (కలైయరసన్) రహస్యంగా అంతం చేస్తాడు. అసలు గౌరీ వేసిన ప్లాన్ ఏమిటి? పెద్దన్న ఆశపడిన ఆ 1000 కోట్లు అతనికి దక్కాయా? తన కొడుకును చంపింది తన మనిషే అన్న నిజం పెద్దన్నకు తెలిసిందా? ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్ హిరానీ (ఎలాంగో కుమారవేల్) పాత్ర ఏమిటి? కీర్తి (అనస్వర రాజన్)తో అర్జున్‌కు పరిచయం ఎలా ఏర్పడింది? మాటలు లేని ఆ యువకుడు తన మనసులోని ప్రేమను ఆమెకు ఎలా తెలియజేశాడు? తన ప్రేయసి కోసం ఆ కుర్రాడు చేసిన సాహసాలు ఏమిటి? అనేదే ఈ చిత్ర ఇతివృత్తం.

కథనం:

హీరో మూగవాడు కావడం అనేది ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఒక్క పాయింట్ మినహాయిస్తే మిగిలిన స్టోరీ లైన్ అంతా రెగ్యులర్ గానే అనిపించినా, దాన్ని తెరపై ప్రదర్శించిన విధానం మాత్రం విశేషంగా ఆకట్టుకుంటుంది. 1000 కోట్ల రూపాయల చుట్టూ అల్లిన డ్రామా, ఆ పాస్ వర్డ్ కోసం జరిగే వేట ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కు తోడుగా హాస్యాన్ని కూడా దర్శకుడు చాలా బ్యాలెన్స్డ్ గా మిక్స్ చేశాడు. ఎక్కడా కూడా చూసే వాళ్లకు విసుగు రాకుండా చాలా స్టైలిష్ మేకింగ్ తో మహేష్ ఉప్పల తన టాలెంట్ చూపించాడు. సినిమా ఫస్టాఫ్ అంతా ఎక్కువగా హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ మీదే నడుస్తుంది. దానికి సమాంతరంగా విలన్ గ్యాంగ్ డబ్బు కోసం చేసే అన్వేషణ క్యూరియాసిటీని పెంచుతుంది. మధ్యలో వెన్నెల కిషోర్ తనదైన టైమింగ్ తో నవ్వులు పూయిస్తాడు. లవ్ స్టోరీ చాలా ఆహ్లాదకరంగా, కొత్తగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ సమయానికి ప్రధాన జంట ఒక ఊహించని ప్రమాదంలో పడటం, అక్కడి నుంచి వాళ్ళు ఎలా బయటపడతారు అనే ఉత్కంఠను క్రియేట్ చేస్తూ సెకండాఫ్ మీద క్యూరియాసిటీ పెంచుతారు.

సెకండ్ హాఫ్‌కు వచ్చేసరికి కథలో ఎమోషన్స్ పాళ్లు కొద్దిగా పెరుగుతాయి. ఫస్ట్ హాఫ్ లాగానే ఇక్కడ కూడా బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రఘుబాబు వినోదాన్ని పంచుతూనే ఉంటారు. సినిమా క్లైమాక్స్‌కు ముందు వచ్చే 40 నిమిషాల ఎపిసోడ్ మాత్రం చాలా గ్రిప్పింగ్ గా డిజైన్ చేశారు. ఏకంగా విలన్ కోటలోకి హీరో ప్రవేశించడం, అక్కడ జరిగే పోరాట సన్నివేశాలు ఉర్రూతలూగిస్తాయి. హీరో హీరోయిన్లు కలుసుకోవడంతో కథ సుఖాంతం అయినప్పటికీ, ఆ 1000 కోట్ల మిస్టరీని మాత్రం సస్పెన్స్ గానే వదిలేసి సీక్వెల్ కు హింట్ ఇచ్చారు. హీరోకు మాటలు రావు అనే లోపం ఉన్నా కూడా దాన్నెక్కడా లోపంలా చూపించకుండా కవర్ చేసారు దర్శకుడు మహేష్. ముఖ్యంగా హీరోయిన్‌తో వచ్చే సన్నివేశాలన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి.. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ కూడా బాగుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే పాస్ వర్డ్ సీన్ కూడా బాగానే పండింది. లోపాన్నే ఆయుధంగా వాడుకున్నాడు దర్శకుడు మహేష్ ఉప్పల.

నటీనటులు:

డెబ్యూ మూవీ అయినా సరే అనీష్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్‌గా నటించారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా డాన్సులు చాలా అలవోకగా చేసేశాడు. యాక్షన్, కామెడీ సీన్లలో తన సత్తా చాటాడు. అయితే ఈ సినిమాలో మూగ క్యారెక్టర్ కావడంతో, అతని వాయిస్ బేస్ అండ్ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో చూడటానికి నెక్ట్స్ సినిమా వరకు చూడాల్సిందే. హీరోయిన్ అనస్వర తనదైన క్యూట్ నటనతో బాగా రిలీఫ్ ఇచ్చింది. కామెడీ కూడా చాలా బాగా చేసింది. చాలా రోజుల తర్వాత ముఖేష్ రుషికి మంచి పాత్ర పడింది.. కలైయరసన్, ఎలాంగో, రఘుబాబు, బ్రహ్మాజీ తమ తమ క్యారెక్టర్లకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్ళ పరిధి మేరకు చక్కగా నటించారు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు థమన్ అందించిన నేపథ్య సంగీతం చాలా చోట్ల అద్భుతంగా అనిపించింది… పాటలు కూడా బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా ఉన్నతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా కనిపిస్తుంది. తెర మీద పాటల పిక్చరైజేషన్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. ‘మాటలతో చెప్పలేని ప్రేమను, మాటలు రాని నేను ఎలా తెలియజేయగలను’ లాంటి డైలాగ్స్ బాగా కుదిరాయి. ఎడిటింగ్ ఎక్కడా కుదుపులు లేకుండా స్మూత్ గా సాగింది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా చాలా గ్రాండ్ గా ఉన్నాయి, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ఇట్లు అర్జున.. ఇంట్రెస్టింగ్ సినిమాతో వచ్చిన కొత్త పోరడు..!

ఓవరాల్ గా చూసుకుంటే, ‘ఇట్లు అర్జున’ మైండ్ బ్లోయింగ్ సినిమా కాకపోయినా, ఎలాంటి బోర్ ఫీలింగ్ లేకుండా ఎంటర్టైన్ చేస్తుంది. అనీష్ ఇండస్ట్రీకి దొరికిన మరో ప్రామిసింగ్ యంగ్ టాలెంట్ అని కచ్చితంగా చెప్పవచ్చు. డెఫినెట్ గా థియేటర్లలో చూడదగ్గ చిత్రమిది.

Loading...
Unable to load recommendations.
Follow Us