డీకే శివకుమార్ కస్టడీని మరో ఐదురోజులు పొడిగింపు

The court has extended Karnataka Congress leader DK Shivakumar's custody by five days, డీకే శివకుమార్ కస్టడీని మరో ఐదురోజులు పొడిగింపు

మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ కస్టడీ ముగియడంతో ఈడీ కోర్టులో ప్రవేశపెట్టింది. డీకే శివకుమార్‌కు సెప్టెంబర్ 17వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 3వ తేదీన ఈడీ శివకుమార్‌ను అరెస్టు చేసింది. 9 రోజుల పాటు విచారణ చేసిన ఈడీ కస్టడీ గడువు ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టింది.

దర్యాప్తుకు సహకరించట్లేదు: ఈడీ

ఈడీ విచారణ సమయంలో అధికారులు అడుగుతున్న ప్రశ్నలను దాటవేయడం.. పొంతన లేని సమాధానాలు చెబుతూ దర్యాప్తును తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారంటూ ఈడీ కోర్టుకు తెలిపింది. బినామీ ఆస్తులు రూ.800 కోట్లతో పాటు ఆయన నగదు రూపంలో చేసిన రూ.200 కోట్ల అక్రమ లావాదేవీలపైనా దర్యాప్తు చేసినట్టు తెలిపింది. శివకుమార్‌ అక్రమ లావాదేవీలకు సంబంధించి అనేక దస్త్రాలను సంపాదించినట్టు ఈడీ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటారా వాదించారు. డీకేఎస్‌ తనకు తెలిసిన వాటిని కూడా చెప్పడంలేదన్నారు. మనీలాండరింగ్‌కు పాల్పడేందుకు అలవాటు పడ్డారని.. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పుగా పరిణమించే విషమయన్నారు. ఈ కేసులో పురోగతి కోసం మరికొన్ని రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించాలని కోరారు.

డీకేఎస్‌ ఆరోగ్యం క్షీణిస్తోంది: అభిషేక్‌ మను సింఘ్వీ

డీకేఎస్‌ తరఫున కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు విన్పించారు. శివకుమార్‌ ఆరోగ్యం బాగా లేదని.. ఆయనను ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. సెప్టెంబర్‌ 3న అరెస్టు చేసినప్పటి నుంచి రోజుకు 10గంటల పాటు విచారిస్తున్నారని తెలిపారు. 100 గంటలకు పైగా ఆయనను విచారించడంతో ఆరోగ్యం క్షీణించిందని కోర్టుకు తెలిపారు. బీపీ స్థాయి పెరిగిందన్నారు. అత్యంత ప్రమాదకరమైన నేరస్థులకు కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించుకొనే అర్హత ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో డీకేఎస్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. డీకేఎస్‌ ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తూ మరో ఐదు రోజుల పాటు ఆయన్ను ఈడీ కస్టడీకి అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *