రజనికి ఒక కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాను ఒక కొరియర్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పాడు. రజనీ కోసం ఒక పార్సిల్ వచ్చిందని చెప్పాడు. అయితే, అందులో ఉన్న కంటెంట్ విషయంలో అనుమానం ఉందని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పాడు. మీకు పోలీసులు కాల్ చేస్తారు వారితో మాట్లాడుకుని పార్సిల్ తీసుకోండి అని చెప్పాడు. రజని అయోమయంలో పడిపోయింది. తనకు ఎవరు పార్సిల్ పంపారు? అర్ధం కాలేదు. ఇలా ఆలోచిస్తున్నంతలో ఆమెకు మరో కాల్ వచ్చింది తాము కస్టమ్స్ డిపార్ట్మెంట్ అని చెప్పారు అవతలి వ్యక్తి. రజనికి యూఎస్ నుంచి ఒక పార్సిల్ వచ్చిందనీ.. దానిలో డ్రగ్స్ ఉన్నట్టు అనుమానంగా ఉందనీ వెంటనే వచ్చి కలవాలనీ చెప్పారు. దీంతో భయపడిన రజని ఏమి ఇప్పుడు తాను రాలేని పరిస్థితిలో ఉన్నాననీ ఎలాగైనా ఈ సమస్య పరిష్కరించమనీ వారిని అడిగింది. దానికి వారు తన ఫోన్ కు ఒక లింక్ పంపిస్తామనీ దానిలో ఉన్న ఫామ్ ఫిల్ చేసి పంపిస్తే.. పార్సిల్ విప్పి చెక్ చేసి అందులో ఏదీ అనుమానస్పదంగా లేకపోతే వెంటనే కొరియర్ కు హాండ్ ఓవర్ చేస్తామనీ చెప్పారు ఆగంతకులు. దీంతో రజని ఏ మాత్రం ఆలోచించకుండా ఆ లింక్ లో వచ్చిన ఫామ్ లో అడిగిన అన్నీ డీటైల్స్ నింపింది. చివరగా ఉన్న స్కానర్ స్కాన్ చేసి 1000 రూపాయలు చార్జీల నిమిత్తం పంపించింది. సరిగ్గా పావు గంట తరువాత ఆమె ఫోన్ కు వరుసగా మెసేజ్ లు వచ్చాయి. అన్నీ కూడా ఆమె ఎకౌంట్ నుంచి డబ్బు డ్రా అయిపోయినట్టు వచ్చిన మెసేజ్ లు. అర్ధం అయింది కదా.. ఏమి జారిందో.. అవును సరిగ్గా మీరు ఊహించిందే.. ఆన్ లైన్ దొంగలు రజనీ ఎకౌంట్ దోచేశారు.
ఇలా కొరియర్ కంపెనీ అని చెప్పి.. బ్యాంక్ నుంచి అని చెప్పీ.. దేశవ్యాప్తంగా చాలా మందికి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. వాటి ఉచ్చులో పడి అందరూ డబ్బులు కోల్పోయారు. ముంబైలో, కొరియర్ మోసం కారణంగా ఒక మహిళ దాదాపు 2 లక్షల రూపాయలను మోస పోయింది. సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత టాండన్ ఈ విషయంపై మాట్లాడుతూ సాధారణంగా ఇటువంటి కేసుల్లో సైబర్ సెల్‌తో కలుపుతున్నామనీ.. అక్కడ సమాధానం చెప్పుకోమని బెదిరిస్తారని చెప్పారు. అలాగే ఆధార్ నంబర్, ఇతర ప్రైవేట్ సమాచారం కోసంఅడుగుతారని రక్షిత్ టాండన్ చెబుతున్నారు. ఎప్పుడైనా సరే ఏదైనా తప్పు చేసినట్టు లేదా జరిగినట్టు పోలీసులు భావిస్తే ముందు అధికారిక ప్రభుత్వ నోటీసు వస్తుంది. తెలియని నంబర్ల నుంచి ఫోన్ చేసి పోలీసులు బెదిరించరు అని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, రక్షిత్ టాండన్ చెప్పారు. ఒకవేళ తీవ్రమైన నేరం అనే పరిస్థితిలో పోలీసు అధికారులు ఇంటికి వచ్చి తమ అధికారిక ధృవ పత్రాలను చూపించి ఎంక్వయిరీ చేస్తారు. ఫోన్ చేసి లేదా మెసేజ్ చేసి ఆన్ లైన్ లో ఎటువంటి కోడ్స్ పంపించి స్కాన్ చేయమని ఆడగరు. మీరు జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఇలాంటి సైబర్ నెరగాళ్ల బారిన పడితే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొరియర్‌లో డ్రగ్స్ దొరికాయని చెబితే మీ లాయర్ మాట్లాడుతారని చెప్పండి. ఎందుకంటే ఇలాంటి నేరాలు చేసేవారు ప్రజలు చాలా భయంతో ఉంటారని భావిస్తారు. మీరు ఎప్పుడైతే లాయర్ అని అన్నారో ఈ సారి వాళ్ళు భయపడతారు. మీకు చట్టం తెలుసని అనుకుంటాడు. కొంతమంది అలా కూడా భయపడకుండా వాదించే పని పెట్టుకోవచ్చు. అప్పుడు కొరియా వివరాలు మెసేజ్ చేయమని చెప్పండి. అప్పుడు కొరియర్ కంపెనీకి నేరుగా ఫోన్ చేసి విషయం కనుక్కోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆధార్, బ్యాంకు ఖాతా వంటి వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ముఖ్యంగా, అటువంటి కేసుల గురించి సైబర్ క్రైమ్ ఫిర్యాదు నంబర్ 1930లో ఫిర్యాదు చేయండి. మీరు cybercrime.gov.inలో ఆన్‌లైన్ ఫిర్యాదును కూడా ఫైల్ చేయవచ్చు. మీరు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కూడా ఫిర్యాదు చేయవచ్చు.