
దర్శకుడు జయంతి సి పరాంజీ ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి, అలాగే స్టార్ హీరోస్ సినిమాల రిజల్ట్స్ గురించి చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ సంతోషంగా ఉండడమే తన విజయ రహస్యమని ఆయన అన్నారు. ఏ విషయమూ తనను డిస్టర్బ్ చేయదని, చిన్నప్పటి నుండి ఇదే తన మానసిక స్థితి అని ఆయన తెలిపారు. సినిమా ఫ్లాప్ అయినా కూడా అది తనను బాధించదని, ఎందుకంటే జరిగిన దాని గురించి బాధపడడం వల్ల ప్రయోజనం ఉండదని అన్నారు. “టక్కరి దొంగ” సినిమా తనకు భారీ వాణిజ్య వైఫల్యాన్ని తెచ్చిపెట్టిందని, ఆర్థికంగా పెద్ద నష్టాన్ని చవిచూశానని జయంతి సి పరాంజీ గుర్తు చేసుకున్నారు. అయితే, ఆ సమయంలో కూడా తాను నవ్వుతూనే ఉన్నానని, ఏమి చేయలేనప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించడం ఉత్తమమని చెప్పేవారని తెలిపారు. “టక్కరి దొంగ” ఫ్లాప్ అయిన వెంటనే, తాను “ఈశ్వర్” సినిమా షూటింగ్‌కు వెళ్లిపోయానని, ఆ నష్టం నుండి కోలుకోవడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టిందని, ఆ తర్వాత తాను సంపాదించిన ప్రతి పైసా అప్పులు తీర్చడానికే ఉపయోగించానని వివరించారు. ఇది జీవితంలో ఒక భాగం అని, ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకోవచ్చని ఆయన అన్నారు. తన కళాత్మక అభిరుచుల గురించి మాట్లాడుతూ, చిన్నతనం నుండి పెయింటింగ్, డ్రాయింగ్ అంటే తనకు చాలా ఇష్టమని జయంతి సి పరాంజీ తెలిపారు. అన్ని రకాల కళా రూపాలంటే తనకు ప్రాణం అని, పెయింటింగ్, సంగీతం, డ్యాన్స్ ఏదైనా సరే ఆస్వాదిస్తానని చెప్పారు. భరతనాట్యం, కూచిపూడి కార్యక్రమాలకు వెళ్లేవాడినని, సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ మెంబర్‌గా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. తన చిన్ననాటి వాటర్ కలర్, ఆయిల్ పెయింటింగ్స్ ఇప్పటికీ తన తల్లి దగ్గర ఉన్నాయని తెలిపారు.
తన ఇంటిలో బాలీవుడ్, హాలీవుడ్ సినిమా పోస్టర్లు ఎక్కువగా ఉన్నాయని, తెలుగు సినిమా పోస్టర్లు ఎందుకు లేవని అడిగినప్పుడు, తనకు నచ్చిన రెండు తెలుగు క్లాసిక్ సినిమాలు “మాయాబజార్”, “ముత్యాల ముగ్గు” పోస్టర్లు దొరకలేదని ఆయన చెప్పారు. ఆన్‌లైన్‌లో, చెన్నైలో కూడా ప్రయత్నించినా, ఒరిజినల్ ప్రింట్లు లభించలేదని వివరించారు. “మాయాబజార్”, “ముత్యాల ముగ్గు” సినిమాలను ఇప్పుడు చూసినా అదే ఆనందం కలుగుతుందని అన్నారు. కె. విశ్వనాథ్ సినిమాలు అంటే తనకు ఎంతో ఇష్టమని, “సాగర సంగమం” వంటి చిత్రాలను తాను ఎంతగానో ఆస్వాదించానని తెలిపారు. “లక్ష్మీనరసింహా” సినిమాలో బాలకృష్ణ తండ్రి పాత్రలో నటించిన విశ్వనాథ్ గారిని డైరెక్ట్ చేయడం తన జీవితంలో ఒక గొప్ప ఘట్టంగా భావిస్తానని జయంతి సి పరాంజీ వెల్లడించారు. శంకరాభరణం కన్నా “సిరిసిరిమువ్వ”, “సీతామాలక్ష్మి” సినిమాలలో ఎక్కువ సోల్ ఉందని తాను భావిస్తానని, ఈ విషయాన్ని విశ్వనాథ్ గారితో చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారని చెప్పారు. శ్యామ్ బెనెగల్, బిమల్ రాయ్ వంటి వారి ఆర్ట్ ఫిల్మ్స్‌తో పాటు, మన్మోహన్ దేశాయ్ వంటి వారి వాణిజ్య చిత్రాలనూ తాను చూస్తానని తెలిపారు. బాపు గారి “అందాల రాముడు” తనకిష్టమైన సినిమా అని, అదే సమయంలో రాఘవేంద్ర రావు గారి చిత్రాలను కూడా చూస్తానని పేర్కొన్నారు.
తన వ్యక్తిగత శైలి గురించి మాట్లాడుతూ, టీ-షర్టుల్లోనే తాను సౌకర్యంగా ఉంటానని జయంతి సి పరాంజీ చెప్పారు. “ప్రేమించుకుందాం రా” సినిమా సమయంలో షర్టులు వేసుకున్నానని, అయితే కదిరిలో ఔట్‌డోర్ షూటింగ్‌కు వెళ్లినప్పుడు కాలర్లు ఇరిటేటింగ్‌గా అనిపించాయని, అప్పటి నుండి షర్టులకు గుడ్‌బై చెప్పి టీ-షర్టులకు మారానని తెలిపారు. చిరంజీవి గారి 60వ పుట్టినరోజు వేడుకకు బ్లాక్ టై డ్రెస్ కోడ్ ఉన్నా కూడా, తాను బ్లాక్ టీ-షర్టులోనే వెళ్ళానని, అక్కడున్న వందలాది మంది సూట్లు, టైలు ధరించి ఉంటే, తాను మాత్రమే టీ-షర్టులో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. తన భార్య కూడా తనను వేరే లుక్‌లో చూడాలని కోరుకుంటుందని, కొన్నిసార్లు కుర్తాలు వేసుకున్నా అవి తనకు సౌకర్యంగా ఉండవని జయంతి సి పరాంజీ నవ్వుతూ వివరించారు. తెర వెనుక తాను ఎలా ఉన్నా పర్వాలేదని, తెరపై నటులే అందంగా కనిపించాలని ఆయన అన్నారు.