Newton’s 3rd law Review: ‘న్యూటన్స్ థర్డ్ లా’ మూవీ రివ్యూ.. సుమంత్ కర్మ సిద్ధాంతం వర్కవుట్ అయిందా..?

సుమంత్ చేసేవి తక్కువ సినిమాలే అయినా కూడా ఆసక్తికరమైన కథలకే ఓటేస్తుంటాడు. అలా ఆయన చేసిన సినిమా న్యూటన్స్ థర్డ్ లా. చిన్నపుడు చదువుకున్న ఎవ్రీ యాక్షన్ అనే ఫార్ములానే ఈ సినిమా కథ. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దామా..!

Newtons 3rd law Review: ‘న్యూటన్స్ థర్డ్ లా’ మూవీ రివ్యూ.. సుమంత్ కర్మ సిద్ధాంతం వర్కవుట్ అయిందా..?
Newton's 3rd Law

Edited By:

Updated on: Jul 31, 2026 | 11:36 AM

మూవీ రివ్యూ: న్యూటన్స్ థర్డ్ లా

నటీనటులు: సుమంత్ యార్లగడ్డ, జగపతిబాబు, త్రినాథ్ వర్మ, శ్రీనివాస్ అవసరాల, నేహా పఠాన్, రవివర్మ, షెల్లీ ఎన్ కుమార్, బేబీ అభినయన రెడ్డి తదితరులు

సినిమాటోగ్రఫీ: వేదవ్యాస్ గొట్టిపాటి

సంగీతం: సింజిత్ ఎర్రమిల్లి

ఎడిటింగ్: అనిల్ పసల

నిర్మాత: హరీష్ కోహిర్కార్

సమర్పణ: ఈటీవీ విన్ (ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్)

దర్శకుడు: రాజేష్ కర్ణ

కథ:

డేవిడ్ కిషోర్ (శ్రీనివాస్ అవసరాల) ఓ బిగ్ బిజినెస్ మ్యాన్.. కొన్నేళ్లుగా తన ఐడెండిటీని మార్చుకుని ఎక్కడో గ్యాంగ్ టక్‌లో బతుకుతూ ఉంటాడు. అలాంటి వాడి చేతికి ఒక కొరియర్ అందుతుంది. అందులో ‘న్యూటన్స్ థర్డ్ లా’ అనే బుక్ ఉంటుంది. ఆ పుస్తకంలోని విషయాలు తన సొంత గతాన్ని పోలి ఉండటంతో అతనికి భయం మొదలవుతుంది. ఆ బుక్ ఓపెన్ చేస్తే.. 1999 ప్రాంతంలో ఓ రోడ్డు ప్రమాదానికి గురై జ్యోతి (నేహా పఠాన్) ప్రాణాలు కోల్పోతుంది. ఆ వెంటనే వినయ్ (త్రినాథ్ వర్మ) అనే యువకుడు భవనం పైనుంచి కిందపడి మరణిస్తాడు. ఈ మిస్టరీని ఛేదించడానికి వాసుదేవ్ (సుమంత్) అనే అధికారి రంగప్రవేశం చేస్తాడు. పోస్టుమార్టంలో వినయ్ తలలో బుల్లెట్ ఉన్నట్లు తేలడంతో, ఆ యువకుడి తండ్రి గంగాధర్ (రవి వర్మ)పైనే వాసుదేవ్ గురిపెడతాడు. ఆధారాలు సేకరించి అతన్ని జైలుకు పంపుతాడు. ఆ తర్వాత ఈ కథలోకి అనుకోకుండా మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్ కమ్ క్రిమినల్ మెర్క్యురీ (జగపతిబాబు) ఎంట్రీ ఇస్తాడు. అసలు కాలేజ్ స్టూడెంట్ అయిన వినయ్ చావుకు, మెర్య్కూరితో ఏంటి సంబంధం..? అసలు డేవిడ్ ఎందుకు ఐడెండిటీ మార్చుకున్నాడు.. మధ్యలో ఈ కార్తీక్ ఎక్కడ్నుంచి వచ్చాడు..? అసలు ఆ బుక్ చదివి డేవిడ్ ఎందుకు వణికిపోతున్నాడు అన్నదే ఈ చిత్ర కథ..

కథనం:

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా సినిమాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఆ దర్యాప్తు ఎంత ఉత్కంఠభరితంగా సాగింది అనే దానిపైనే ఆయా సినిమాల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. దర్శకుడు రాజేష్ కర్ణ ‘న్యూటన్స్ థర్డ్ లా’ కోసం తీసుకున్న మూలకథ, కర్మ సిద్ధాంతం అనే పాయింట్ అద్భుతంగా ఉన్నాయి. పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ముడిపెట్టే ప్రయత్నం చేశారు. కానీ వాటిని తెరపై ఆవిష్కరించడంలో మాత్రం తీవ్రంగా తడబడ్డారు. మొదటి భాగం మొత్తం కేవలం తల్లిదండ్రుల విచారణతోనే సాగిపోతుంది. ధర్యాప్తులో వేగం లోపించడం వల్ల చూసే ప్రేక్షకులకు కాస్త బోర్ కొడుతుంది. త్రినాథ్ వర్మతో వచ్చే సీన్స్ అన్నీ బాగానే ఉంటాయి.. స్క్రీన్ ప్లే కూడా ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటుంది. అక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కానీ ఇంకాస్త టైట్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉండుంటే మాత్రం మంచి థ్రిల్లర్ అయ్యే లక్షణాలు ఈ సినిమాకు చాలానే ఉన్నాయి. ఇంటర్వెల్ సమయానికి అసలు నిందితుడిని పట్టుకున్నప్పటికీ.. అక్కడ్నుంచే అసలు కథ మొదలుపెడతాడు హీరో.. సెకండాఫ్‌లో ఇంకా అనేక చిక్కుముడులు విప్పాల్సి ఉంటుంది. ఇక్కడే దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఒక్కసారిగా అనేక కొత్త విషయాలు, ఊహించని మలుపులు తెరపైకి తీసుకురావడంతో అంతా గందరగోళంగా మారుతుంది. పతాక సన్నివేశాలు అయితే మరీ అయోమయానికి గురిచేస్తాయి. ప్రేక్షకుడిని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెట్టాల్సిన ఒక సస్పెన్స్ మూవీ.. ల్యాగ్ సీన్స్‌ గజిబిజి సన్నివేశాలతో యావరేజ్ థ్రిల్లర్‌గా మారిపోయింది. కాకపోతే ప్రతీ యాక్షన్‌కు సేమ్ అండ్ అపోజిట్ సమానమైన రియాక్షన్ ఉంటుందనే ఐడియా వరకు మాత్రం దర్శకుడు చాలా బాగా ప్రజెంట్ చేసాడు.

నటీనటులు:

స్పెషల్ ఆఫీసర్‌గా సుమంత్ నటన ఎంతో హుందాగా ఉంది. తన హావభావాలతో ప్రేక్షకులను మెప్పించారు, కానీ ఆయన తెరపై కనిపించే సమయం తక్కువే అనిపిస్తుంది. డేవిడ్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ అభినయం ఆకట్టుకుంటుంది. ఆయన పాత్రకు ఇచ్చిన మలుపులు బాగున్నాయి. ప్రతినాయక లక్షణాలున్న అతిథి పాత్రలో జగపతిబాబు తనదైన ముద్ర వేశారు. యువకుడు వినయ్ పాత్రలో త్రినాథ్ వర్మ అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. ఈ సినిమా ఈ కుర్రాడికి బాగా ప్లస్ అవుతుంది. అలాగే త్రినాథ్ స్నేహితుడిగా నటించిన కుర్రాడు కూడా తన పరిధి మేర రాణించాడు. తల్లిదండ్రులుగా నటించిన షెల్లీ, రవి వర్మ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తల్లీకూతుళ్లుగా రెండు విభిన్న పాత్రల్లో నేహా పఠాన్ చక్కటి ప్రదర్శన ఇచ్చింది.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు ప్రధాన బలం సింజిత్ అందించిన నేపథ్య సంగీతమే. పాటలు పర్లేదు కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంటుంది. వేద వ్యాస్ సినిమాటోగ్రఫీ బాగుంది.. ఆ పాత వింటేజ్ మూడ్ సినిమా అంతా కంటిన్యూ అయింది. ఎడిటింగ్ విభాగంలో అనిల్ మరింత శ్రద్ధ వహించాల్సింది. రన్ టైమ్ తక్కువే అయినా కూడా సెకండాఫ్ ల్యాగ్ అయింది. దర్శకుడు రాజేష్ ఎంచుకున్న ఐడియా గొప్పదే అయినప్పటికీ, దానిని మరింత ఆసక్తికరంగా తెరకెక్కించడంలో వెనకబడ్డాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా న్యూటన్స్ థర్డ్ లా.. యాక్షన్ రియాక్షన్.. కర్మ సిద్ధాంతం..!

Loading...
Unable to load recommendations.
Follow Us