Moonlighting: మూన్‌లైటింగ్‌తో ఒత్తిడి తథ్యం! కంపెనీలు ఇలా చేశాయంటే ఉద్యోగులు సేఫ్‌

|

Oct 03, 2022 | 9:59 PM

మూన్‌లైటింగ్‌ చేసే ఉద్యోగి తాను పనిచేసే కంపెనీకి ద్రోహం చేయడం అవుతుందని, మోస పూరితమైన చర్యగా విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ అభివర్ణించారు. ఐతే మూన్‌లైటింగ్ ఉద్యోగుల మానసిక ఆరోగ్యంతో ఏవిధంగా ఆడుకుంటుందో తాజా అధ్యయనాలు వెల్లడించాయి..

Moonlighting: మూన్‌లైటింగ్‌తో ఒత్తిడి తథ్యం! కంపెనీలు ఇలా చేశాయంటే ఉద్యోగులు సేఫ్‌
Moonlighting
Follow us on

ఫుల్‌ టైం జాబ్‌తోపాటు, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పార్ట్‌ టైం జాబ్స్ చేయడాన్ని మూన్‌లైటింగ్ అంటారు. ఈ మూన్‌లైటింగ్‌ కారణంగా ప్రముఖ ఐటీ సంస్థ విప్రో.. దాదాపు 300 మంది ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా జాబ్‌ల నుంచి తొలగించింది. మూన్‌లైటింగ్‌ చేసే ఉద్యోగి తాను పనిచేసే కంపెనీకి ద్రోహం చేయడం అవుతుందని, మోస పూరితమైన చర్యగా విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ అభివర్ణించారు. ‘ఈ రోజు విప్రోలో పని చేస్తున్న ఉద్యోగులందరూ పూర్తిగా మా కంపెనీ కోసమే పనిచేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని నెలల్లో విప్రోతోపాటు ఇతర కంపెనీల్లో పనిచేసే 300 మంది ఎంప్లియిస్‌ను తొలగించామని’ ప్రేమ్‌జీ స్వయంగా ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ జాతీయ సదస్సులో వెల్లడించారు.

ఢిల్లీలో న్యూరో-సైకియాట్రిస్ట్ డాక్టర్ సంజయ్ చుగ్ ఏమంటున్నారంటే.. ఒక ఫుల్‌ టైం జాబ్‌ చేస్తూ.. మరో పార్ట్‌ టైం ఉద్యోగం (మూన్‌లైటింగ్) చేయడమనేది ఒత్తిడితో కూడుకున్న విషయం. కొంతమంది ఉద్యోగులు తమ ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడానికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. అటువంటి వ్యక్తుల అభిప్రాయాలను కంపెనీలు గౌరవించవచ్చు. ఐతే సదరు ఉద్యోగి మానసిక ఆరోగ్యంతో మూన్‌లైటింగ్ ఆడుకోవడం తథ్యం. ఎందుకంటే.. మూన్‌లైటింగ్‌ అనేది ఒక కొవ్వొత్తిని రెండు చివర్ల నుంచి కాల్చడానికి ప్రయత్నించడం లాంటిది. కొవ్వొత్తికి ఒక స్థిరమైన పొడవు ఉంటుందనే విషయం మర్చిపోకూడదు. కొవ్వొత్తి ఒక చివర మాత్రమే వెలిగిస్తే దాని ఆయుర్ధాయం చాలా కాలం పాటు ఉంటుంది. రెండు చివర్ల మంట పెడితే, త్వరగా కాలిపోయి జీవిత కాలం తగ్గిపోతుంది. ఇక్కడ ఉద్యోగి కొవ్వొత్తి లాంటి వాడు. రెండు జాబ్‌లు చేసే వ్యక్తులు సైకలాజికల్‌, సైకియాట్రిక్‌, ఫిజికల్ ప్రాబ్లెమ్స్‌ ఎదుర్కోవల్సి ఉంటుందని డాక్టర్ చుగ్ మూన్‌లైటింగ్‌ ఉద్యోగాలపై ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది వివరించారు.

ఒక వ్యక్తి ఒక ఉద్యోగం చేస్తూ మరొక ఉద్యోగం కూడా చేయడం ఎంత వరకు అవసరమనే విషయాన్ని తనకుతాను ప్రశ్నించుకోవాలి. రెండు ఉద్యోగాలు చేయడం వల్ల వచ్చే పరిణామాలను అంచనా వేయాగలగాలి. నిద్ర లేమి ప్రభావం మెదడు, శరీరంపై ఖచ్చితంగా చూపుతుంది. నిద్ర అనేది శరీరం శరీరం నుంచి విషాన్ని తొలగించే సమయం. అందువల్లనే నిద్ర ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. ఒక వ్యక్తికి తగినంత నిద్ర లేకపోతే, విషపదార్ధాలు శరీరంలో పేరుకుపోతాయి. నిర్విషీకరణ జరగేందుకు అవకాశం ఉండదు. ఇటువంటి ప్రమాదకర టాక్సిన్స్ శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపుతాయి. తద్వారా హైపర్‌టెన్షన్, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులకు దారితీస్తాయి.

ప్లస్‌ ఒన్‌ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. వారానికి 31 మరియు 40 గంటల మధ్య పనిచేసే 23 శాతం, 41 నుంచి 50 మధ్య గంటలు పని చేసే వారిలో 30.3 శాతం, 51 నుండి 60 గంటల మధ్య పనిచేసే వారిలో 39.8 శాతం, వారానికి 60 గంటల కంటే ఎక్కువ పని చేసే వారిలో 42.4 శాతం మంది ఒత్తిడితో బాధపడుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. అందువల్ల.. పెరుగుతున్న పని గంటలతో ఒత్తిడి స్థాయి కూడా పెరుగుతుంది. పెరుగుతున్న పని గంటలతో ఒత్తిడి స్థాయి, నిరాశ, ఆత్మహత్య ఆలోచనలు కూడా వీరిలో పెరిగాయి. విచారకరమైన విషయం ఏంటంటే.. తమ శారీరక శ్రమ కారణంగా ఒత్తిడి అనుభవిస్తున్నారనే విషయం చాలా మందికి ఆలస్యంగా తెలుస్తుంది. మానసిక సమస్యలు ఎదుర్కొనే వారిలో వెన్ను, మెడ సంబంధిత ఆరోగ్య సమస్యలు తలుత్తుతాయి. ఇది శరీరం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి. శారీరక లక్షణాలు, ఒత్తిడిని వేరు చేయలేమని డాక్టర్ చుగ్ మానసిక ఆరోగ్యం పాధాన్యాన్ని నొక్కి చెప్పారు.

ఉద్యోగం, జీవితం సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. కంపెనీలు తమ ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా ఉండేందుకు సంతోషకరమైన ప్రదేశంలో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్ చుగ్ సూచించారు. ఉద్యోగులకు విశ్రాంతి తీసుకోవడానికి తగిన సమయం ఇవ్వాలి. మూన్‌లైటింగ్‌ తగ్గించాలంటే.. ముందు కంపెనీలు తమ ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఇవ్వడం అవసరం. కంపెనీ ఉద్యోగిపై పెట్టుబడి పెట్టాలి. తద్వారా వారు కంపెనీకి అత్యుత్తమ పనితీరును అందించడానికి అవకాశం ఉంటుందని డాక్టర్ చుగ్ సూచించారు.