వైద్యుల నిర్ల‌క్ష్యం..న‌డిరోడ్డుపై క‌రోనా ల‌క్ష‌ణాల‌తో వృద్దుడు మృతి

|

Apr 11, 2020 | 10:51 AM

హైద‌రాబాద్‌లో దారుణ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కార‌ణంగా కరోనా లక్షణాలున్న ఓ వృద్దుడు న‌డిరోడ్డుపై ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘ‌ట‌న న‌గ‌రంలోని ..

వైద్యుల నిర్ల‌క్ష్యం..న‌డిరోడ్డుపై క‌రోనా ల‌క్ష‌ణాల‌తో వృద్దుడు మృతి
Follow us on
హైద‌రాబాద్‌లో దారుణ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కార‌ణంగా కరోనా లక్షణాలున్న ఓ వృద్దుడు న‌డిరోడ్డుపై ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘ‌ట‌న  న‌గ‌రంలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు వెనుక‌డుగువేస్తున్నారు. స్థానికులు భ‌యాందోళ‌కు గుర‌వుతున్నారు.
నేపాల్ కి చెందిన బహదూర్ అన‌బ‌డే 70 ఏళ్ల వృద్ధుడు సికింద్రాబాద్ లాలాపేట్‌లోని ఓ బార్ లో పనిచేస్తుంటాడు. అయితే, గ‌త కొద్ది రోజులుగా దగ్గు, జలుబు ఎక్కువగా ఉండడంతో స్థానిక లాలాపేట్ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడి వైద్యులు కరోనా అనుమానం వచ్చి అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి పంపించారు. అక్కడ రోగులు ఎక్కువగా ఉండడంతో గాంధీ వైద్యులు కింగ్ కోటి ఆసుపత్రికి తరలించారు.
అత‌న్ని పరీక్షించిన కింగ్ కోఠి ఆసుపత్రి వైద్యులు.. కరోనా లక్షణాలు ఉండడంతో తిరిగి గాంధీ ఆసుపత్రికి వెళ్ళమని చెప్పారు. అంబులెన్స్ లేకపోవడంతో ఆ వృద్ధుడు గంటల తరబడి అక్క‌డే ఉన్నాడు. ఇంకా అంబులెన్స్ రాదని.. దగ్గు ఎక్కువకావ‌డంతో తానే స్వయంగా గాంధీకి నడుచుకుంటూ బయలుదేరాడు.
మార్గ మధ్యలో నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి థియేటర్ వద్ద నిన్న అర్ధరాత్రి కుప్పకూలిపోయాడు. ఉదయం నుండి ఆ వృద్దుడు  అలాగే క‌ద‌ల‌కుండా ప‌డి ఉండ‌టంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆ వృద్ధుడి వివరాల కోసం తనిఖీ చేశారు. కరోనా అనుమానిత కింగ్ కోఠి ఆసుపత్రి స్లిప్స్ ఉండడంతో పోలీసులు ఖంగుతిన్నారు. వెంట‌నే మృతదేహానికి దూరంగా జ‌రిగిపోయారు. గంట‌లు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ మృత‌దేహాన్ని త‌ర‌లించేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌టంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు.