Vande Bharat Sleeper: ఈ రూట్లో త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు.. షెడ్యూల్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ..! డీటైల్స్ ఇవిగో..

ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక వందే భారత్ రైళ్లు ఉండగా.. స్లీపర్ వెర్షన్ రైళ్ల కోసం ప్రయాణికులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు మరిన్ని స్లీపర్ ట్రైన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ముంబై-బెంగళూరు మార్గంలో ఒక రైలు నడపాలని నిర్ణయించగా.. ఇప్పుడు మరో రూట్ ఫిక్స్ అయింది.

Vande Bharat Sleeper: ఈ రూట్లో త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు.. షెడ్యూల్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ..! డీటైల్స్ ఇవిగో..
Vande Bharat Sleeper

Updated on: Oct 18, 2026 | 5:26 PM

వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు గుడ్ న్యూస్. రైల్వేశాఖ మరిన్ని స్లీపర్ వెర్షన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే హౌరా-గువహతి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశపెట్టగా.. దశలవారీగా మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పుడు మరో రెండు రైళ్లను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది. ముంబై-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు నడపాలని రైల్వేశాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. తాజాగా మరో రూట్ కూడా ఖరారు అయింది. న్యూఢిల్లీ-హౌరా మధ్య త్వరలో ఈ వెర్షన్ ట్రైన్‌ సర్వీసులు ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ యోచిస్తున్నట్లు సమాచారం.

త్వరలోనే పట్టాలెక్కే అవకాశం..!

ప్రస్తుతం ఢిల్లీ-కోల్‌కత్తాను కలుపుతూ అనేక రైళ్లు ఉండగా.. ప్రయాణికులకు రాత్రిపూట ప్రీమియం జర్నీ సౌకర్యాన్ని కల్పించేందుకు వందే భారత్ స్లీపర్ నడపాలని భావిస్తోంది. ఢిల్లీ-హౌరా మధ్య పరుగులు పెట్టించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకోగా.. షెడ్యూల్, రూట్, ప్రారంభ తేదీ వివరాలు బయటకు రాలేదు. వందే భారత్ స్లీపర్ రైళ్లను విస్తరించాలని రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాదిలోపు వివిధ నగరాలకు కనెక్టివిటీ కల్పిస్తూ వీటిని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకుంది. రాత్రిపూట ప్రయాణం చేసేవారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో వీటిని తీసుకొస్తుంది.

ఢిల్లీ-హౌరా వందే భారత్ స్లీపర్ ట్రైన్ వివరాలివే..

ఢిల్లీ-హౌరా మధ్య 1449 కిలోమీటర్ల దూరాన్ని ఇది కవర్ చేయనుంది. ఈ ట్రైన్ యూపీలోని కాన్పూర్ సెంట్రల్, ప్రయోగరాజ్ జంక్షన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, బీహార్‌లోని గయా జంక్షన్, జార్ఖండ్‌లోని కోడెర్మా, పరాస్ నాథ్, ధన్ బాద్, పశ్చిమబెంగాల్‌లోని అసన్ సోల్ జంక్షన్ స్టేషన్లలో ఆగుతుందని తెలుస్తోంది. ఢిల్లీ, యూపీ, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ మధ్య ఈ రైలు అనుసంధాన్ని కలిగించనుంది. ఈ రైలు ఢిల్లీ నుంచి సాయంత్రం 5 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 8 గంటలకు హౌరాకు చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య 15 గంటల్లోనే ఈ రైలులో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ వందే భారత్ స్లీపర్ రైలులో 11 ఏసీ త్రీ టైర్ కోచ్‌లతో పాటు 4 ఏసీ టూ టైర్, 1 ఫస్ట్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 16 ఏసీ కోచ్‌లు ఇందులో ఉంటాయి. ఏసీ త్రీ టైర్ టికెట్ ధర రూ.3 వేలు, టూ టైర్ ధర రూ.4 వేలు, ఫస్ట్ ఏసీ క్లాస్‌లో రూ.5,100 ఛార్జీ ఉంటుందని తెలుస్తోంది. వందే భారత్ స్లీపర్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో  ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ ట్రైన్లలో మెరుగైన బెర్త్ కుషనింగ్‌తో పాటు ఆటోమేటిక్ డోర్లు, సీసీటీవీ నిఘా, కవచ్ రక్షణ వ్యవస్థ, మెరుగైన అగ్నిమాపక భద్రతా చర్యలు, అత్యవసర కమ్యూనికేషన్ సౌకర్యాలు వంటివి ఉంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us