First Time Movie Review : ‘ఫస్ట్ టైమ్’ మూవీ రివ్యూ.. సైన్స్ ఫిక్సన్ ఏలియన్ డ్రామా మెప్పించిందా..?

తెలుగులో సైన్స్ ఫిక్షన్‌ చిత్రాలు రావడం అరుదు. తాజాగా ‘ఫస్ట్ టైమ్’ సినిమా ఇదే కాన్సెప్ట్‌తో వచ్చింది.. సౌరబ్‌ ధింగ్రా, అఖిల్‌ సార్థక్‌, అనిక విక్రమ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. 2304వ సంవత్సరంలో ఏలియన్స్‌తో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. కలియుగం ఎలా అంతమైంది.. కొత్త సృష్టి ఎలా పుట్టింది అనే మూల కథాంశంతో తెరకెక్కింది.

First Time Movie Review : ‘ఫస్ట్ టైమ్’ మూవీ రివ్యూ.. సైన్స్ ఫిక్సన్ ఏలియన్ డ్రామా మెప్పించిందా..?
First Time Movie Review

Edited By:

Updated on: May 22, 2026 | 5:17 PM

మూవీ రివ్యూ: ఫస్ట్ టైమ్

నటీనటులు: సౌరభ్ ధింగ్ర, అఖిల్ సార్థక్, భూపాల్ రాజు, అనిక విక్రమన్‌, శివకుమార్ రామచంద్రవరపు, గాయత్రి గుప్తా, అన్నపూర్ణమ్మ తదితరులు

సినిమాటోగ్రఫీ: వేణు మురళీధర్, రామ్

సంగీతం: శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్

నిర్మాత- దర్శకత్వం: హేమంత్ ఇప్పలపల్లి

తెలుగులో సైన్స్ ఫిక్షన్‌ చిత్రాలు రావడం అరుదు. తాజాగా ‘ఫస్ట్ టైమ్’ సినిమా ఇదే కాన్సెప్ట్‌తో వచ్చింది.. సౌరబ్‌ ధింగ్రా, అఖిల్‌ సార్థక్‌, అనిక విక్రమ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

2304వ సంవత్సరంలో ఏలియన్స్‌తో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. కలియుగం ఎలా అంతమైంది.. కొత్త సృష్టి ఎలా పుట్టింది అనే మూల కథాంశంతో తెరకెక్కింది. ఆద్య (అనిక విక్రమన్‌) ఒక స్పెషల్‌ ఉమెన్‌. కాలేజీలో ఆద్యకు చాలా ఫాలోయింగ్ ఉంటుంది.. ఎవరు చూసినా ఆద్య ప్రేమను పొందాలని తాపత్రయపడుతుంటారు. అదే సమయంలో సొంత బావ కూడా ఆమెని పొందాలనుకుంటాడు.. ఆద్య మాత్రం తనకు సెట్‌ అయ్యే సోల్‌ మేట్‌ కోసం వెతుక్కునే క్రమంలో.. ఫ్రెండ్‌ (గాయత్రి గుప్తా) హెల్ప్ చేస్తుంది. కానీ ఆమె కూడా మోసం చేసి ఒక అపరిచిత వ్యక్తి వద్ద వదిలేస్తుంది. అక్కడ్నుంచి తప్పించుకొని వస్తుంది ఆద్య. ఆ తర్వాత కాలేజీలో తనకోసం కుర్రాళ్ల మధ్య గొడవ అవుతుంది. ఆది(అఖిల్‌ సార్థక్‌) వచ్చి తనని ఏడిపించే కుర్రాళ్లని కొడతాడు.. దీంతో ఆదికి ఇంప్రెస్‌ అవుతుంది ఆద్య. ఇద్దరూ ప్రేమలో పడతారు. అదే సమయంలో ఆద్య అనుకోకుండా ఓ ప్రమాదంలో ఇరుక్కుంటుంది. ఆమెని సేవ్‌ చేసేందుకు ప్రైవేట్‌ జెట్‌ సహాయంతో దూరంగా వెళ్లిపోతారు. కానీ మధ్యలో ఆమె స్పృహలోకి రావడంతో గొడవ అవుతుంది. దీంతో జెట్‌ క్లాష్‌ అవుతుంది. దాంతో చేసేదేం లేక తమను తాము కాపాడుకోవడం కోసం సముద్రంలోకి దూకుతారు. అక్కడ్నుంచి ఎలా బయటపడ్డారు..? సర్వైవల్ కోసం ఏం చేసారు.. పాత కెమికల్‌ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది..? దీనికి ఏలియన్స్‌కు ఏంటి సంబంధం.. మరో ప్రపంచంలోకి కథ ఎలా వెళ్తుందనేది అసలు కథ…

కథనం:

దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి ఎంచుకున్న పాయింట్ చాలా బరువైనది.. తెలుగు ఇండస్ట్రీకి బాగా కొత్త పాయింట్. 2304వ సంవత్సరం, ఏలియన్స్, కలియుగాంతం లాంటి సైన్స్ ఫిక్షన్, సోషియో-ఫాంటసీ అంశాలను బేస్ చేసుకుని రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రారంభంలోనే ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. భవిష్యత్తులో ఉన్న ఏలియన్స్‌కు.. గతంలో జరిగిన మానవ సృష్టి వినాశనాన్ని, అలాగే ఒక కొత్త సృష్టికి నాంది పలికిన పరిస్థితులను వివరించే క్రమం చాలా ఆసక్తికరంగా డిజైన్ చేశారు. అయితే, ఈ భారీ సెటప్‌ను ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఫస్టాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రధాన పాత్రల పరిచయాలు, ముగ్గురు విలన్లు (భూపాల్ రాజు, శివకుమార్, అఖిల్ సార్థక్) తమ స్వార్థం కోసం హీరోయిన్ అనికా విక్రమన్ వెంట పడే ట్రాక్.. ఇవన్నీ కథలోకి ప్రేక్షకుడిని నెమ్మదిగా తీసుకెళ్తాయి. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్ కొద్దిగా లాగ్ అనిపించినా, అసలు కాన్ఫ్లిక్ట్‌ను అర్థం చేసుకోవడానికి ఆ బేస్ అవసరం అనిపిస్తుంది.

ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సెకండాఫ్‌లోకి అడుగుపెట్టగానే కథనం పూర్తిగా గేర్ మార్చుకుంటుంది. హీరోయిన్ ఈ ముగ్గురు విలన్ల బారి నుంచి తప్పించుకునే క్రమంలో వచ్చే ఛేజింగ్ సీన్స్, మైండ్ గేమ్స్, దానికి తోడైన విజువల్స్ ప్రేక్షకులను పర్లేదనిపిస్తాయి. హీరో సౌరబ్ ధింగ్ర ఎంట్రీ, హీరోయిన్‌తో అతని ప్రయాణం, వారిద్దరి మధ్య నడిచే ఎమోషనల్ అండ్ యాక్షన్ ట్రాక్‌ను బాగానే ముందుకు నడిపించాయి. ముఖ్యంగా ఒక పవిత్రమైన స్త్రీ ద్వారా కొత్త సృష్టి ఎలా జరుగుతుంది అనే పాయింట్‌ను తెరపై విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో ఆవిష్కరించిన తీరు బాగుంది.. చిన్న సినిమా అయినా పెద్ద అటెంప్ట్ చేసారనిపిస్తుంది. కమర్షియల్ హంగుల కోసం కథను పక్కదారి పట్టించకుండా, తక్కువ బడ్జెట్ అయినప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకుండా.. కేవలం హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తో ఈ వరల్డ్‌ను క్రియేట్ చేసారు. ఎక్కడా కన్ఫ్యూజన్ కాకుండా ఏలియన్స్ ఎపిసోడ్స్‌ని కనెక్ట్ చేస్తూ.. సస్పెన్స్‌ను చివరి వరకూ బాగానే రాసుకున్నాడు దర్శకుడు.

నటీనటులు:

సౌరబ్ ధింగ్రకు మొదటి సినిమా అయినా ఎంతో కాన్ఫిడెంట్‌గా స్క్రీన్ మీద కనిపించాడు. హీరోయిన్ అనికా విక్రమన్ తన గ్లామర్‌తో పాటు పర్ఫార్మెన్స్‌తో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్‌లో తన మార్క్ చూపించగా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో భూపాల్ రాజు, శివకుమార్ ఎవరి పాత్రల్లో వారు ఒదిగిపోయారు. మైమ్ గోపి, అజయ్ రత్నం, అన్నపూర్ణమ్మ, గాయత్రి గుప్తా తదితరులు తమ పాత్రల పరిధి మేర అద్భుతంగా నటించి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.

టెక్నికల్ టీం:

శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్ అందించిన సంగీతం పర్లేదు.. ముఖ్యంగా శ్రీ వెంకట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఔట్ పుట్ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా నడుస్తున్న ఈ రోజుల్లో దాన్ని ఎక్కడా వాడకుండా కేవలం ‘హ్యూమన్ ఇంటెలిజెన్స్’తో దీన్ని తీసుకొచ్చారు. వేణు మురళీధర్, రామ్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. హేమంత్ ఆర్ట్స్ పతాకంపై హేమంత్ ఇప్పలపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాకు ప్రధాన బలం టెక్నికల్ టీమే.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ‘ఫస్ట్ టైమ్’.. చిన్న సినిమానే.. కానీ విభిన్నమైన ప్రయత్నం..!

Follow Us