
హైదరాబాద్, ఆగస్ట్ 4: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026–-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా) సీట్లలో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. NEET UG-–2026లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఆగస్టు 5 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది. సీట్ల మ్యాట్రిక్స్‌ను వెబ్ ఆప్షన్లకు ముందు ప్రత్యేకంగా ప్రకటిస్తామని పేర్కొంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే ముందు ప్రాస్పెక్టస్‌ను పూర్తిగా చదివి, అర్హతలు, రిజర్వేషన్లు, అవసరమైన ధ్రువపత్రాలు, నిబంధనలను పరిశీలించి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది. పూర్తి వివరాలు, సమాచారం కోసం వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరింది.