
హైదరాబాద్, నవంబర్ 20: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Main) 2027 సెషన్-1 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కీలక అప్డేట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా.. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అప్లై చేసేందుకు నవంబర్ 22, 2026 చివరి తేదీగా నిర్ణయించింది. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించింది. JEE Main 2027 మొదటి సెషన్‌కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 24న ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబర్ 22వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు పరీక్ష ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది. చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.
నవంబర్ 22లోగా దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు ఎన్టీఏ మరో అవకాశం కల్పించింది. నవంబర్ 23 నుంచి 26 వరకు ఆలస్య రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం సాధారణ పరీక్ష ఫీజుతో పాటు అదనంగా రూ.500 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ గడువు కూడా నవంబర్ 26వ తేదీ రాత్రి 11.50 గంటలకు ముగియనుంది.
ఎన్టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం JEE Main 2027 మొదటి సెషన్ పరీక్షలు జనవరి 20, 21, 22, 23, 24, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) జరుగుతాయి.
దరఖాస్తు చేసే సమయంలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఫొటో, సంతకం తదితర వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. అప్లికేషన్ సమర్పించిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీని భద్రపరుచుకోవాలి. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎన్టీఏ సూచిస్తోంది.
జేఈఈ మెయిన్ సెషన్ 1 2027 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.