
నెస్లే ఇండియా తయారు చేసిన లో-ఫ్యాట్ డెయిరీ వైటనర్ విక్రయాలను ఆహార భద్రతా ప్రాధికార సంస్థ (FSSAI) నిషేధించింది. న్యూఢిల్లీలోని ది లలిత్ హోటల్ నుంచి సేకరించిన నమూనాను ప్రయోగశాలలో పరీక్షించగా అది అసురక్షితం నాణ్యత ప్రమాణాలకు విరుద్ధంగా తేలినట్లు FSSAI ప్రకటించింది. నెస్లే లో-ఫ్యాట్ డెయిరీ వైటనర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం నాన్-కంప్లయింట్‌గా గుర్తించబడింది. దీనిపై హోటల్ నిర్వహణ సంస్థకు నోటీసులు జారీ చేసి, సంబంధిత ఉత్పత్తి విక్రయాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ప్రయోగశాల నివేదిక కాపీని హోటల్ కి అందజేసి నిర్దేశిత గడువులోగా అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది.
ఇదిలా ఉండగా.. నెస్లే ఇండియా తమ ఉత్పత్తి పూర్తిగా సురక్షితమేనని, అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉందని స్పష్టం చేసింది. కంపెనీ ప్రకారం పాలలో సహజంగా ఉండే ఫాస్ఫరస్ కారణంగానే పరీక్షల్లో తేడా వచ్చి ఉండొచ్చు. ల్యాబ్ రిపోర్ట్‌లో మొత్తం ఫాస్ఫరస్‌ను జోడించిన ఫాస్ఫరస్ పరిమితితో పోల్చారు. కానీ పాల ఆధారిత పదార్థాల్లో సహజంగా ఉండే ఫాస్ఫరస్‌ను పరిగణనలోకి తీసుకోలేదని నెస్లే పేర్కొంది. కంపెనీ అధికారులతో సంప్రదిస్తూ, సహజ ఫాస్ఫరస్ ఉనికిని నిరూపించే డేటాను అందజేస్తున్నట్లు తెలిపింది.