#COVID19 వారిని గుర్తించేందుకు జియో ట్యాగింగ్.. తెలంగాణ పోలీసుల ప్రయోగం

| Edited By: Pardhasaradhi Peri

Mar 28, 2020 | 12:39 PM

విదేశాల నుంచి వచ్చి క్వారెంటైన్ కాని వారిని గుర్తించడం, క్వారెంటైన్ చేసిన వారి కదలికలను ప్రతీ క్షణం పరిశీలిస్తుండడం కోసం తెలంగాణ పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

#COVID19 వారిని గుర్తించేందుకు జియో ట్యాగింగ్.. తెలంగాణ పోలీసుల ప్రయోగం
Follow us on

Geo tagging surveillance on home quarantined persons in Telangana: విదేశాల నుంచి వచ్చి క్వారెంటైన్ కాని వారిని గుర్తించడం, క్వారెంటైన్ చేసిన వారి కదలికలను ప్రతీ క్షణం పరిశీలిస్తుండడం కోసం తెలంగాణ పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కరోనా జియో ట్యాగింగ్ టెక్నాలజీని ఇందుకోసం వినియోగిస్తున్నారు. ఆధునిక టెక్నాలజీతో, సాంకేతిక నిపుణులైన అధికారుల బృందంతో తెలంగాణ పోలీసులు సిద్దమయ్యారు. విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి వారి కదలికలపై నిరంతర నిఘా కోసం తెలంగాణ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.

టీఎస్ కాప్‌లో ఈ సరికొత్త అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు తెలంగాణ పోలీసులు. ఒక్కరోజులోనే హౌస్ క్వారంటైన్ అప్లికేషన్‌లో విదేశాల నుండి తెలంగాణకు వచ్చిన 22 వేల మంది వివరాలను పొందుపరచారు. వారం రోజుల నుంచి హౌస్ క్వారంటైన్‌లో ఉన్న వారి కదలికలను పరిశీలిస్తున్నారు పోలీసులు. అప్లికేషన్‌లో నమోదైన వివరాలు జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేశారు. ఇంటి నుండి 50 మీటర్ల జియో ట్యాగింగ్ పరిధి దాటి బయటకు వస్తే తక్షణమే పోలీస్ కంట్రోల్‌‌కు ఆటో మేటిక్‌గా సమాచారం అందేలా వ్యవస్థను సిద్దం చేశారు.

నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకుని, వారిని తిరిగి క్వారెంటైన్‌కు తరలించేలా మెకానిజంను సిద్దం చేసుకున్నారు. నిబద్ధతను చాటి చెబుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఇది ఒక రకంగా విదేశాలనుండి తెలంగాణకు వచ్చిన వారికి ఇది ఒక లక్ష్మణరేఖ అని పోలీసు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.