
వాహనదారులకు షాకింగ్ న్యూస్. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రైవేట్ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ ఇంధన ధరలను ఒక్కసారిగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 7వేలకుపైగా పెట్రోల్ పంప్‌లు ఈ సంస్థ నిర్వహిస్తుండగా.. అన్ని రిటైల్ అవుట్ లెట్లలోనూ పెంచుతున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.5 పెంచగా.. డీజిల్‌పై రూ.3 పెంచుతున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. శనివారం నుంచే ఈ ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో తమ మార్జిన్లపై ఒత్తిడి పడుతుందని, అందుకే పెంచాల్సి వస్తోందని నయారా ఎనర్జీ పేర్కొంది.
దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ సంస్థగా నయారా ఎనర్జీ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా-ఇరాన్ ఘర్షణల క్రమంలో ముడి చమురు ధరలు పెరగడంతో తొలుత ఈ సంస్థనే పెట్రోల్ ధరలను పెంచింది. మార్చి 26న పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచింది. దీంతో ఆ సంస్థ అవుట్ లెట్లలో లీటర్ పెట్రోల్ రూ.100.71, డీజిల్ రూ.91.31కి చేరాయి. ఈ సంస్థ పెంచడంతో ఆ తర్వాత ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు కూడా విడతల వారీగా ధరలను పెంచేశాయి. ఆ తర్వాత ఘర్షణలు తగ్గడంతో జూలై 1న నయారా పెట్రోల్ ధరలను లీటరుకు రూ.5, డీజిల్ ధరలను రూ.3 తగ్గించింది. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి పెంచుతున్నట్లు ప్రకటన జారీ చేసింది. దసరా పండక్కి ముందే ఇది ప్రజలపై భారంగా చెప్పవచ్చు. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.
ఇప్పటికే వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను అక్టోబర్ 1న కేంద్రం పెంచింది. దీంతో పాటు దేశంలో ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయి. కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.70 పలుకుతున్నాయి. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరుగుతున్నాయి. అటు అక్టోబర్ 1వ తేదీ నుంచి ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ లాంటి ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగాయి. ధరలన్నీ పెరగడంతో ఇంటి ఖర్చులు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు. ఖర్చుల భారం మోయలేకపోతున్నామని వాపోతున్నారు.