
జియోఫైబర్ అనేది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే బ్రాడ్‌బ్యాండ్ సేవ. ఇందులో ఇంటర్నెట్ కనెక్షన్ అందించడానికి సమీపంలోని స్తంభం నుంచి నేరుగా ఇంటి వరకు ఫైబర్ కేబుల్ వేస్తారు. ఈ కేబుల్ ద్వారా ఇంటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుతుంది.
దీని ప్రత్యేకత ఏమిటంటే ఇంటర్నెట్ వేగం సాధారణంగా స్థిరంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులు, మొబైల్ నెట్‌వర్క్ రద్దీ వంటి అంశాల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇంట్లో ఒకేసారి పలువురు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీల్లో ఇంటర్నెట్ ఉపయోగించినా మెరుగైన కనెక్టివిటీ పొందవచ్చు.
ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు, ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారు, పెద్ద ఫైల్స్ డౌన్‌లోడ్ చేసేవారికి జియోఫైబర్ మంచి ఎంపికగా ఉంటుంది.
జియో ఎయిర్‌ఫైబర్ అనేది 5G వైర్‌లెస్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఇంటర్నెట్ సేవ. దీనికి ఇంటి వరకు ఫైబర్ కేబుల్ వేయాల్సిన అవసరం ఉండదు. సమీపంలోని జియో మొబైల్ టవర్ నుంచి 5G సిగ్నల్‌ను స్వీకరించి, ఇంట్లో ఏర్పాటు చేసే ప్రత్యేక పరికరం ద్వారా వైఫై కనెక్టివిటీ అందిస్తుంది.
ముఖ్యంగా ఫైబర్ కేబుల్ సదుపాయం లేని ప్రాంతాల్లో నివసించేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు, కేబుళ్లు వేయడానికి వీలులేని అపార్ట్‌మెంట్లు, ఇరుకైన వీధుల్లో ఉండేవారికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.
అయితే జియో ఎయిర్‌ఫైబర్ వేగం పూర్తిగా మీ ప్రాంతంలోని 5G సిగ్నల్ బలంపై ఆధారపడి ఉంటుంది. టవర్‌కు దూరంగా ఉన్నా, నెట్‌వర్క్ రద్దీ ఎక్కువగా ఉన్నా ఇంటర్నెట్ వేగంలో మార్పులు రావచ్చు.
జియోఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ మధ్య ప్రధానమైన తేడా డేటా పరిమితి. జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో నెలకు గరిష్ఠంగా 3.3TB అంటే 3,300GB వరకు డేటా అందుబాటులో ఉంటుంది.
అదే జియో ఎయిర్‌ఫైబర్ బేసిక్ ప్లాన్లలో నెలకు 1,000GB అంటే 1TB వరకు డేటా పరిమితి ఉంటుంది. అందువల్ల ఎక్కువ మొత్తంలో సినిమాలు, వీడియోలు డౌన్‌లోడ్ చేసేవారు, పెద్ద ఫైల్స్‌తో పనిచేసేవారు జియోఫైబర్‌ను ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ రెండు సేవల బేసిక్ ప్లాన్ల నెలవారీ ధరలు దాదాపు ఒకే స్థాయిలో ఉంటాయి. అయితే కొత్త కనెక్షన్ తీసుకునే సమయంలో ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, పరికరాల ఖర్చుల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు.
అంతేకాకుండా వినియోగదారులు ఎంచుకునే ప్లాన్‌ను బట్టి జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కూడా లభించవచ్చు. కొన్ని ప్లాన్లలో 4K సెట్‌టాప్ బాక్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి కనెక్షన్ తీసుకునే ముందు మీకు అవసరమైన ఓటీటీ ప్రయోజనాలు ఏ ప్లాన్‌లో ఉన్నాయో పరిశీలించాలి.
మీ ప్రాంతంలో జియోఫైబర్ కేబుల్ కనెక్షన్ అందుబాటులో ఉంటే దానిని ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే కేబుల్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ కనెక్టివిటీ సాధారణంగా స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ డేటా వినియోగించే వారికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.
ఒకవేళ మీ ప్రాంతంలో జియోఫైబర్ సదుపాయం లేకపోతే జియో ఎయిర్‌ఫైబర్ మంచి ప్రత్యామ్నాయం. అయితే కనెక్షన్ తీసుకునే ముందు మీ ఇంట్లో 5G సిగ్నల్ ఎలా వస్తుందో పరిశీలించాలి. సిగ్నల్ బలంగా ఉంటే ఎయిర్‌ఫైబర్ ద్వారా కూడా మంచి ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు.
మొత్తంగా చూస్తే.. స్థిరమైన ఇంటర్నెట్ వేగం, ఎక్కువ డేటా కావాలనుకునేవారికి జియోఫైబర్ అనుకూలంగా ఉంటుంది. కేబుల్ కనెక్షన్ అందుబాటులో లేని ప్రాంతాల్లో ఉండేవారికి జియో ఎయిర్‌ఫైబర్ ఉపయోగపడుతుంది. మీ ఇంటి అవసరాలు, ప్రాంతంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది.
గమనిక: ప్లాన్ల ధరలు, డేటా పరిమితులు, ఓటీటీ ప్రయోజనాలు కాలానుగుణంగా మారవచ్చు. కనెక్షన్ తీసుకునే ముందు జియో అధికారిక వెబ్‌సైట్‌లో తాజా వివరాలు పరిశీలించండి.