నామినీ vs వీలునామా.. వీటి మధ్య తేడా ఏంటో తెలుసా..? మరణం తర్వాత..

Nominee vs Will: మీ బ్యాంక్ అకౌంట్‌లో నామినీ పేరు పెట్టేసి.. మీ ఆస్తి పని పూర్తయిపోయిందని ధీమాగా ఉన్నారా? అయితే ఆగండి.. మీరు చేసిన నామినేషన్ వల్ల మీ కుటుంబంలో ఆస్తుల పంచాయితీలు మొదలయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే చట్టం ప్రకారం నామినీ అంటే ఆస్తికి ఓనర్ కాదు. మరి మీరు దాచుకున్న డబ్బు మీ సొంతవారికి క్షేమంగా దక్కాలంటే ఏం చేయాలి? నామినీ vs వీలునామా మధ్య ఉన్న తేడాలు ఏంటో తెలుసుకుందాం..

నామినీ vs వీలునామా.. వీటి మధ్య తేడా ఏంటో తెలుసా..? మరణం తర్వాత..
Nominee Vs Will
Image Credit source: AI Image

Updated on: Sep 05, 2026 | 1:07 PM

బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా.. జీవిత బీమా పాలసీ తీసుకోవాలన్నా లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలన్నా నామినీ పేరు నమోదు చేయడం కామన్. అయితే నామినీగా ఎవరి పేరైతే ఇస్తామో, మన తదనంతరం ఆ డబ్బు లేదా ఆస్తి మొత్తం పూర్తిగా వారికే చెందుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ చట్టపరంగా ఇది ముమ్మాటికీ నిజం కాదు. నామినీ కేవలం ఆస్తుల సంరక్షకుడు మాత్రమే తప్ప, యజమాని కాదు. ఈ విషయంలో నెలకొన్న గందరగోళంపై ఆర్థిక నిపుణులు స్పష్టమైన వివరణ ఇస్తున్నారు.

నామినీ vs వీలునామా: తేడా ఏమిటి?

ఓ వ్యక్తి మరణించిన తర్వాత బ్యాంకు, బీమా లేదా మ్యూచువల్ ఫండ్ సంస్థలు మొదట సంప్రదించేది నామినీని మాత్రమే. ఎటువంటి కాగితాల జాప్యం లేకుండా ఆపద సమయంలో కుటుంబానికి సులభంగా డబ్బు అందేలా చేయడమే నామినేషన్ ముఖ్య ఉద్దేశం. అయితే ఆ మొత్తాన్ని స్వీకరించిన తర్వాత నామినీ దానికి శాశ్వత హక్కుదారు కాలేరు. చెల్లుబాటు అయ్యే వీలునామా లేదా దేశంలోని వారసత్వ చట్టాల ప్రకారం అసలైన చట్టబద్ధ వారసులకు ఆ సొమ్మును చేర్చే వరకు నామినీ ఒక కేర్‌టేకర్‌గా మాత్రమే వ్యవహరిస్తారు. మీ ఆస్తి అంతిమంగా ఎవరి చేతుల్లోకి వెళ్లాలో నిర్ణయించే పూర్తి అధికారం కేవలం వీలునామాకు మాత్రమే ఉంటుంది.

వీలునామా ఎందుకు అత్యంత కీలకం?

వీలునామా లేని పక్షంలో ఆస్తులు సాధారణ వారసత్వ చట్టాల ప్రకారమే పంపకం అవుతాయి. కానీ కుటుంబంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు వీలునామా లేకపోతే తీవ్ర వివాదాలు తలెత్తుతాయి. ఉదాహరణకు.. తల్లిదండ్రులు తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని దివ్యాంగ బిడ్డకు ఇవ్వాలనుకున్నా, వృద్ధాప్యంలో ఉన్న తోబుట్టువుకు ఆర్థిక చేయూతనివ్వాలనుకున్నా లేదా కుటుంబ సభ్యులకు వేర్వేరు ఆస్తులను కేటాయించాలనుకున్నా.. అది కేవలం స్పష్టమైన వీలునామా ద్వారానే సాధ్యమవుతుంది.

చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఇదే

నామినేషన్, వీలునామా రెండింటి మధ్య సమన్వయం లేకపోవడమే అనేక కుటుంబాల్లో న్యాయపరమైన వివాదాలకు దారితీస్తుంది. కొందరు పెళ్లయిన తర్వాత బ్యాంకుల్లో నామినీ వివరాలు మారుస్తారు గానీ, అంతకుముందే రాసిన వీలునామాను సవరించడం మర్చిపోతారు. మరికొందరు వీలునామా రాస్తారు కానీ బ్యాంకు ఖాతాలు, పాలసీల్లో నామినీలను అప్‌డేట్ చేయరు. ఈ రెండు పత్రాల మధ్య పరస్పర విరుద్ధమైన వివరాలు ఉన్నప్పుడు, కుటుంబ సభ్యుడిని కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబానికి కోర్టు కేసులు, తీవ్ర గందరగోళం తప్పవు.

ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం తప్పనిసరి

వివాహం, విడాకులు, పిల్లల జననం లేదా కొత్తగా భారీ ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు నామినేషన్, వీలునామా రెండింటినీ సరిచూసుకోవడం మంచిది. ఒకసారి ఈ వివరాలను సమీక్షించుకుంటే, భవిష్యత్తులో మీ కుటుంబ సభ్యులకు అనవసరమైన తలనొప్పులు, ఆర్థిక తగాదాలు రాకుండా సురక్షితంగా ఉంచవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us