ఆ దేశంలో ఆకాశాన్ని తాకే బిల్డింగ్స్ ఎన్ని ఉన్నా వాటిల్లో 4వ ఫ్లోర్ ఉండదు! ఎందుకంటే..?

చైనాలో కొన్ని భవనాల లిఫ్టుల్లో 4వ అంతస్తు కనిపించకపోవడం వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది. మాండరిన్ భాషలో 4 సంఖ్య ఉచ్చారణ ‘మరణం’ అనే పదంతో దాదాపు సమానంగా ఉండటంతో చాలామంది దీనిని అశుభంగా భావిస్తారు. అందుకే కొన్ని భవనాల్లో 4, 14, 24, 34 వంటి నంబర్లను వదిలేస్తారు.

ఆ దేశంలో ఆకాశాన్ని తాకే బిల్డింగ్స్ ఎన్ని ఉన్నా వాటిల్లో 4వ ఫ్లోర్ ఉండదు! ఎందుకంటే..?
Why Is The 4th Floor Missin

Updated on: Sep 05, 2026 | 2:40 PM

సాధారణంగా మూడో ఫ్లోర్ తర్వాత నాలుగో ఫ్లోర్ వస్తుందని తెలిసిందే. కానీ ఓ దేశం ఉంది అక్కడ అసలు 4వ ఫ్లోర్ అనేదే ఉండందంటే నమ్ముతారా? ఇంటి కోసం నిర్మించే బిల్డింగ్స్ కావు.. హోటల్స్, కమర్షియల్ బిల్డింగ్స్ అన్నీ కూడా అంతే. అసలు ఎందులో కూడా నాలుగో ఫ్లోర్ అనేదే ఉండదంట. ఆ దేశం ఏదంటే చైనా. అభివృద్ధిలో ఎంతో ముందు ఉన్న చైనాలో ఇలాంటి వింత ఎందుకు ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇంజనీరింగ్ కారణం కాదు.. పాత నమ్మకమే!

చైనా భవనాల్లో 4వ అంతస్తు లేకపోవడానికి ఎలాంటి ప్రత్యేక ఇంజనీరింగ్ కారణం లేదు. ఇది ప్రధానంగా చైనీస్ భాష, సంస్కృతిలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఓ నమ్మకంతో ముడిపడి ఉంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదికల ప్రకారం, చైనాలో చాలామంది 4వ సంఖ్యను అశుభకరమైనదిగా భావిస్తారు. అందుకే కొంతమంది భవన యజమానులు, డెవలపర్లు లిఫ్ట్ నంబరింగ్‌లో 4ను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తారు.

4 ఉచ్చారణే అసలు కారణం

మాండరిన్ చైనీస్ భాషలో 4 అనే సంఖ్యను ‘sì’ అని ఉచ్చరిస్తారు. ‘మరణం’ అనే పదాన్ని ‘sǐ’ అని అంటారు. ఈ రెండు పదాల ఉచ్చారణ దాదాపు ఒకేలా ఉండటంతో 4 సంఖ్యకు మరణంతో ప్రతికూలమైన సాంస్కృతిక అనుబంధం ఏర్పడింది. ఈ కారణంగానే కొంతమంది చైనీయులు 4 సంఖ్యను తమ జీవితంలో శుభప్రదంగా భావించరు.

14, 24, 34 అంతస్తులకూ అదే పరిస్థితి

ఈ నమ్మకం కేవలం 4వ అంతస్తుకే పరిమితం కాదు. కొన్ని భవనాల్లో 14, 24, 34 వంటి 4తో ముగిసే అంతస్తుల నంబర్లను కూడా వదిలేస్తారు. ఉదాహరణకు, వాస్తవంగా నాలుగో అంతస్తు ఉన్నప్పటికీ లిఫ్ట్‌లో దానికి బదులుగా 5 అనే నంబర్ కనిపించవచ్చు. అలాగే 13 తర్వాత నేరుగా 15 లేదా 23 తర్వాత 25 కనిపించే భవనాలు కూడా ఉండొచ్చు. అయితే చైనాలోని ప్రతి భవనంలోనూ ఈ విధమైన నంబరింగ్ ఉండదు. ఇది ప్రభుత్వ నిబంధన కాదు. ప్రజల విశ్వాసాలు, సాంస్కృతిక అభిరుచులను దృష్టిలో పెట్టుకుని కొంతమంది బిల్డర్లు మాత్రమే ఇలా చేస్తారు.

8 సంఖ్యకు మాత్రం ప్రత్యేక గౌరవం

4 సంఖ్యను అశుభంగా భావించే నమ్మకానికి పూర్తిగా విరుద్ధంగా చైనాలో 8 సంఖ్యను అదృష్టవంతమైనదిగా చాలామంది భావిస్తారు. దీనికి కూడా భాషలోని ఉచ్చారణతో సంబంధం ఉందని చెబుతారు. సంపద, శ్రేయస్సుతో సంబంధం ఉన్న పదాలతో 8 సంఖ్య ఉచ్చారణకు ఉన్న పోలిక కారణంగా దీనికి శుభప్రదమైన గుర్తింపు వచ్చింది. చైనాలో సంఖ్యలు కేవలం లెక్కించడానికి మాత్రమే ఉపయోగించే అంకెలుగా చాలామంది చూడరు.

వాటి ఉచ్చారణ, అర్థం, సాంస్కృతిక నమ్మకాలు కూడా ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఫోన్ నంబర్లు, కారు నంబర్లు, ఇంటి నంబర్లు, వ్యాపార నంబర్లు, వివాహ తేదీలు వంటి వాటిని ఎంచుకునే సమయంలో కూడా కొందరు శుభప్రదంగా భావించే సంఖ్యలకు ప్రాధాన్యత ఇస్తారు. అందుకే చైనాలోని ఓ భవనంలో లిఫ్ట్‌లో 3 తర్వాత నేరుగా 5 కనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అక్కడ 4 లేకపోవడానికి కారణం ఇంజనీరింగ్ కాదు.. భాషతో ముడిపడిన ఓ పురాతన సాంస్కృతిక నమ్మకం.

Loading...
Unable to load recommendations.
Follow Us