
వెండి ధరలు ఒక్కసారిగా ఎందుకు పడిపోతున్నాయి? ఒకప్పుడు భారీగా పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకిన వెండి.. ఇప్పుడు మళ్లీ ఒత్తిడిలోకి రావడానికి కారణం ఏంటి? చమురు ధరలు, అమెరికా డాలర్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లకు వెండి ధరలకు సంబంధం ఏంటి? ప్రస్తుతం వెండి ధర తగ్గుతున్నా.. భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయా? అసలు వెండి మార్కెట్‌లో ఏం జరుగుతోంది? ఇప్పుడు డీటైల్‌గా ఈ కథనంలో తెలుసుకుందాం.. ఈ ఏడాది ఇప్పటివరకు వెండి ధర దాదాపు 23 శాతం తగ్గింది. ఒక్క జూన్ నెలలోనే సుమారు 22 శాతం పడిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్స్ వెండి ధర దాదాపు 58 డాలర్ల దగ్గర ఉంది. అయితే గత ఏడాదితో పోలిస్తే వెండి ధర ఇప్పటికీ 50 శాతానికి పైగా ఎక్కువగానే ఉంది. కానీ జనవరి చివర్లో ఒక ఔన్స్‌కు 121 డాలర్ల వరకు చేరిన వెండి ధర.. అక్కడి నుంచి భారీగా తగ్గింది. భారత్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ సుమారు 2 లక్షల 20 వేల రూపాయల దగ్గర ఉంది. అయితే అంతర్జాతీయ ధరలకు, మన దేశంలో ఉండే ధరలకు పూర్తిగా ఒకే విధంగా ఉండదు. దిగుమతి సుంకాలు, దిగుమతులపై ఉన్న పరిమితులు, దేశీయ మార్కెట్‌లో మారిన నిబంధనలు కూడా వెండి ధరపై ప్రభావం చూపుతాయి. ...