DNK Movie Review : DNK సినిమా రివ్యూ.. లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి మళ్లీ మ్యాజిక్ చేసారా..?

యూ ట్యూబ్‌లో మౌళి టాక్స్ పేరుతో షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే మౌళి.. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో సడన్‌గా హీరో అయిపోవడమే కాదు.. అదిరిపోయే బ్లాక్‌బస్టర్ కొట్టారు. దాంతో వెంటనే మైత్రి మూవీ మేకర్స్ లాంటి బ్యానర్ నుంచి ఆఫర్ అందుకుని చేసిన సినిమానే ‘దొంగ నా కొడుకు’. సెన్సార్ పుణ్యమా అని దీని పేరు తర్వాత DNK గా మార్చారు. మరి ఆ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

DNK Movie Review : DNK సినిమా రివ్యూ.. లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి మళ్లీ మ్యాజిక్ చేసారా..?
Dnk Movie Telugu Review

Edited By:

Updated on: Nov 13, 2026 | 11:59 AM

మూవీ రివ్యూ: DNK

నటీనటులు: మౌళి, సుస్మిత శెట్టి, అలీ, రఘుబాబు, బబ్లూ, ప్రియా, గుండు సుదర్శన్, రజిత తదితరలు

సంగీతం: సింజిత్ ఎర్రమిల్లి

సినిమాటోగ్రఫర్: సూర్య బాలాజీ

ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్

దర్శకత్వం: శ్రీను కంభాల

యూ ట్యూబ్‌లో మౌళి టాక్స్ పేరుతో షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే మౌళి.. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో సడన్‌గా హీరో అయిపోవడమే కాదు.. అదిరిపోయే బ్లాక్‌బస్టర్ కొట్టారు. దాంతో వెంటనే మైత్రి మూవీ మేకర్స్ లాంటి బ్యానర్ నుంచి ఆఫర్ అందుకుని చేసిన సినిమానే ‘దొంగ నా కొడుకు’. సెన్సార్ పుణ్యమా అని దీని పేరు తర్వాత DNK గా మార్చారు. మరి ఆ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

యూట్యూబర్ నుంచి హీరోగా మారిన మౌళి తన డెబ్యూ మూవీ ‘లిటిల్ హార్ట్స్’ తో గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఏకంగా మైత్రీ మూవీ మేకర్స్ లాంటి బడా బ్యానర్ లో శ్రీను కంబాల అనే కొత్త దర్శకుడితో ‘డీఎన్‌కే’ అనే క్రైమ్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలి సినిమాతో భారీ హిట్ కొట్టిన మౌళి రెండో ప్రయత్నంలో కూడా సక్సెస్ అయ్యాడా? కొత్త దర్శకుడు శ్రీను కంబాల తన డెబ్యూ సినిమాతో ఆకట్టుకున్నాడా? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఈశ్వర్ (మౌళి) చదువు మధ్యలో ఆపేసి, ఎలాంటి పనీపాటా లేకుండా క్రికెట్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఈజీగా డబ్బు సంపాదించాలని చూసే కుర్రాడు. తల్లి దండ్రులు (అలీ, రజిత) ఎంత చెప్పినా కూడా వాళ్ల మాట అస్సలు వినడు. అతడు దీపు (సుష్మిత శెట్టి) అనే డబ్బున్న అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఈశ్వర్ ఆమె దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుని క్రికెట్ బెట్టింగ్‌లో పోగొడతాడు. ఈ విషయం తెలుసుకున్న దీపు తండ్రి పుల్లయ్య (రఘుబాబు), తన డబ్బు వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఈశ్వర్‌ను బెదిరిస్తాడు. అప్పుడు ఆ డబ్బు కోసం ఈశ్వర్ వేసిన ప్లాన్ ఏంటి..? అతడు ఒక బంగారు దుకాణం దోపిడీలో ఎలా ఇరుక్కున్నాడు..? ఆ దొంగతనం ఈశ్వర్ చేశాడా లేక వేరే ఎవరైనా చేశారా? ఈ సమస్యల నుంచి ఈశ్వర్ ఎలా బయటపడ్డాడు అనేది తెర మీదే చూడాలి.

కథనం:

టాలీవుడ్‌లో ‘మనీ’, ‘స్వామి రారా’, ‘బ్రోచేవారెవరురా’ సహా లాంటి ఎన్నో క్రైమ్ కామెడీ సినిమాలు వచ్చి ప్రేక్షకులను బాగా అలరించాయి. ఆ సినిమాలు అలా గుర్తుండిపోయాయంటే అందులో ఉన్న కథ కంటే కథనం చాలా ముఖ్యం. ఎందుకంటే స్క్రీన్ ప్లే బేస్డ్ క్రైమ్ కామెడీలకు తిరుగుండదు. కథ కాస్త అటూ ఇటూగా ఉన్నా.. కథనం వర్కవుట్ అయితే చాలు ఈ సినిమాలన్నీ దుమ్ము దులిపేస్తుంటాయి. ఈ ‘DNK’ కోసం కూడా దర్శకుడు శ్రీను కంభాల ఒక మంచి పాయింట్‌నే తీసుకున్నాడు, కానీ ఆ పాయింట్ ను ఎంగేజింగ్ గా చెప్పడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. క్రైమ్ కామెడీ సినిమాలకు కావాల్సిన ఫ్రెష్ నెస్ ఈ సినిమాలో ఎక్కడా కనిపించదు. ముఖ్యంగా కామెడీ కోసం గే క్యారెక్టర్స్ ను వాడుకోవడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నవ్వించాలని చూడటం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్ నుంచి ఇలాంటి నాసిరకం రైటింగ్ తో సినిమా రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సొంతంగా కామెడీ సీన్స్ రాసుకోలేక పాత బ్లాక్ బస్టర్ సినిమాల రిఫరెన్స్ లను దర్శకుడు యథేచ్ఛగా వాడేశాడు. ఖడ్గం, నువ్వు నాకు నచ్చావ్, శివాజీ, బిగిల్, చంద్రముఖి, ఓజీ లాంటి ఎన్నో సినిమాల డైలాగ్స్, సాంగ్స్ ను కామెడీ కోసం స్పూఫ్‌ల కింద వాడేసుకున్నాడు. అయితే దర్శకుడు రాసుకున్న కొన్ని ట్విస్టులు మాత్రం పర్వాలేదు అనిపిస్తాయి. ముఖ్యంగా లాఫింగ్ బుద్ధా విగ్రహంతో హీరో ఎంట్రీ, దానికి క్లైమాక్స్ లో ఇచ్చిన ముగింపు కాస్త ఆసక్తికరంగా ఉంటాయి. మొదటి సినిమాలో మౌళి చాలా నాచురల్ గా కనిపిస్తాడు, కానీ ఈ సినిమాలో అతన్ని అనవసరమైన స్లో మోషన్ షాట్స్ తో ఒక మాస్ హీరోలా చూపించడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సినిమా మొత్తం ఒక మూస పద్ధతిలో, పాత జోకులతో విసుగు తెప్పిస్తుంది. బిల్డప్ ఎక్కువగా కనిపించినా.. కథనంలో అంత సత్తా కనిపించదు.

నటీనటులు:

మౌళి తన కామెడీ టైమింగ్ తో సినిమాను లాక్కొచ్చే ప్రయత్నం బాగానే చేశాడు కానీ క్యారెక్టరైజేషన్ లో ఆ నాచురాలిటీ మిస్ అవ్వడంతో అంతగా వర్కవుట్ కాలేదు. హీరోయిన్ సుష్మిత శెట్టి పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదు, నటన కూడా ఆకట్టుకునేలా లేదు. భద్రం ఒక వెరైటీ కామెడీ విలన్ రోల్ లో కనిపించినా అతనికి ఆ పాత్ర సెట్ కాలేదు. రఘుబాబు, అలీ, రజిత, ప్రియ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నా వాళ్ళ పాత్రలు కూడా రొటీన్ గానే సాగుతాయి. స్క్రీన్ మీద కనిపించే ప్రతి ఆర్టిస్ట్ లౌడ్ గా కనిపించారు.

టెక్నికల్ టీం:

సంగీత దర్శకుడు సింజిత్ ఎర్రమిల్లి ఇచ్చిన లౌడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి అతి పెద్ద మైనస్. సాంగ్స్ కూడా ఏవీ రిజిస్టర్ కావు. కెమెరామెన్ సూర్య బాలాజీ పనితనం ఓకే అనిపిస్తుంది, ఉన్న బడ్జెట్‌లో బాగానే మ్యానేజ్ చేసారు. ఎడిటింగ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ బాగున్నా, సెకండ్ హాఫ్, ముఖ్యంగా క్లైమాక్స్ కు ముందు చాలా హడావిడిగా అనిపిస్తుంది. ఇక దర్శకుడు శ్రీను కంభాల రైటింగ్ విషయంలో పూర్తిగా నిరాశపరిచాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను మౌళిని చూసి నిర్మించినట్లు అనిపించింది..

పంచ్ లైన్:

ఓవరాల్‌గా DNK.. తేలిపోయిన స్క్రీన్ ప్లే.. దొంగ అడ్డంగా దొరికేసాడు..!

Loading...
Unable to load recommendations.
Follow Us