ఆరునెల్లలో అందుబాటులోకి కరోనా ఔషదాలు

|

Mar 18, 2020 | 8:47 AM

కరోనా వైరస్‌తో పాటు ఇతర వైరస్‌లకూ చెక్‌పెట్టే దిశగా మరో కీలక అడుగుపడింది. వైరస్‌కు విరుగుడు ఔషధం తయారీలో హైదరాబాద్‌లోని ఐఐసీటీ తో ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా చేతులు కలిపింది. వీరిద్దరి సారధ్యంలో మరో...

ఆరునెల్లలో అందుబాటులోకి కరోనా ఔషదాలు
Follow us on

కొవిడ్-19: ప్రస్తుతం ప్రపంచదేశాలను పట్టి పీడిస్తోన్న మహమ్మారి కరోనా. వ్యాక్సిన్ లేని ఈ వైరస్ భూతం ఇప్పటికే వేలాది మందిని పొట్టబెట్టుకుంది. దీనిని అరికట్టేందుకు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌తో పాటు ఇతర వైరస్‌లకూ చెక్‌పెట్టే దిశగా మరో కీలక అడుగుపడింది. వైరస్‌కు విరుగుడు ఔషధం తయారీలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)తో ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా చేతులు కలిపింది. వీరిద్దరి సారధ్యంలో మరో ఆరు నెలల్లోనే ఔషదాలు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి.

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ), ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా ఉమ్మడిగా వైరస్ ఔషద తయారీకి ముందుకు వచ్చాయి. కరోనా లాంటి భయంకర వైరస్‌లను అడ్డుకునే మూడు యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియంట్లను ఐఐసీటీ యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తుండగా.. వాటిని ఔషధాలుగా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిప్లా ముందుకొచ్చింది. రెమిడెస్‌విర్, బెలాక్సివిర్, ఫెవిపిరవిర్‌ అనే మూడు రసాయనాలు వైరస్‌లను నిరోధించేందుకు సమర్థంగా ఉపయోగపడతాయని ఐఐసీటీ శాస్త్రవేత్తలు గుర్తించగా.. వాటిని పారిశ్రామిక స్థాయిలో తయారు చేసి ఇస్తే, తాము మాత్రలు తయారు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామని సిప్లా కంపెనీ ప్రతిపాదించింది. ఫలితంగా కొవిడ్‌-19తో పాటు ఇతరత్రా పలు వైరస్‌లకు విరుగుడుగా పనిచేసే అవకాశం ఉన్న ఔషధాలు ఆరునెలల్లో అందుబాటులోకి వస్తాయన్న విశ్వాసాన్నిఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ వెల్లిబుచ్చారు. ఈ మూడు మందులపై ఒకట్రెండు క్లినికల్‌ ట్రయల్స్‌ ఇప్పటికే పూర్తయ్యాయని, వేర్వేరు కారణాల వల్ల మార్కెట్‌లోకి రాని వాటిని అత్యవసర పరిస్థితుల్లో నేరుగా ఉపయోగించే అవకాశం ఉండటం విశేషమని చెప్పారు.

సిప్లా అధినేత డాక్టర్‌ హమీద్‌ మంగళవారం ఐఐసీటీకి మెయిల్‌ పంపుతూ ఈ మందులను ఎలాంటి షరతుల్లేకుండా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారని, ఇందుకు తగ్గట్లుగా తాము వాటిని ఆరు నుంచి ఎనిమిది వారాల్లో రెండు మందులను (రెమిడిస్‌విర్, ఫెవిపిరవిర్‌) కావాల్సినంత మోతాదులో తయారు చేసి సిప్లాకు అందిస్తామని ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ వివరించారు. ఆ తరువాత కొన్ని ప్రభుత్వ అనుమతులతో వీలైనంత వేగంగా వాటిని అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. అన్నీ సవ్యంగా జరిగితే 6 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావొచ్చన్నారు. ఐఐసీటీ, సిప్లా గతంలో కలిసి పనిచేసిన అనుభవాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. 1989లో హెచ్‌ఐవీకి యాంటీ వైరల్‌ తయారీలో ఐఐసీటీతో కలిసి సిప్లా తక్కువ వ్యయంలో ఔషధాలను తయారు చేసి ఆఫ్రికా సహా ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేసిందన్నారు. కొన్ని క్యాన్సర్‌ ఔషధాల తయారీలోనూ కలిసి పనిచేశామని చంద్రశేఖర్‌ తెలిపారు.