
Cardamom: భారతదేశంలో యాలకులను అత్యధికంగా కేరళలో పండిస్తారు. బ్రిటిష్ కాలంలో వాళ్ళు ఇక్కడ యాలకుల విత్తనాలను గ్వాటెమాలా దేశానికి తీసుకువెళ్లారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మూడు మసాలా దినుసుల్లో ఇది ఒకటి. గ్రీన్ గోల్డ్ అని పిలిచే ఈ యాలకులను ఈజిప్ట్ రాజులైన ఫారోల సమాధుల్లో కూడా ఉంచేవారు. ఈ మొక్క పూలు, కాయలు వేర్ల దగ్గర కాస్తాయి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే యాలకుల్లో 60 నుంచి 70 శాతం స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆక్షన్ సెంటర్లకు చేరుకుంటాయి. కేరళలోని బోడినాయకనూర్, కుమిలి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యాలకుల వేలం జరుగుతుంది. ఉదయం పూట ఇంట్లో టీ మరుగుతున్నప్పుడు వచ్చే ఆ సువాసన ముక్కుకి తగలగానే కళ్ళు మూసుకునేలా చేసే ఆ అద్భుత పరిమళం ఎవరూ ఊహించలేం. ఇది కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాదు. మీరు తాగే టీకి ఆ రుచిని, బిర్యానీకి ఆ ఘాటును కూడా, ఘుమఘుమను కూడా అందిస్తుంది.
అయితే ఈ చిన్న ఆకుపచ్చని కాయ ఎక్కడి నుంచి వస్తుంది? దీన్ని ఎలా పండిస్తారు? అన్నిటికంటే ముఖ్యంగా యాలకులకు ఎందుకు అంత గిరాకీ? ఎప్పుడైనా ఆలోచించారా? మార్కెట్లో 100 గ్రాముల యాలకుల ధర 500 నుంచి క్వాలిటీని బట్టి 1500 వరకు ఉంటుంది. అంటే కొన్నిసార్లు దీని ధర వెండి కంటే ఎక్కువ అన్నమాట. అసలు ఈ మసాలా వెనుక ఉన్న రహస్యం ఏంటి? అడవుల్లో మొదలై మీ వంటగది వరకు చేరే దీని పూర్తి ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం.
ముందుగా అసలు యాలకులు అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మసాలా దినుసుల్లో మొదట స్థానంలో కుంకుమపువ్వు, రెండవ స్థానంలో వనిల్లా ఉండగా, మూడవ స్థానంలో యాలకులు ఉన్నాయి. 4000 సంవత్సరాల క్రితం అంటే సింధులోయ నాగరికత కాలంలోనే దీని ప్రస్తావన ఉంది. ప్రాచీన భారతదేశంలో దీన్ని ఏలా అని పిలిచేవారు. ఆయుర్వేదంలో జీర్ణక్రియను మెరుగుపరచడానికి, నోటి దుర్వాసనను పోగొట్టడానికి, గుండె వ్యాధులను నయం చేయడానికి దీన్ని వాడేవారు. రోమన్ సామ్రాజ్యం భారతదేశంతో వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకువెళ్ళిన అత్యంత విలువైన వస్తువుల్లో యాలకులు ఒకటి. ఇప్పుడు యాలకుల సాగు గురించి అర్థం చేసుకుందాం.
ఇవి ఎందుకంత ఖరీదుగా ఉంటాయో ఇక్కడే మీకు తెలుస్తుంది. యాలకుల మొక్క చాలా సున్నితమైంది. దీన్ని పెంచడానికి ప్రత్యేక వాతావరణం, సరైన నేల, ఎంతో జాగ్రత్త అవసరం. ఒక్క ముక్కలో చెప్పాలంటే చిన్నపిల్లల్లా చూసుకోవాలి. ఈ మొక్కకు వర్షం ఎక్కువగా కావాలి. కానీ నీరు నిలిచిపోకూడదు. ఇది ఎప్పుడూ నీడలోనే పెరగాలి. నేరుగా ఎండ తగిలితే మొక్క చనిపోతుంది. చల్లటి ఉష్ణోగ్రత ఉండాలి కానీ మరీ ఎక్కువ చలి ఉండకూడదు. అలాగే వాతావరణంలో తేమ కూడా మితంగానే ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా మొత్తం పంట పాడైపోతుంది. అందుకే ప్రపంచంలో యాలకులు పండే ప్రాంతాలు చాలా తక్కువ. మొక్క నాటగానే కాయలు కాస్తాయా అంటే అదీ కూడా లేదు. యాలకుల మొక్క మొదటిసారి ఫలించడానికి రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది. ఆ తర్వాత కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కాపిస్తుంది. ఒక పూర్తి మొక్క నుంచి కేవలం ఒకటి నుంచి రెండు కిలోల యాలకులు మాత్రమే లభిస్తాయి. సంవత్సరాల తరబడి శ్రద్ధగా కాపాడుకుంటే వచ్చేది చాలా తక్కువే కాబట్టి దానికి అంత డిమాండ్. ఇందులో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే యాలకుల పూలు, కాయలు మొక్క పైభాగంలో కాకుండా వేర్ల దగ్గర నేల కానుకుంటూ కాస్తాయి.
ప్రతి ఒక్క కాయను వెతికి కోయడానికి మనుషులు నేల మీద వంగి పనిచేయాల్సిందే. అందుకే యాలకుల హర్వెస్టింగ్ కోసం యంత్రాలను ఉపయోగించలేరు. ఈ పని పూర్తిగా మనుషుల చేతులతోనే జరుగుతుంది. ఒక్కో కాయను ఎంతో జాగ్రత్తగా చేతితో తెంపుతారు. ఈ కష్టమే యాలకులను మరింత ఖరీదైనవిగా మార్చేస్తుంది. ప్రపంచంలో యాలకులను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం గ్వాటెమాలా.
ఈ సెంట్రల్ అమెరికన్ దేశం ప్రతి సంవత్సరం ప్రపంచానికి అవసరమైన 60 నుంచి 70 శాతం యాలకులను ఉత్పత్తి చేస్తుంది. కానీ నిజానికి ఇవి భారతదేశం నుంచే అక్కడికి వెళ్ళాయి. బ్రిటిష్ కాలంలో వాళ్ళు ఇక్కడ యాలకుల విత్తనాలను గ్వాటెమాలాకు ఎక్స్పోర్ట్ చేశారు. అక్కడ వాతావరణం వీటికి ఎంత అద్భుతంగా సరిపోతుందంటే ఈ రోజు గ్వాటెమాలా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా మారిపోయింది. కానీ నేటికీ అత్యుత్తమ నాణ్యత గల యాలకులు భారతదేశంలోనే పండుతున్నాయి. ఇండియాలో యాలకులను అత్యధికంగా కేరళలో సాగు చేస్తారు. కేరళలోని ఇడుక్కి జిల్లాను కార్డమామ్ హిల్స్ అని పిలుస్తారు.
దట్టమైన అడవుల్లోని పర్వత వాలు ప్రాంతాల్లో ఈ యాలకుల తోటలు ఉంటాయి. అక్కడ వాతావరణం ఎంత అనుకూలంగా ఉంటుందంటే అక్కడ పండే యాలకుల సువాసన ప్రపంచంలోనే అత్యధిక ఘాటైనదిగా పేరు తెచ్చుకుంది. కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడులో కూడా వీటి ప్రస్తావన ఉంది. యాలకుల ఉత్పత్తుల్లో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. అయితే మన దేశంలో ఉత్పత్తి అయ్యే యాలకులను మనమే ఎక్కువగా వినియోగిస్తాం. కాబట్టి ఎగుమతి చేయడానికి చాలా తక్కువ మాత్రమే మిగులుతున్నాయి. మరి తోటల నుంచి ఈ యాలకులు మీ వంటగదికి ఎలా చేరుకుంటాయో తెలుసుకుందాం..
మొదటి దశ హార్వెస్టింగ్ అంటే కోత. ఇంతకుముందు చెప్పుకున్నట్లు యాలకుల కోత పూర్తిగా చేతులతోనే జరుగుతుంది. కేరళలోని అటవీ ప్రాంతాల్లో రైతులు ఉదయాన్నే తోటకు వెళ్తారు. దట్టమైన చెట్ల నీడలో వంగి ఒక్కో ఆకుపచ్చని కాయను నిశితంగా గమనిస్తారు. సరిగ్గా పండిన కాయను మాత్రమే తెంపుతారు. పచ్చివి లేదా మరీ ఎక్కువగా పండినవి కోసుకోరు. కేవలం సరైన దశలో ఉన్న వాటినే ఎంచుకుంటారు. ఈ పనికి చాలా ఓపిక అవసరం. ఎంత నైపుణ్యం ఉన్న పనివారైనా రోజుకు కేవలం 15 నుంచి 20 కిలోల యాలకులు మాత్రమే కోయగలరు. రెండవ దశ వాషింగ్, క్లీనింగ్. కోసిన యాలకులను నీటితో శుభ్రంగా కడుగుతారు. వాటికి ఉన్న మట్టిని, చెత్తను పూర్తిగా తొలగిస్తారు. ఆ తర్వాత జరిగే మూడవ దశ క్యూరింగ్. అంటే వాటిని ఆరబెట్టడం. యాలకులను కోసిన తర్వాత జరిగేది చాలా ముఖ్యమైన దశ.
తాజాగా కోసిన యాలకులు ఆకుపచ్చగా ఉంటాయి. కానీ వాటిని స్టోర్ చేయడానికి, మార్కెట్లో అమ్మడానికి ముందుగా వాటిని ఆరబెట్టాలి. ఒకప్పుడు వీటిని ఎండలో ఆరబెట్టేవారు. కానీ అలా చేయడం వల్ల యాలకుల రంగు పసుపు రంగులోకి మారుతుంది. సువాసన తగ్గుతుంది. అందుకే ఇప్పుడు మెకానికల్ డ్రయింగ్ విధానాన్ని వాడుతున్నారు. యాలకులను ఒక ప్రత్యేకమైన డ్రయర్లో వేసి 35 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నెమ్మదిగా వాటిలోని తేమను తొలగిస్తున్నారు. ఈ ప్రాసెస్ సుమారుగా 35 నుంచి 48 గంటల పాటు జరుగుతుంది.
దీనివల్ల యాలకుల ఆకుపచ్చ రంగు అలాగే ఉంటుంది. సువాసన కూడా ఏ మాత్రం తగ్గదు. ఇలాంటి ఆకుపచ్చని యాలకులకే మార్కెట్లో అత్యధిక ధర దక్కుతుంది. ఆ తర్వాత జరిగే నాలుగవ దశ గ్రేడింగ్. ఆరబెట్టిన యాలకులను వాటి సైజును బట్టి వేరు చేస్తారు. లావుగా, పెద్దగా ఉండేవి ప్రీమియం గ్రేడ్. చిన్నవి లేదా విరిగిపోయినవి లోయర్ గ్రేడ్ కిందకు వస్తాయి.
కాయ సైజు ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ ధర పలుకుతుంది. ఐదవ దశ ప్యాకేజింగ్, ఆక్షన్. గ్రేడింగ్ పూర్తయిన తర్వాత యాలకులను ప్యాక్ చేసి స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆక్షన్ సెంటర్లకు పంపిస్తారు. కేరళలోని బోడినాయకనూర్, కుమిలి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వేలం జరుగుతుంది. ఇక్కడికి ట్రేడర్స్ వచ్చి బిడ్డింగ్ చేస్తారు. అత్యధిక ధర కోట్ చేసిన వాళ్లకి యాలకులు సొంతమవుతాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. యాలకులు ఒకే రకంగా ఉండవు. ఇవి ప్రధానంగా రెండు రకాలు. మొదటిది గ్రీన్ కార్డమమ్ అంటే ఆకుపచ్చ యాలకులు. రోజువారీగా టీలో, స్వీట్స్లో, బిర్యానీస్లో మనం వాడేవి ఇవే. దీని సువాసన కాస్త తీయగా, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇవి ఎక్కువగా కేరళ, కర్ణాటకలో పండుతాయి. ఇక రెండోది బ్లాక్ కార్డమమ్ అంటే నల్ల యాలకులు. ఇవి చూడడానికి కొంచెం పెద్దవిగా ఉండి నలుపు లేదా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. వీటి వాసన పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కాస్త ఘాటుగా ఉంటుంది.
వీటిని ఎక్కువగా బిర్యానీ, పులావ్, నాన్-వెజ్ వంటకాల్లో వాడతారు. నల్ల యాలకులు ముఖ్యంగా సిక్కిం, డార్జిలింగ్, నేపాల్ ప్రాంతాల్లో పండుతాయి. ఈ రెండు రకాల రుచులు, ఉపయోగాలు వేరైనప్పటికీ రెండూ కూడా చాలా ఖరీదైనవే. ఇప్పుడు యాలకుల గురించి మరో ఆసక్తికరమైన కోణం మాట్లాడుకుందాం. యాలకులు కేవలం వంటల రుచిని మాత్రమే పెంచవు. ఇవి ఒక అద్భుతమైన నాచురల్ మెడిసిన్ కూడా. ఆయుర్వేదంలో యాలకులను స్పైస్ ఆఫ్ లైఫ్ అని కూడా పిలుస్తారు. మోడర్న్ సైన్స్ కూడా దీని ఉపయోగాలను అంగీకరిస్తోంది. మొదటి ప్రయోజనం జీర్ణక్రియ. యాలకుల్లో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు డైజెషన్ను మెరుగుపరుస్తాయి. భోజనం తర్వాత ఒక యాలకును నమిలితే కడుపులో ఉండే బరువు తగ్గుతుంది.
భోజనం తర్వాత యాలకులు తినే అలవాటు మన దేశంలో ఉండడానికి ఇదే కారణం. రెండో ప్రయోజనం శ్వాసలో తాజాదనం. ఇది ఒక నాచురల్ మౌత్ ఫ్రెషనర్. ఒక్క యాలక నోట్లో వేసుకుంటే మనం మాట్లాడేటప్పుడు కమ్మని సువాసన వస్తుంది. ఇప్పుడు ఇక మొదట్లో మీకు ఉన్న అతి పెద్ద ప్రశ్న ఏంటంటే.. వద్దాం. యాలకులు ఎందుకంత ఖరీదు? ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాల్లోనే దీనికి సమాధానం దాగి ఉంది. మొదటి కారణం ఇది పండే ప్రాంతాలు చాలా తక్కువ. వాతావరణం పర్ఫెక్ట్గా ఉన్నచోట మాత్రమే యాలకులు పండుతాయి. ప్రపంచం మొత్తంలో కేరళ, కర్ణాటక, గ్వాటెమాలా లాంటి కొద్ది ప్రాంతాల్లోనే దీని సాగు సాధ్యమవుతుంది.
రెండో కారణం సమయం. మొక్క నాటిన తర్వాత రెండు, మూడు సంవత్సరాలు ఓపికగా ఎదురు చూడాలి. అప్పుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పంట వస్తుంది. అందుకే దీనికి అంత ఖరీదు. ఇక ముగించే ముందు మీ మైండ్ బ్లాక్ చేసే కొన్ని విషయాలు చూద్దాం. మొదటి విషయం, యాలకుల మొక్క అల్లం కుటుంబానికి చెందింది. అందుకే అల్లం, యాలకుల వాసనలో కొద్దిగా పోలిక ఉంటుంది. రెండో విషయం యాలకులను అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకునే దేశాలు సౌదీ అరేబియా, యూఏఈ. అరబ్ దేశాల్లో గహ్వా అనే కాఫీ తాగడం ఒక సాంప్రదాయం. అతిథులు వస్తే గహ్వా ఇవ్వాల్సిందే. ఆ కాఫీలో యాలకులు కంపల్సరీ. మూడో విషయం ప్రపంచంలో తలసరి యాలకుల వినియోగం అత్యధికంగా ఉన్న దేశాల్లో స్వీడన్ ఒకటి. స్వీడిష్ ప్రజలు తమ పేస్ట్రీలు, బ్రెడ్స్లో యాలకులను తప్పనిసరిగా వాడతారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిది. నాలుగో విషయం, యాలకుల మొక్కల్లో పాలినేషన్ జరగాలంటే తేనెటీగలు చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి: SIM: మీ ఆధార్‌పై ఎవరైనా సిమ్ తీసుకున్నారా? కేవలం 5 నిమిషాల్లో కనిపెట్టేయండి..!
యాలకుల పూలు ఎంత ప్రత్యేకమైనవంటే కేవలం ఒక ప్రత్యేక జాతికి చెందిన తేనెటీగలు మాత్రమే వాటిని పాలినేట్ చేయగలవు. అంటే ఫలదీకరణ చేస్తాయి, పుప్పొడిని తీసుకువెళ్లి. ఆ తేనెటీగలు తగ్గితే యాలకుల పంట సాగు తగ్గుతుంది. ఐదో విషయం భారతదేశంలో యాలకుల దొంగతనం అనేది ఒక పెద్ద క్రైమ్. కేరళలోని యాలకుల తోటలకు తుపాకులు పట్టుకున్న సెక్యూరిటీ గార్డ్స్ కాపలా ఉంటారు. ఎందుకంటే దొంగలు రాత్రికి రాత్రే వచ్చి మొత్తం పంటను దోచేయక్కర్లేదు, ఒక 10 కేజీలు లేపేస్తే సరిపోతుంది, వేలల్లో, లక్షల్లో సంపాదించొచ్చు. ఇక కేరళలోని దట్టమైన అడవుల్లో నాటిన ఒక చిన్న మొక్క, మూడు సంవత్సరాల నిరీక్షణ, కొండ వాలుల్లో చేతులతో చేసిన కోత, డ్రైయర్లో 48 గంటల పాటు ఆరబెట్టడం, ఆక్షన్ సెంటర్లలో వేలం, ఎన్నో వేల కిలోమీటర్ల ప్రయాణం, ఇదంతా దాటుకుని మీ టీ కప్పులోకి, మీ బిర్యానీ గిన్నెలోకి, మీ వంటగదిలోకి చేరుకుంటుంది.
ఇది కూడా చదవండి: New Car: కొత్త కారు కొనడానికి బెస్ట్ టైమ్ ఎప్పుడు? ఈ సమయంలో కొంటే మీరు అదృష్టవంతులే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి