
మూవీ రివ్యూ: బ్లాస్ట్
నటీనటులు : యాక్షన్ కింగ్ అర్జున్, ప్రీతి ముకుందన్, అభిరామి, పవన్, అర్జున్ చిదంబరం తదితరులు
సంగీతం: రవి బస్రూర్
సినిమాటోగ్రాఫర్: అరుణ్ రాధాకృష్ణన్
ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ్
దర్శకుడు: సుభాష్ కె రాజ్
నిర్మాత: ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్
తెలుగు విడుదల: సితార ఎంటర్‌టైన్మెంట్స్
యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్లాస్ట్ జోన్’. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెలుగులో సితార ఎంటర్‌టైన్మెంట్స్ విడుదల చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
ఈ కథ ఒక చిన్న కుటుంబం చుట్టూ తిరుగుతుంది. తండ్రి రాజారామ్ (అర్జున్), తల్లి (అభిరామి).. వాళ్ల కూతురు నిల (ప్రీతి ముకుందన్) ముగ్గరూ కరాటే మాస్టర్లే. చిన్నప్పటి నుంచే నిలను చాలా ధైర్యంగా పెంచుతారు. ఓ వైపు పిల్లలకు కరాటే శిక్షణ ఇస్తూనే.. మరోవైపు మెడికల్ షార్ నడిపిస్తుంటారు. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఓరోజు కృపాకర్ (పవన్) అనే రౌడీ మెడికల్ షాప్‌లో బలవంతంగా మందులు తీసుకుంటుంటే నీల కొడుతుంది. జైల్లో కూడా పెడతారు కృపాకర్‌ను.. ఆ గొడవ పెద్దదైపోతుంది. కృపాకర్ గ్యాంగ్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం) నీల కుటుంబంపై పగ పెంచుకుంటాడు. అనుకోకుండా ఈ కుటుంబానికి ఒక బడా బిజినెస్ మెన్, అలాగే ఒక లోకల్ రౌడీతో గొడవ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ గ్యాంగ్‌స్టర్లకు ఈ ఫ్యామిలీకి ఉన్న లింక్ ఏంటి? వాళ్ళను వీరు ఎలా ఎదుర్కొన్నారు? అన్నదే ఈ సినిమా కథ.
కథనం:
కథగా చూసుకుంటే ఇది మనం ఎన్నో సినిమాల్లో చూసిన రొటీన్ ప్లాట్. కానీ, దర్శకుడు దాని చుట్టూ అల్లిన పాత్రలు, ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. సినిమా మొదట్లో ఈ ప్రపంచాన్ని, పాత్రల నేపథ్యాన్ని పరిచయం చేయడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల కథనం నెమ్మదించినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో విలన్లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా అంత పవర్ ఫుల్ గా అనిపించవు. కానీ, ఒక్కసారి అసలు కథ మొదలయ్యాక స్క్రీన్‌ప్లే చాలా టైట్‌గా, ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా చుట్టుపక్కల వాళ్లకు ఏమాత్రం అనుమానం రాకుండా, గుట్టుచప్పుడు కాకుండా ఈ ఫ్యామిలీ రౌడీలను చితకబాదే యాక్షన్ ఎపిసోడ్స్ చాలా స్మార్ట్ గా డిజైన్ చేశారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఎక్కడా అతి లేకుండా మంచి ఫన్ కూడా జనరేట్ చేశారు. మొదటి సగంలో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఇంకా బాగుండేది. పైగా అర్జున్ స్వతహాగా కరాటే మాస్టర్ కావడంతో సీన్స్ మరింతగా ఎలివేట్ అయ్యాయి. ప్రీతి ముకుందన్ సీన్స్ కూడా బాగా వర్కవుట్ అయ్యాయి.
నటీనటులు:
యాక్షన్ కింగ్ అర్జున్ తనదైన స్టైల్‌లో కరాటే మాస్టర్‌గా చెలరేగిపోయారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆ పాత్రకు తగ్గ యాటిట్యూడ్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఇందులో బలమైన మహిళా పాత్రలు కనిపిస్తాయి. కూతురి మొండితనం చూసి భయపడే సాధారణ గృహిణిగా, అలాగే ఫ్యామిలీకి కష్టం వచ్చినప్పుడు రౌడీల ఎముకలు విరగ్గొట్టే డేరింగ్ ఉమెన్‌గా అభిరామి నటన అద్భుతం. ఇంటర్వెల్ సమయంలో ఆమె ట్రాన్స్‌ఫర్మేషన్ సీన్ బాగుంది. ఇక ఆఫీస్‌లో ఎదురయ్యే వేధింపులను ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కొనే బోల్డ్ క్యారెక్టర్‌లో ప్రీతి ముకుందన్ అదరగొట్టింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తాయి.
టెక్నికల్ టీం:
రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల ఆయన గత బ్లాక్‌బస్టర్ సినిమాలను గుర్తుకు తెచ్చినా.. సెకండాఫ్‌లో మాత్రం సన్నివేశాలకు బాగా సెట్ అయింది. యాక్షన్ సీక్వెన్స్‌లను సినిమాటోగ్రాఫర్ అరుణ్ రాధాకృష్ణన్ అద్భుతంగా కెమెరాలో బంధించి సినిమా స్థాయిని పెంచారు. ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్ సెకండాఫ్‌లో స్మూత్ గా సాగిపోయింది. AGS నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. ఇక దర్శకుడు సుభాష్ కె రాజ్ విషయానికి వస్తే.. ఒక పాత కథనే తీసుకున్నా, తన మార్క్ ప్రెజెంటేషన్ తో మెప్పించాడు. చాలా సన్నివేశాల్లో తన దర్శకత్వ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా బ్లాస్ట్ జోన్.. డీసెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్..!