వ్యాక్సిన్‌.. ఆరోగ్యవంతులు 2022 వరకు ఆగాల్సిందేః డబ్ల్యూహెచ్‌వో

|

Oct 16, 2020 | 6:29 PM

కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఆరోగ్యకరమైన యువత 2022 వరకు వేచి చూడాల్సిందేనని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు.

వ్యాక్సిన్‌.. ఆరోగ్యవంతులు 2022 వరకు ఆగాల్సిందేః డబ్ల్యూహెచ్‌వో
Follow us on

కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఆరోగ్యకరమైన యువత 2022 వరకు వేచి చూడాల్సిందేనని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. వ్యాక్సిన్ ప్రక్రియ మొదటిగా ఆరోగ్య సంరక్షణ కార్మికులకు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, కరోనా ప్రమాదం ఎక్కువగా పొంచి ఉన్నవారితోనే మొదలవుతుందని.. ఆ తర్వాత వృద్దులతో ప్రక్రియ కొనసాగుతుందని ఆమె అన్నారు. ”కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియకు చాలానే మార్గదర్శకాలు వస్తాయి. కానీ సగటు ఆరోగ్యకరమైన యువకుడు కరోనా టీకా పొందాలంటే 2022 వరకు వేచి చూడాల్సి వస్తుందని భావిస్తున్నట్లు” సౌమ్య స్వామినాధన్ వ్యాఖ్యానించారు. (Healthy young people Get Vaccine In 2022)

అలాగే 2021 నాటికి కనీసం ఒక్క సురక్షితమైన, సమర్ధవంతమైన కోవిడ్ వ్యాక్సిన్ అయినా వస్తుందని.. కానీ అది కూడా పరిమితి పరిమాణంలోనే అందుబాటులో ఉంటుందన్నారు. అందుకే కరోనా ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికే మొదటి ప్రాధాన్యత ఇస్తారని ఆమె చెప్పుకొచ్చారు. ప్రజలందరూ కూడా ఏప్రిల్ లోపు వ్యాక్సిన్ వచ్చేస్తుందని.. ఇక ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని అనుకుంటున్నారు. కానీ అలా ఉండదు.

చైనా, రష్యా లాంటి దేశాలు కూడా వ్యాక్సిన్ ప్రాధాన్యత పద్ధతినే అనుసరిస్తున్నాయి. చైనా జూలైలో మొదటిగా సైన్యానికి టీకాలు వేసింది.. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులకు, ఆరోగ్య సిబ్బందికి, స్టోర్ సిబ్బందికి ఇస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అలాగే విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా టీకాలు వేస్తోంది. ఇక రష్యా టీకా విషయంలో ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల కంటే జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చింది.

అలాగే భారతదేశంలో కూడా వ్యాక్సిన్ ప్రాధాన్యత ప్రక్రియ జాబితాను ఉన్నత స్థాయి కమిటీ రూపొందిస్తుంది. పలు కీలకమైన అంశాలపై స్టడీ చేసి ప్రక్రియను మొదలు పెడుతుంది. ప్రైవేటు, ప్రభుత్వ రంగాలకు చెందిన వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా కార్మికులు, నిఘా అధికారులు మొదలైన వారికి మొదట ప్రాధాన్యతనిస్తూ.. జాబితాలను సమర్పించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఇటీవల ఇంటర్వ్యూలో రాష్ట్రాలను కోరిన సంగతి తెలిసిందే.