
కేవలం 13 ఏళ్ల భారతీయ-అమెరికన్ విద్యార్థిని అరికా కుండు (Arika Kundu) ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వ్యవసాయ వ్యర్థాలతో వినూత్న పరిష్కారాన్ని అభివృద్ధి చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నెటోంకా మిడిల్ స్కూల్ ఈస్ట్‌లో అరికా ఏడో తరగతి చదువుతుంది. అయితేనేమి.. వేరుశెనగ పెంకులను ఉపయోగించి తాజా పండ్లు, కూరగాయలపై ఉండే పురుగుమందు అవశేషాలను తొలగించే ప్రత్యేక విధానాన్ని రూపొందించి అందరినీ అబ్బురపరిచింది. అంతేనా.. అరికా రూపొందించిన ‘LIGNEX – A Novel Biosorption-Based Approach That Uses Agricultural Waste Material to Eliminate Pesticide Residues from Fresh Produce’ అనే ప్రాజెక్ట్‌కు విశేష గుర్తింపు లభించింది. ఈ ప్రాజెక్ట్‌తో ఆమె ప్రతిష్ఠాత్మక 2026 3M Young Scientist Challengeలో టాప్ 10 ఫైనలిస్టులలో స్థానం దక్కించుకుంది.
పండ్లు, కూరగాయలను సాధారణంగా నీటితో కడిగినా వాటిపై ఉండే పురుగుమందు అవశేషాలు పూర్తిగా తొలగిపోవు. దీనికి తక్కువ ఖర్చుతో, పర్యావరణహిత పరిష్కారం కోసం అరికా వ్యవసాయ వ్యర్థమైన వేరుశెనగ పెంకులను ఉపయోగించింది. ఆమె అభివృద్ధి చేసిన విధానం బయోసార్ప్షన్ (Biosorption) సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ప్రత్యేకంగా శుద్ధి చేసిన వేరుశెనగ పెంకుల పదార్థం సహజ ఫిల్టర్‌లా పనిచేసి, పండ్లు లేదా కూరగాయలపై ఉండే పురుగుమందు అవశేషాలను తనవైపు ఆకర్షించి బంధిస్తుంది. దీంతో హానికర రసాయనాల ప్రభావం తగ్గడమే కాకుండా, వ్యవసాయ వ్యర్థాలకు ఉపయోగకరమైన కొత్త వినియోగం లభిస్తుంది. పాఠశాల విద్యార్థుల శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రోత్సహించే 3M Young Scientist Challengeలో ఫైనలిస్టుగా ఎంపికైన అరికా.. వేసవి కాలంలో 3M సంస్థకు చెందిన శాస్త్రవేత్తతో కలిసి తన ప్రాజెక్ట్‌ను మరింత మెరుగుపరచనుంది. అనంతరం అక్టోబర్‌లో జరిగే తుది పోటీలో పాల్గొని 25,000 డాలర్ల గ్రాండ్ ప్రైజ్తో పాటు America’s Top Young Scientist బిరుదు కోసం పోటీపడనుంది.
ఈ పోటీలో పాల్గొనడం ద్వారా తన ఆవిష్కరణను మరింత అభివృద్ధి చేసి అందరికీ ఉపయోగపడే ఉత్పత్తిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అరికా తెలిపింది. భవిష్యత్తులో కంప్యూటేషనల్ బయాలజీలో ప్రత్యేకత కలిగిన ఆస్ట్రోబయాలజిస్టుగా మారాలని తన కల అని పేర్కొంది. అంతరిక్ష ప్రయాణాల్లో రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించే పరిష్కారాలపై పరిశోధనలు చేయాలని, అలాంటి పరిశోధనలు క్యాన్సర్ చికిత్స, వృద్ధాప్యంపై అధ్యయనాలు వంటి అనేక శాస్త్రీయ రంగాలకు కూడా ఉపయోగపడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.