IIT రామయ్య మాస్టారు.. నూరేళ్ల జీవితాన్ని వేలమందికి వెలుగుగా మార్చిన గురువు!

వేలమంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్ది.. వారిని శాస్త్రవేత్తలుగా, ఆవిష్కర్తలుగా, సంపద సృష్టికర్తలుగా, ఉన్నత స్థానాల్లో నిలిపిన గొప్ప గురువు రామయ్య మాస్టారు. కేవలం గణిత పాఠాలు చెప్పడమే కాకుండా, విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని, క్రమశిక్షణను, సామాజిక బాధ్యతను పెంపొందించారు. విద్యను వ్యాపారంగా కాకుండా సమాజ అభివృద్ధికి పునాదిగా చూడాలన్న ఆయన ఆశయాలు నేటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయి..

IIT రామయ్య మాస్టారు.. నూరేళ్ల జీవితాన్ని వేలమందికి వెలుగుగా మార్చిన గురువు!
IIT Ramayya Master

Updated on: Nov 20, 2026 | 10:20 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటీ విద్యకు ప్రాచుర్యం కల్పించడంలో రామయ్య మాస్టారు కీలక పాత్ర పోషించారు. ఆయన దగ్గర శిక్షణ పొందిన దాదాపు 1,500 మంది విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాలు సాధించి ఉన్నత విద్యను అభ్యసించారు. వారిలో ఎందరో దేశవిదేశాల్లో ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారు. శాస్త్రవేత్తలుగా, ఆవిష్కర్తలుగా, సంపద సృష్టికర్తలుగా, ఉపాధి కల్పించే వ్యక్తులుగా రాణిస్తున్నారు. అయితే విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు సాధించడమే ఆయన అంతిమ లక్ష్యం కాదు. వారు మంచి మనుషులుగా, సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగాలని కోరుకున్నారు. తాము సంపాదించిన విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని బోధించారు. ఆయన దృష్టిలో విద్యార్థుల విజయాలే ఉపాధ్యాయుడి అసలైన సంపద. రామయ్య మాస్టారు వ్యక్తిత్వంలో మృదుత్వం, క్రమశిక్షణ రెండూ కనిపిస్తాయి. మాటల్లో ఎంతో సౌమ్యంగా ఉన్నప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తు విషయంలో మాత్రం ఎలాంటి అలసత్వాన్నీ సహించేవారు కాదు. ఆయన కఠినత్వం వెనుక విద్యార్థులపై అపారమైన ప్రేమ, వారి భవిష్యత్తుపై ఉన్న శ్రద్ధ ఉండేవి.

ప్రతి విద్యార్థిలోని ప్రతిభను గుర్తించడం, దానికి పదును పెట్టడం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ఆయన బోధనా విధానంలో ముఖ్యమైన అంశాలు. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చినా ఆయన మాత్రం నిరాడంబర జీవితాన్నే గడిపారు. సాధారణ వస్త్రధారణ, సరళమైన జీవనశైలి, నిష్కల్మషమైన మాటతీరు ఆయన ప్రత్యేకతలు. రామయ్య మాస్టారు జీవితంలో సామాజిక, రాజకీయ చైతన్యానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నందుకు రెండున్నరేళ్లకు పైగా జైలు జీవితం గడిపారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య జీవనశైలి, ఆలోచనలు ఆయనపై గాఢమైన ప్రభావం చూపాయి. సమాజంలోని అసమానతలను తొలగించాలన్న ఆలోచన ఆయన జీవితంలో అంతర్భాగంగా మారింది. విద్యను ప్రభుత్వాలు ఖర్చుగా కాకుండా భవిష్యత్తుపై పెట్టుబడిగా చూడాలని రామయ్య మాస్టారు బలంగా విశ్వసించారు. ధనికులు, పేదలు అనే తేడా లేకుండా పిల్లలందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందాలని ఆకాంక్షించారు. సామాజిక, ఆర్థిక అసమానతలు పాఠశాలల్లోనే మొదలవడం ఆయనను కలచివేసేది.

విద్యను వ్యాపారంగా, విద్యార్థులను వినియోగదారులుగా మార్చే ధోరణిని ఆయన వ్యతిరేకించారు. విద్య అంటే కేవలం ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడే సాధనం మాత్రమే కాదు. అది వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ. సమాజాన్ని మెరుగుపరిచే శక్తి. సామాజిక స్పృహ లేని విద్య అసంపూర్ణమని ఆయన భావించేవారు. గత తరాల విలువలు, విజ్ఞానాన్ని భావితరాలకు అందించడంతోపాటు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా విద్యార్థులను సిద్ధం చేయడమే విద్య యొక్క ప్రధాన లక్ష్యాలని ఆయన అభిప్రాయం. రామయ్య మాస్టారిలో కనిపించే మరో గొప్ప లక్షణం నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి. సమాజంలో జరుగుతున్న పరిణామాలను గమనించడం, విద్యారంగ సమస్యలపై ఆలోచించడం, కొత్త విషయాలను నేర్చుకోవడం ఆయన నిత్యజీవితంలో భాగం. తరగతి గది నాలుగు గోడలకే తన బాధ్యతను పరిమితం చేసుకోలేదు. విద్యారంగ సమస్యలు, సామాజిక అసమానతలు, ప్రజా సమస్యలపై స్పందించేవారు. ఉపాధ్యాయుడు సమాజానికి దూరంగా ఉండే ప్రేక్షకుడు కాకూడదని, సామాజిక మార్పులో భాగస్వామి కావాలని తన జీవితంతో నిరూపించారు.

ఇవి కూడా చదవండి

యువ జర్నలిస్టులకు మార్గదర్శనం

ఈనాడు జర్నలిజం స్కూల్‌తో రామయ్య మాస్టారికి 2001 నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతి సంవత్సరం యువ జర్నలిస్టులకు ఉపన్యాసాలు ఇస్తూ, వారి సందేహాలను నివృత్తి చేసేవారు. విద్యార్థులు ప్రశ్నలు అడగడాన్ని ప్రోత్సహించేవారు. ఉపాధ్యాయుడైనా, పాత్రికేయుడైనా ప్రజలను ఆలోచింపజేయడం, సమాజంలో చైతన్యం తీసుకురావడం ప్రధాన బాధ్యత అని ఆయన భావించేవారు. ప్రశ్నించే తత్వం, హేతుబద్ధమైన ఆలోచన, సామాజిక బాధ్యత విద్యకూ జర్నలిజానికీ పునాదులని ఆయన బోధనలు గుర్తుచేస్తాయి. ప్రస్తుతం విద్యార్థులు పరీక్షల ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాల్సిన తరగతి గదులు కంఠస్థ విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కంటే పరీక్షల ఫలితాలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి విద్యార్థిలోనూ ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, దాన్ని గుర్తించి ప్రోత్సహించడం ఉపాధ్యాయుడి బాధ్యత అని రామయ్య మాస్టారు జీవితం చెబుతోంది. విద్యార్థులందరినీ ఒకే మూసలో పోసి అంచనా వేయడం సరైన విధానం కాదని ఆయన ఆలోచనలు సూచిస్తున్నాయి. వారిని కేవలం పరీక్షలకు మాత్రమే కాకుండా జీవితానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలి.

ఒక మంచి ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాలు చెబుతాడు. గొప్ప ఉపాధ్యాయుడు వారి జీవితాలను తీర్చిదిద్దుతాడు. రామయ్య మాస్టారు మాత్రం వేలమంది విద్యార్థుల జీవితాలతోపాటు, వారి ద్వారా సమాజ భవిష్యత్తును కూడా ప్రభావితం చేశారు. విద్యారంగానికి ఆయన అందించిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించాలన్న ఆకాంక్ష వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ శతాయుష్కుణ్ని సముచితంగా సత్కరించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయనకు అందించగలిగే అత్యున్నత గౌరవం ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్య అందించాలన్న ఆశయాన్ని నెరవేర్చడమే. నూరేళ్ల జీవితాన్ని వేలమంది జీవితాలకు వెలుగుగా మార్చిన రామయ్య మాస్టారు నిజంగా కోటికొక్కరు. ఆయన తీర్చిదిద్దిన విద్యార్థులే ఆయనకు అసలైన వారసులు. మరిన్ని సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తూ భావితరాలకు స్ఫూర్తినివ్వాలని కోరుకుందాం..

Loading...
Unable to load recommendations.
Follow Us