
మూవీ రివ్యూ: అగధ
నటీనటులు: కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, భాను చందర్, వనితా విజయ్ కుమార్, షిజు తదితరులు
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
సంగీతం: రాకేష్ వెంకటాపురం
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: యం.ఎస్. రాజు
దైవ చింతన మెండుగా ఉండే మహాదేవి (కామాక్షి భాస్కర్ల) తన దగ్గరకు వచ్చే వాళ్ల బాధలు పోగొడుతూ ఉంటుంది. అనుకోకుండా ఆమె సొంత ఊర్లో ఉంటున్న వాళ్లకు ఆపద రావడంతో నేరుగా తన ఇంటికి చేరుకుంటుంది. అక్కడికి వెళ్లిన తర్వాత గర్భవతిగా ఉన్న మహిమ (ఉల్కా గుప్తా) ప్రాణాలు తీసుకోవడం ఆమెను కలవరపెడుతుంది. ఆ ఇంట్లో ఏదో అరిష్టం జరుగుతోందని ఆమె పసిగడుతుంది. తన సొంత బాబాయ్ (భానుచందర్), పిన్ని(వనితా విజయ్ కుమార్)తో పాటు వాళ్ల అమ్మాయి (జోవిక విజయ్ కుమార్) ప్రవర్తనలో ఊహించని మార్పులు రావడం, మరోవైపు చనిపోయిన మహిమ ప్రియుడు సింహా (శ్రవణ్ రెడ్డి) వ్యవహార శైలి కూడా విచిత్రంగా ఉండటం మహాదేవి గమనిస్తుంది. అసలు వీళ్లంతా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు..? చనిపోయిన మహిమ ఆత్మ మహాదేవికి ఏం చెప్పాలనుకుంది? ఈ మరణాల వెనుక ఉన్న ‘అగధ’ అనే రాక్షస శక్తి ఎవరు? ఆ శక్తిని ఎదుర్కోవడానికి మహాదేవి గురువు ఎలాంటి త్యాగం చేశాడు? చివరికి ఆ దుష్ట శక్తిని మహాదేవి ఎలా అంతం చేసింది అనేది ఈ సినిమా అసలు సారాంశం.
దేవుడికి, దెయ్యానికి మధ్య జరిగే పోరాటం, చివరికి రాక్షసత్వం మీద దైవత్వం గెలవడం అనే పాయింట్ ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటుంది. దర్శకుడు ఎమ్మెస్ రాజు గతంలో తీసిన ‘దేవి’ సినిమా ఛాయలు ఈ చిత్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆ పాత సినిమాలో ఉన్నంత బలమైన భావోద్వేగాలు కానీ, కట్టిపడేసే విషయాలు కానీ ఇందులో కాస్త లోపించాయి. కేవలం ఆ సినిమా వాతావరణాన్ని మాత్రమే ఇక్కడ వాడుకున్నట్లు స్పష్టమవుతుంది. ఇలాంటి సినిమాలకు బిగువైన స్క్రీన్ ప్లే చాలా అవసరం. మొదటి సగం వరకు దర్శకుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా కథను నడిపాడు. మొదట్లో వచ్చే సన్నివేశాలు, గుహ నేపథ్యంలో వచ్చే సీన్లు పర్వాలేదనిపిస్తాయి. అలాగే కథానాయికను పరిచయం చేసిన విధానం, ఆమె శక్తులను చూపే సన్నివేశాలు బాగున్నాయి. మెల్లగా ఇంట్లో సమస్యలు మొదలవడం, విరామం వచ్చే సమయానికి ఉత్కంఠను రేకెత్తించడం వరకు బాగానే సాగింది. కానీ అసలు సమస్య ద్వితీయార్థంలోనే మొదలవుతుంది. మొదటి భాగంలో రేకెత్తించిన ప్రశ్నలన్నింటికీ రెండో భాగంలో సరైన సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు రాజు. ఆత్మతో చెప్పించే గతం రొటీన్ గానే సాగుతుంది.
మాటల్లో దుష్టశక్తి గురించి చాలా భయంకరంగా వర్ణించారు కానీ, తెర మీద ఆ స్థాయిలో భయాన్ని పుట్టించడంలో కాస్త విఫలమయ్యారు. దైవశక్తి ఎంత గొప్పదో, అలాగే ఆ అగధ శక్తి ఎంత ప్రమాదకరమైనదో చూపించే సన్నివేశాలు పర్లేదు. దర్శకుడు ఈ సినిమాటిక్ ప్రపంచాన్ని సృష్టించడంలో ఓకే అనిపించాడు. కాకపోతే భయపెట్టడానికి చాలా అవకాశం ఉన్నప్పటికీ ఎందుకో ఆ దిశగా అడుగులు వేయలేదు. క్లైమాక్స్ దేవుడి దయ అన్నట్లుగా ముగుస్తాయి. బహుశా రెండో భాగం తీయాలనే ఆలోచనతోనే దర్శకుడు అసలు విషయాన్ని పూర్తిగా చూపించకుండా దాచిపెట్టాడేమో అనిపిస్తుంది.
మహాదేవి పాత్రలో నటించిన కామాక్షి భాస్కర్ల తన వంతుగా చాలా కష్టపడింది. సీరియస్ లుక్ లో ఆకట్టుకున్నప్పటికీ, సినిమా అంతా ఒకే రకమైన హావభావాలు పలికించడం కాస్త మైనస్ అయింది. ప్రతి నాయకుడి పాత్రలో కనిపించిన శ్రవణ్ రెడ్డి విలనిజం ఓకే. జోవికా విజయ్ కుమార్ కు దక్కిన రెండు మూడు సన్నివేశాల్లో తన ప్రతిభ చూపించింది. సీనియర్ నటులు భాను చందర్, వనితా విజయ్ కుమార్ లకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. ప్రాణాలు తీసుకునే అమ్మాయిగా ఉల్కా గుప్తా పర్వాలేదనిపిస్తుంది. గురువుగా నటించిన షిజుకు కథను మలుపు తిప్పే మంచి పాత్ర దొరికింది. మిగిలిన వాళ్లంతా తమ పాత్రల పరిధి మేరకు ఎలాంటి వంకలు పెట్టకుండా నటించారు.
ఈ సినిమాకు ప్రధాన బలం టెక్నికల్ టీం. నేపథ్య సంగీతం సినిమా మూడ్ కు తగ్గట్టుగా భయపెట్టేలా బాగా కుదిరింది. కెమెరామెన్ పనితనం తెరపై అద్భుతంగా కనిపిస్తుంది. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఆర్ట్ డైరెక్టర్ పనితనం ప్రతి ఫ్రేమ్ లోనూ స్పష్టంగా తెలుస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి ఏమాత్రం తగ్గకుండా చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఒక హారర్ సినిమాకు కావాల్సిన సాంకేతిక హంగులన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి.
ఓవరాల్ గా అగధ.. కొంచెం థ్రిల్.. మిస్టిక్ థ్రిల్లర్..!