
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు చాలామంది చదువును మధ్యలోనే ఆపేసి ఉద్యోగం వైపు అడుగులు వేస్తారు. అరకొర చదువులతో, చాలీచాలని జీతాలతో జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అయితే హరియాణాకు చెందిన సుమన్ గోయల్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. ఆర్థిక కష్టాల మధ్య తాత్కాలిక ఉద్యోగిగా పాఠాలు చెబుతూనే తన చదువును కొనసాగించారు. ఒకప్పుడు తనకు అండగా నిలిచిన పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిగా చేరి రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. విద్యార్థుల కోసం చేసిన వినూత్న కార్యక్రమాలు, సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమెను 2026 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది.
హరియాణాలో పుట్టి పెరిగిన సుమన్‌ది పేద కుటుంబం. చిన్నప్పటి నుంచే చదువుల్లో ప్రతిభ చూపినప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఆమె కెరీర్ కలలకు అడుగడుగునా అడ్డుగా నిలిచాయి. డాక్టర్ కావాలన్నది ఆమె చిన్ననాటి కల. అయితే ఇంటర్ చదివించేందుకు కూడా కుటుంబ సభ్యులు వెనుకంజ వేశారు. చదువు కొనసాగించడం కుటుంబానికి అదనపు ఆర్థిక భారంగా భావించారు. దీంతో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ చదువుకోవాలని సుమన్ నిర్ణయించుకున్నారు. ఉపాధి అవకాశాల కోసం కుటుంబం దిల్లీకి తరలివెళ్లిన సమయంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో పాఠాలు చెప్పే అవకాశం ఆమెకు లభించింది. రోజుకు కేవలం రూ.60 మాత్రమే వేతనం లభించినా.. ఆ మొత్తాన్ని పొదుపు చేసి తన కాలేజీ ఫీజులకు ఉపయోగించుకునేవారు.
చదువు, ఉద్యోగంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్న సమయంలోనే సుమన్‌కు వివాహమైంది. కొంతకాలానికే ఆమె తల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యానికి గురై మంచానపడ్డారు. ఒకరి తర్వాత ఒకరు కన్నుమూయడంతో ఆమె తీవ్ర విషాదానికి గురయ్యారు. అయినప్పటికీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగారు. తన లక్ష్య సాధనలో భర్త గౌరవ్ సహకారం కూడా లభించింది. అత్తమామలు సైతం ఆమెను ప్రోత్సహించారు. దీంతో ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలన్న తన కలను సుమన్ సాకారం చేసుకున్నారు. తాను ఒకప్పుడు కాంట్రాక్ట్ టీచర్‌గా పనిచేసిన పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిగా చేరి దాదాపు రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు.
ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సుమన్ బోధిస్తున్నారు. చిన్నారుల్లో గణితం అంటే భయం ఎక్కువగా ఉంటుందని గుర్తించిన ఆమె.. ఆ భయాన్ని తొలగించేందుకు వినూత్న పద్ధతులను అనుసరించారు. ముఖ్యంగా ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు కూడా సంఖ్యలు, అంకెలను సులభంగా అర్థం చేసుకునేలా ప్రత్యేక మ్యాథ్స్ కిట్‌ను అభివృద్ధి చేశారు. ఆ కిట్ ద్వారా గణితంలోని ప్రాథమిక అంశాలను ఆటపాటల తరహాలో సులభంగా నేర్చుకునేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. చిన్న వయసులోనే గణితంపై భయం తొలగితే భవిష్యత్తులో ఆ సబ్జెక్టుపై ఆసక్తి పెరుగుతుందని ఆమె భావిస్తున్నారు.
సుమన్ సేవలు తరగతి గదికే పరిమితం కాలేదు. పాఠశాలకు వచ్చే విద్యార్థుల్లో చాలామంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినవారే కావడంతో వారికి అవసరమైన స్వెటర్లు, స్టేషనరీ, పుస్తకాలు తదితరాలను ఎప్పటికప్పుడు సమకూరుస్తున్నారు. చిన్న చిన్న ఆర్థిక సమస్యల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో తన వంతు సహాయం చేస్తుంటారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలుస్తున్నారు. విద్యార్థుల కోసం సుమన్ చేస్తున్న సేవలను గుర్తించిన హరియాణా ప్రభుత్వం గతంలోనే ఆమెను ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సత్కరించింది. తాజాగా ఆమె విద్యా సేవలు, వినూత్న బోధనా విధానాలు, విద్యార్థులకు అందిస్తున్న సహాయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2026 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది. రోజుకు రూ.60తో ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించి.. ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ చదువును కొనసాగించి.. తాను పనిచేసిన పాఠశాలకే ఉపాధ్యాయురాలిగా తిరిగి వచ్చి వేలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన సుమన్ గోయల్ ప్రస్థానం నిజంగా ఆదర్శప్రాయమే.