‘కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలోనే UPSC సివిల్స్‌ 3rd ర్యాంక్‌..’ IAS అనన్య రెడ్డి సక్సెస్ సీక్రెట్‌ ఇదే

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించాలంటే రోజుకు 18, 19 గంటలు చదవాల్సిందేనా? పుస్తకాలతో గంటల తరబడి కుస్తీ పడితేనే ఐఏఎస్ కావచ్చా? అది పెద్ద అపోహ అంటున్నారు 2023 సివిల్స్‌లో ఆల్ ఇండియా మూడో ర్యాంక్ సాధించిన అనన్య రెడ్డి. సరైన వ్యూహం, నిరంతర శ్రమ, పరీక్ష డిమాండ్‌ను అర్థం చేసుకుని చదవడం ద్వారా పరిమిత సమయంలోనూ సివిల్స్‌ను సాధించవచ్చని ఆమె చెబుతున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి తన తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో మూడో ర్యాంక్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అనన్య రెడ్డి తన విజయానికి హార్డ్‌వర్క్‌తో పాటు స్మార్ట్‌వర్క్ కూడా కీలకమని చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రిపరేషన్ విధానం, రోజువారీ చదువు, ప్రిలిమ్స్‌-మెయిన్స్‌ వ్యూహం, ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌ తదితర అంశాలను వివరించారు..

కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలోనే UPSC సివిల్స్‌ 3rd ర్యాంక్‌.. IAS అనన్య రెడ్డి సక్సెస్ సీక్రెట్‌ ఇదే
UPSC AIR 3 Ananya Reddys Success Strategy

Updated on: Aug 29, 2026 | 6:55 PM

సివిల్స్‌కు అనన్య రెడ్డి దాదాపు రెండేళ్ల పాటు సిద్ధమయ్యారు. ప్రతిరోజూ ఒకే సంఖ్యలో గంటలు గంటలు చదవాలని లక్ష్యంగా పెట్టుకోకుండా.. ఆ రోజు పూర్తి చేయాల్సిన సిలబస్‌ను బట్టి చదివేవారు. ఒక అంశానికి 10 గంటలు అవసరమైతే 10 గంటలు, 12 గంటలు పడితే 12 గంటలు చదివేవారు. అయితే సాధారణంగా ఆమె చదువు రోజుకు 14 గంటలు దాటేది కాదు. ‘18, 19 గంటలు చదవడం అనేది హ్యూమన్లీ పాజిబుల్ కాదు. అంతసేపు చదివినా విషయాలను పూర్తిగా గ్రహించలేం’ అని ఆమె అభిప్రాయపడ్డారు. గంటల సంఖ్య కంటే చదువుతున్న సమయాన్ని ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటామన్నదే ముఖ్యమని తెలిపారు.

ప్రిలిమ్స్‌కు ఎక్కువ రివిజన్స్.. MCQ ప్రాక్టీస్

2023లో ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం చాలా అన్‌కన్వెన్షనల్‌గా వచ్చిందని అనన్య తెలిపారు. అందుకే సాధారణంగా టాపర్లు సూచించే దానికంటే కొంత ఎక్కువ సంఖ్యలో రిసోర్సులను ఆమె చదివారు. అయితే ఎక్కువ మెటీరియల్ చదవడం వల్ల రివిజన్ తగ్గిపోకుండా జాగ్రత్తపడ్డారు. ఎక్కువ రిసోర్సులు, ఎక్కువ రివిజన్స్, MCQలతో మంచి ప్రాక్టీస్.. ఇదే తన ప్రిలిమ్స్ వ్యూహమని ఆమె వివరించారు.

మెయిన్స్‌లో తక్కువ మెటీరియల్.. ఎక్కువ విశ్లేషణ

మెయిన్స్ ప్రిపరేషన్‌లో మాత్రం అనన్య తన వ్యూహాన్ని మార్చుకున్నారు. ఎక్కువ పుస్తకాలు చదవడం కంటే పరిమితమైన మెటీరియల్‌ను పదేపదే రివైజ్ చేస్తూ, వాటిపై ఎక్కువగా ఆలోచించేవారు. ఒక సబ్జెక్ట్‌లోని అంశాలకు మరో సబ్జెక్ట్‌తో సంబంధాలను గుర్తించి ఇంటర్‌లింక్స్‌ రూపొందించుకోవడం వల్ల సమాధానాలు మరింత విశ్లేషణాత్మకంగా రాయగలిగానని ఆమె చెప్పారు. దీనికి తోడు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇంటర్వ్యూలో నిజాయితీనే ఆయుధం

ప్రిలిమ్స్, మెయిన్స్‌తో పోలిస్తే ఇంటర్వ్యూ తనకు కొంత ట్రిక్కీగా అనిపించిందని అనన్య చెప్పారు. ఇంటర్వ్యూలో బోర్డు, ప్రశ్నలు, అభ్యర్థిని వారు ఎలా అంచనా వేస్తారన్నది వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయని తెలిపారు. తన డీఏఎఫ్‌, హాబీస్‌, గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్‌ తదితర అంశాలను క్షుణ్ణంగా సిద్ధం చేసుకున్నానని చెప్పారు. అయితే ఇంటర్వ్యూకు వెళ్లే ముందు తనకు తాను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పుకున్నానని తెలిపారు. తెలియని విషయాన్ని తెలియదని చెప్పాలి.. తెలిసిన విషయాన్ని మాత్రమే చెప్పాలి. ఇంటర్వ్యూలో కొద్దిగా బ్లఫ్ చేసినా అనుభవజ్ఞులైన ప్యానెల్ సభ్యులు సులభంగా గుర్తించగలరని అనన్య పేర్కొన్నారు. అందుకే ఇంటర్వ్యూలో తాను సాధ్యమైనంత నిజాయితీగా వ్యవహరించినట్లు చెప్పారు. అనన్య రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాలోనే పాఠశాల విద్యను పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలోని మిరాండా హౌస్‌లో జాగ్రఫీ చదివి 2021లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్‌లో జాగ్రఫీ చదివినప్పటికీ సివిల్స్‌లో ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఆంత్రోపాలజీని ఎంచుకున్నారు. ఇది స్టాటిక్ సబ్జెక్ట్ కావడం, సిలబస్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవడం, మెటీరియల్ అందుబాటులో ఉండటం వంటి కారణాలతో ఆంత్రోపాలజీని ఎంచుకున్నట్లు ఆమె తెలిపారు. ఆంత్రోపాలజీలో కూడా ప్రశ్న స్వభావాన్ని బట్టి సమాధానం రాసే విధానాన్ని అనుసరించారు. ఫిజికల్ ఆంత్రోపాలజీలో డయాగ్రామ్‌లకు, సోషల్ ఆంత్రోపాలజీలో థింకర్స్‌కు, ట్రైబల్ ఆంత్రోపాలజీలో కేస్ స్టడీస్‌కు ప్రాధాన్యం ఇచ్చేవారు.

జనరల్ స్టడీస్‌కు కోచింగ్ తీసుకోలేదు

సివిల్స్‌లో కోచింగ్ తప్పనిసరిగా అవసరమనే అభిప్రాయాన్ని కూడా అనన్య రెడ్డి ఖండించారు. జనరల్ స్టడీస్‌కు తాను ఎలాంటి కోచింగ్ తీసుకోలేదని చెప్పారు. అయితే ఆంత్రోపాలజీ తనకు కొత్త సబ్జెక్ట్ కావడంతో ఢిల్లీలోని Vaid’s ICS నుంచి మూడు నెలల ఆన్‌లైన్ కోచింగ్ తీసుకున్నట్లు తెలిపారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో కోచింగ్ సంస్థలు నిర్వహించే టెస్ట్ సిరీస్‌లను రాశారు. ఇంటర్వ్యూ దశలో మాత్రం మాక్ ఇంటర్వ్యూలు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని వివరించారు. చిన్నప్పటి నుంచే సివిల్ సర్వీసెస్‌లోకి వెళ్లాలనే ఆలోచన తనకు ఉండేదని అనన్య చెప్పారు. హ్యుమానిటీస్‌పై కూడా ఆసక్తి ఉండటంతో అదే దిశగా చదువుకున్నారు. గ్రాడ్యుయేషన్ సమయంలో కెరీర్ అవకాశాలను పరిశీలించినప్పుడు.. ప్రజలకు సేవ చేసే అవకాశం, వివిధ రకాల పనులు చేసే అవకాశం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని సివిల్ సర్వీసెస్‌ను తనకు సరైన కెరీర్‌గా భావించినట్లు తెలిపారు. తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంక్ వస్తుందని తాను అసలు ఊహించలేదని అనన్య వెల్లడించారు. ఫలితాల్లో తన పేరు ఉంటే చాలని భావించానని, టాప్ 100 లేదా టాప్ 200లో ఉంటానని కూడా ప్రత్యేకంగా అంచనా వేయలేదని చెప్పారు.

తొలి ప్రయత్నంలో సివిల్స్ సాధించాలంటే..

సివిల్స్ పరీక్ష చాలా అనిశ్చితితో కూడుకున్నదని.. అంతేకాకుండా అభ్యర్థి పనితీరు ఇతర పోటీదారుల పనితీరుపైనా ఆధారపడి ఉంటుందని వివరించారు. తనది తొలి ప్రయత్నం కావడంతో మార్కులపై కూడా తనకు స్పష్టమైన బెంచ్‌మార్క్ తెలియదని తెలిపారు. ఐఏఎస్‌గా తన ముందున్న ప్రధాన లక్ష్యం ప్రజలకు చేరువైన పరిపాలన అందించడం అని అనన్య రెడ్డి తెలిపారు. ప్రజలు ఎలాంటి భయం, సంకోచం లేకుండా అధికారులను సంప్రదించగలిగే విధంగా పనిచేయాలని, సమర్థవంతమైన, సులభమైన పరిపాలన అందించాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించాలనుకునే అభ్యర్థులు ముందుగా పరీక్ష డిమాండ్‌ను అర్థం చేసుకోవాలని అనన్య సూచించారు. నేరుగా చదువు ప్రారంభించే బదులు ముందుగా సిలబస్, గత ప్రశ్నపత్రాలు, పరీక్షలో తమ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవాలని చెప్పారు.

ఆ తర్వాత తమ బలాలు, బలహీనతలను గుర్తించి స్వీయ విశ్లేషణ చేసుకోవాలని సూచించారు. మెయిన్స్‌లో మెటీరియల్‌ను పరిమితం చేసుకుని ఎక్కువగా ఆలోచించడం, విశ్లేషించడం, సమాధానాలు రాయడం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ‘మన వైపు నుంచి 100 శాతం ప్రయత్నం చేయాలి. పరీక్ష డిమాండ్‌ను అర్థం చేసుకోవడం, సరైన వనరులను ఎంచుకోవడం, ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం, స్వీయ విశ్లేషణ చేసుకోవడం చాలా ముఖ్యం’ అని అనన్య రెడ్డి పేర్కొన్నారు. అనన్య రెడ్డి విజయ ప్రయాణం చూస్తే.. రోజుకు ఎన్ని గంటలు చదివామన్నది కాదు, చదివిన సమయంలో ఎంత నేర్చుకున్నాం, పరీక్ష అవసరాలకు అనుగుణంగా ఎంత సమర్థవంతంగా సిద్ధమయ్యామన్నదే కీలకం అనే విషయం స్పష్టమవుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us