HEALTH EMERGENCY: ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ.. ప్రకటించేందుకు డబ్ల్యూహెచ్ఓ రెడీ.. కానీ మీనమేషాలెందుకంటే?

|

May 13, 2021 | 10:24 AM

ఏడాదిన్నరగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పాండమిక్ పరిస్థితిని వరల్డ్ xహెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించేందుకు రంగం రెడీ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ దిశగా ప్రకటన చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ...

HEALTH EMERGENCY: ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ.. ప్రకటించేందుకు డబ్ల్యూహెచ్ఓ రెడీ.. కానీ మీనమేషాలెందుకంటే?
World Health Organisation Logo, Coronavirus
Follow us on

HEALTH EMERGENCY ACROSS THE WORLD: ఏడాదిన్నరగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ (CORONA VIRUS) పాండమిక్ పరిస్థితి (PANDEMIC SITUATION)ని వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించేందుకు రంగం రెడీ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ దిశగా ప్రకటన చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WORLD HEALTH ORGANISATION) ఎప్పుడో రెడీ అయినా.. కొన్ని అగ్రదేశాల సానుకూలత కనిపించకపోవడంతో మీనమేషాలు లెక్కిస్తున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా (INTERNATIONAL MEDIA) కథనాలు వస్తున్నాయి. ఇంతటి దారుణమైన ఆరోగ్య అత్యయిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేని కారణంగా ప్రస్తు కరోనా పాండమిక్ పరిస్థితిని వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాల్సిందేనని కొన్ని సంస్థలు గట్టిగానే కోరుతున్నాయి. అయితే తుది నిర్ణయంలో మాత్రం జాప్యం జరుగుతోంది.

యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కోవిడ్ మహమ్మారి ఇప్పటి వరకు దాదాపు 33 లక్షల మందిని బలితీసుకుంది. అయితే, ఈ విపత్తును ఎదుర్కొనే సమయంలో తీసుకున్న పేలవమైన నిర్ణయాల కారణంగానే ప్రస్తుత సెకెండ్ వేవ్ (CORONAVIRUS SECOND WAVE) సంక్షోభానికి కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనే సంసిద్ధతపై ఏర్పడిన అంతర్జాతీయ నిపుణుల బృందం ఈ మేరకు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులు నివారించడానికి ఓ ‘అంతర్జాతీయ అప్రమత్త వ్యవస్థ’ (HEALTH EMERGENCY SYSTEM) అవసరమని ‘కొవిడ్‌-19: మేక్‌ ఇట్‌ ఇన్‌ ది లాస్ట్‌ పాండమిక్‌’ (COVID-19: MAKE IT IN THE LAST PANDEMIC) పేరుతో అంతర్జాతీయ నిపుణుల బృందం రూపొందించిన నివేదిక సూచించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యవసర స్థితిని ప్రకటించడంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆలస్యం చేసిందని తమ నివేదికలో నిపుణుల బృందం అభిప్రాయపడింది. ఈ కారణంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థలో సమూల సంస్కరణలు అవసరమని తెలిపింది నిపుణుల బృందం.

చైనా (CHINA)లోని వూహన్ (WUHAN) నగరంలో 2019 డిసెంబర్‌లో కరోనా వైరస్ బయట పడినా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ దానిని గుర్తించి, తదనుగుణంగా స్పందించలేదని అంతర్జాతీయ నిపుణుల బృందం ఆరోపించింది. అందువల్లే యావత్ ప్రపంచం, పరిశోధనా సంస్థలు, వివిధ దేశాల ప్రభుత్వాలు.. అత్యంత కీలకమైన ఫిబ్రవరి 2020ని కేవలం పరిస్థితులను అంచనా వేసేందుకు కేటాయించి.. విలువైన సమయాన్ని నష్టపోయాయని నిపుణులు అంటున్నారు. ది ఇండిపెండెంట్ ప్యానెల్ ఫర్ పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్ అండ్ రెస్పాన్స్ (THE INDEPENDENT PANNEL FOR PANDEMIC PREPAREDNESS AND RESPONSE) అనే సంస్థ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఫల్యంతోపాటు.. వివిధ దేశాల బలహీన వ్యూహాలు, దేశాల మధ్య సమన్వయం కొరవడడం, ఆరోగ్య వ్యవస్థలు, పరిశోధనా సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం వెరసి.. కరోనా వైరస్ మానవాళికి పెనుముప్పుగా మారిందని ఐపీపీపీఆర్ (IPPPR) తన నివేదికలో విశ్లేషించింది.

ప్రపంచంలో ఎక్కడ ఏ రకమైన ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనా వెంటనే స్పందించి.. యావత్ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయాల్సిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ దిశగా వేగవంతమైన పరిశోధనలు జరపడంలోను, అధ్యయన బృందాలు నిష్పాక్షికంగా పనిచేసేలా చూడడంలోను, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలోను విఫలమైందని వైద్య నిపుణుల అభిప్రాయంగా కనిపిస్తోంది. ప్రజారోగ్యాన్ని పరిరక్షించుకునే వ్యవస్థలు పూర్తిగా విఫలమవడంతోపాటు.. సైన్సును కాదనే నేతలు ఆరోగ్య వ్యవస్థలో ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని ఐపీపీపీఆర్ నివేదిక పేర్కొన్నది. 2019 డిసెంబర్ నుంచి 2020 ఫిబ్రవరి దాకా కరోనా మహమ్మారి ముప్పును పసిగట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు.. అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఏమీ చేయలేకపోయాయని నివేదికలో విశ్లేషించారు. దీనికి అమెరికా (AMERICA) లాంటి అగ్రరాజ్యంలోనే లక్షలాది మంది కరోనాకు బలవడమే ప్రత్యక్ష నిదర్శనంగా ఉదహరించారు. తాజాగా కరోనా సెకెండ్ వేవ్ భయం ప్రపంచ దేశాలను వెంటాడుతున్న తరుణంలో పరస్పరం ఏ ఒక్క దేశమూ సహకరించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం విపత్తు నుంచి బయటపడాలంటే ధనిక దేశాలు.. వేల కోట్ల స్థాయిలో కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి.. పేద, మధ్య తరగతి దేశాలకు ఫ్రీగా పంపిణీ చేయడమే మార్గంగా కనిపిస్తోందని ఐపీపీపీఆర్ నివేదికలో నిపుణులు సూచించారు.

కరోనా వైరస్ ఎప్పుడు అంతమవుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ కరోనా వైరస్‌పై మానవాళి విజయం సాధించినా.. భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు ఎదురు కావని నమ్మకం లేదు. అందుకే ఇలాంటి ఉపద్రవాలను అంచనా వేసి.. తదనుగుణంగా వేగంగా స్పందించే ప్రపంచ స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి వుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఓ నూతన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ధనిక దేశాలకు ఐపీపీపీఆర్ పిలుపునిచ్చింది. ఈ పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా డబ్ల్యూహెచ్‌ఓ (WHO) వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని సూచించింది. ఇలాంటి విపత్కర సందర్భంలో డబ్ల్యూహెచ్‌ఓ నాయకత్వంతో పాటు సిబ్బంది చేస్తున్న కృషిని నిపుణుల బృందం ప్రశంసిస్తూనే కొన్ని లోపాలను, వైఫల్యాలను ఎత్తి చూపించింది ఐపీపీపీఆర్ బృందం.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విలయం, ఫ్యూచర్‌లో ఏర్పడే మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్ధతపై ఓ రిపోర్టును రూపొందించాలన్న ఉద్దేశంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెంబర్ కంట్రీస్ నిర్ణయించాయి. ఇందుకోసం న్యూజిలాండ్‌ (NEWZEALAND) మాజీ ప్రధాని హెలెన్‌ క్లార్క్‌, లైబీరియా (LYBIRIA) మాజీ అధ్యక్షుడు ఎల్లెన్‌ జాన్సన్‌ సర్లీఫ్‌ అధ్యక్షతన అంతర్జాతీయ నిపుణులతో కూడిన ఓ ఇండిపెండెంట్ టీమ్ ఏర్పడింది. గతేడాది ఏర్పాటైన ఈ నిపుణుల బృందం.. మహమ్మారిని ఎదుర్కోవడంలో తీసుకోవాల్సిన చర్యలు, జీ7 (G7), జీ20 (G20) దేశాల మద్దతు, పేద దేశాలకు వ్యాక్సిన్ల సరఫరా, వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకు నిధులు, సాంకేతికత బదలాయింపు వంటి సూచనలతో కూడిన తుది నివేదికను తాజాగా విడుదల చేసింది. దీనికి అనుగుణంగా వేగవంతమైన నిర్ణయాలతోనే కరోనాపై మానవాళి విజయం సాధించే అవకాశం వుంది. దానితోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు ఎదురైతే ధీటుగా ఎదిరించి.. ప్రపంచ ప్రజలను రక్షించుకునే అవకాశం వుంటుంది.