
మూవీ రివ్యూ: బూకీ
నటీనటులు: అజయ్ దిషాన్, ఆర్.కె. ధనుష, పాండ్యరాజన్, సునీల్, మంచు లక్ష్మి, విజయ్ ఆంటోనీ (గెస్ట్ రోల్)
సంగీతం: విజయ్ ఆంటోనీ
నిర్మాతలు: ఫాతిమా విజయ్ ఆంటోనీ, రామాంజనేయులు జవ్వాజీ
దర్శకత్వం & సినిమాటోగ్రఫీ: గణేష్ చంద్ర
అజయ్ దిషాన్, ఆర్.కె. ధనుష జంటగా విజయ్ ఆంటోనీ నిర్మించిన జెన్ జీ కథ బూకీ. టైటిల్‌తోనే ఆకట్టుకున్న ఈ చిత్రంలో సునీల్, మంచు లక్ష్మి కూడా నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది..? మెప్పించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
కైలాష్ (అజయ్ దిషాన్), ఆళి (ఆర్.కె. ధనుష) ఆరేళ్లుగా డీప్ లవ్‌లో ఉంటారు. అంతా సాఫీగా సాగిపోతున్న టైమ్‌లో అనుకోకుండా ఓ చిన్న గొడవ జరుగుతుంది. ఆ చిన్న గొడవ కాస్తా పెద్దదై నడిరోడ్డుపై ఇద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్తుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఇగో హర్ట్ అయ్యి ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుంటారు. ఆ తర్వాత బ్రేకప్ బాధను కవర్ చేసుకోవడానికి కైలాష్ జిమ్, పార్టీలు, ఫ్రెండ్స్ అంటూ తిరుగుతాడు. ఆళి ఏమో ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత, ఆశ్రమాలు అంటూ దారి మళ్లుతుంది. ఆ తర్వాత ఏమైంది? నిజంగానే ఇద్దరూ ఒకరినొకరు మర్చిపోయారా? తమ తప్పు తెలుసుకుని మళ్లీ కలిశారా? వీళ్ళ మధ్యలో సునీల్, మంచు లక్ష్మి పాత్రలు ఎందుకొచ్చాయి అనేది మిగతా కథ.
కథనం:
జెన్-జీ యుగంలో ఉన్నాం కాబట్టి అన్నీ వాళ్లకు నచ్చేలా కథలు రాసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు వచ్చిన బూకీ కూడా అలాంటి కథే. ఇది సింపుల్ అండ్ నార్మల్ లవ్ బ్రేకప్ డ్రామా. పాయింట్ రిలేటబుల్‌గా ఉన్నా, డైరెక్టర్ దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యాడు. ఎమోషనల్ డెప్త్ లేకపోవడం, స్క్రీన్‌ప్లే నత్తనడకన సాగడంతో ఆడియన్స్‌కి బోర్ కొడుతుంది. యూత్‌కి కొన్ని సీన్స్ కనెక్ట్ అయినా.. ఓవరాల్‌గా ఒక బిలో-యావరేజ్ సినిమాగానే మిగిలిపోతుంది. వీకెండ్‌లో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళితే ఒకసారి టైమ్ పాస్ చేయొచ్చు. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే లీడ్ పెయిర్ యాక్టింగ్ & వాళ్ల మధ్య కెమిస్ట్రీ. అలాగే దర్శకుడే సినిమాటోగ్రఫర్ కూడా కావడంతో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించాయి. విజయ్ ఆంటోనీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను కంటిన్యూ చేసింది. కాకపోతే ఫస్ట్ హాఫ్‌లో విపరీతమైన సాగదీత, స్లో నేరేషన్ బాగా ఇబ్బంది పెడుతుంది. జెన్ జీ ఆడియన్స్‌కి కావాల్సిన ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం.. రొటీన్ అండ్ వీక్ స్క్రీన్‌ప్లే.. సునీల్, మంచు లక్ష్మి లాంటి వాళ్ల గెస్ట్ రోల్స్ తేలిపోవడం లాంటివి బూకీ సినిమాకు మైనస్ అయ్యాయి.
నటీనటులు:
కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిషాన్ హీరోగా బాగానే చేశాడు. జెన్-జీ కుర్రాడిగా, బ్రేకప్ తర్వాత బాధను దాచుకునే యాంగిల్‌లో తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్ ఆర్.కె. ధనుష క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. మోడరన్ ఇండిపెండెంట్ అమ్మాయి రోల్‌కి తను పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలైట్. సునీల్, మంచు లక్ష్మి, విజయ్ ఆంటోనీ క్యామియో రోల్స్ ఉన్నా.. అవి కథకు పెద్దగా బూస్ట్ ఇవ్వలేకపోయాయి.
టెక్నికల్ టీం:
విజయ్ ఆంటోనీ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్స్‌ని ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా రెండు పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయి. దర్శకుడు గణేష్ చంద్ర ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా కూడా వర్క్ చేశాడు కాబట్టి విజువల్స్ చాలా రిచ్‌గా, నీట్‌గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కానీ డైరెక్టర్‌గా మాత్రం కాస్త తడబడ్డాడు. కథలో మంచి పాయింట్ ఉన్నా.. స్క్రీన్‌ప్లే చాలా స్లోగా సాగడం మైనస్. ఎడిటింగ్ కూడా కాస్త మైనస్ అయింది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా బూకీ.. యావరేజ్ జెన్ జీ డ్రామా..!