వరంగల్‌లో దంపతులకు కరోనా !..రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కలకలం…

| Edited By: Pardhasaradhi Peri

Mar 21, 2020 | 5:41 PM

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. వైరస్ విస్తరించకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల్లో ఉన్న అవగాహన లోపం కనిపిస్తోంది. వైరస్ లక్షణాలున్న వారిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నప్పటికీ పలువురు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు...

వరంగల్‌లో దంపతులకు కరోనా !..రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కలకలం...
Follow us on

కోవిడ్ -19: ప్రాణాంతక మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 11 వేల మందిని బలితీసుకుంది. ఈ వైరస్‌తో విశ్వవ్యాప్తంగా ఆరోగ్య పరిస్థితులు దిగజారాయని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. దేశాలు దాటి విస్తరించిన వైరస్..ఇప్పుడు తెలంగాణలోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. వైరస్ విస్తరించకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల్లో ఉన్న అవగాహన లోపం కనిపిస్తోంది. వైరస్ లక్షణాలున్న వారిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నప్పటికీ పలువురు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా ముంబై నుంచి తప్పించుకుని వచ్చిన వ్యక్తిని ఎల్బీనగర్‌లో స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. కాగా, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో మరో ఇద్దరు దంపతులు కరోనా లక్షణాలతో కనిపించిన ఘటన కలకలం రేపింది. ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకున్న భార్య భర్తల్ని రైల్వే అధికారులు గుర్తించారు.

వరంగల్ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్ మీదుగా రాజధాని ఎక్స్ ప్రెస్ 2020, మార్చి 21వ తేదీ శనివారం వెళుతోంది. బీ 3 బోగీలో ఉన్న దంపతులను టీసీ గుర్తించారు. వీరి చేతుల మీదు ఐసోలేషన్‌లో చికిత్స చేసినట్లుగా గుర్తించే ముద్ర ఉంది. దీనిని టీసీ గమనించి..ప్రశ్నించారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో పై అధికారులకు విషయాన్ని తెలియచేశారు. వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. కాజీపేట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. 108 వాహనం ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో బీ 3 బోగీలో ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వైద్యాధికారులు అక్కడకు చేరుకుని రసాయనాలు చల్లారు. ఆ ప్రాంతమంతా శానిటైజర్ స్ప్రే చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఈ దంపతులను స్క్రీనింగ్ టెస్టులు చేశారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆసుపత్రిలోని గాంధీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ సందర్భంగా వారి చేతులపై ముద్ర వేసి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకుని వెళ్లి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కినట్లుగా తెలుస్తోంది.