ITR Verify: ఐటీఆర్ ఫైల్ చేశారు సరే.. వెరిఫై చేశారా? లేకపోతే ఏమవుతుందంటే..

|

Aug 02, 2023 | 7:05 PM

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయపు పన్ను రిటర్న్‌ కోసం దరఖాస్తు చేసిన తర్వాత దానిని వెరిఫై చేసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే మీకు రిటర్న్‌ నిలిచిపోతుంది. ఐటీఆర్‌ ఫైలింగ్‌ విషయంలో ఎంతో అవగాహన ఉండాలి. అవగాహన లేని కారణంగా కూడా ఇరకాటంలో పడిపోతుంటారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాక దానిని వేరిఫై చేస్తేనే ఐటీ రిటర్న్స్ పూర్తయినట్టు లెక్క. మీరు నిర్ణీత గడువులోపు రిటర్న్‌ను ధృవీకరించకపోతే, మీ రిటర్న్ చెల్లుబాటు కానిదిగా కావచ్చు. అంటే మీరు రిటర్న్‌ను దాఖలు చేయలేదని ఆదాయపు పన్ను శాఖ భావిస్తుంది. అటువంటి..

ITR Verify: ఐటీఆర్ ఫైల్ చేశారు సరే.. వెరిఫై చేశారా? లేకపోతే ఏమవుతుందంటే..
Income Tax Return
Follow us on

ఇతని పేరు వికాస్.. ఐటీఆర్ ఫైల్ చేసి రిలాక్స్ గా ఉన్నాడు. కొత్త ఫోన్ కొనుక్కోవడానికి అతనికి డబ్బులు కావాలి. అందుకోసం ఐటీఆర్ ఫైల్ చేసిన దగ్గర నుంచీ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ, ఐటీఆర్ ఫైల్ చేసి 25 రోజులు గడిచినా రీఫండ్స్ రాలేదు. వికాస్ తన స్నేహితులను వాకబు చేశాడు. వారంతా ఇప్పటికే రీఫండ్స్ తీసుకున్నట్టు చెప్పారు. దీంతో వికాస్ టెన్షన్ పడ్డాడు. అతని టెన్షన్ చూసిన వికాస్ స్నేహితుడు నీ ఐటీఆర్ ఫైల్ చేశావు సరే.. మరి వెరిఫికేషన్ చేశావా? అని ప్రశ్నించాడు. వికాస్ కి దాని గురించి తెలీదు. అందుకే వెరిఫికేషన్ ఏమిటి? అని అడిగాడు.

అయితే రిటర్న్‌లు ఫైల్ చేసే వికాస్ లాంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ వారు దానిని ధృవీకరించడం అంటే వెరిఫికేషన్ మర్చిపోతారు లేదా వారికి దాని గురించి అవగాహన ఉండదు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాక దానిని వేరిఫై చేస్తేనే ఐటీ రిటర్న్స్ పూర్తయినట్టు లెక్క. మీరు నిర్ణీత గడువులోపు రిటర్న్‌ను ధృవీకరించకపోతే, మీ రిటర్న్ చెల్లుబాటు కానిదిగా కావచ్చు. అంటే మీరు రిటర్న్‌ను దాఖలు చేయలేదని ఆదాయపు పన్ను శాఖ భావిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు మళ్లీ రిటర్న్ దాఖలు చేయాల్సి వస్తుంది.

రిటర్న్‌ని ధృవీకరించడానికి లేదా ITR-Vని ఫైల్ చేయడానికి మీకు రిటర్న్ ఫైల్ చేసిన తేదీ నుంచి 30 రోజుల సమయం ఉంటుంది. ఈ 30 రోజుల్లో రిటర్న్‌ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్‌లో రెండు పద్ధతులు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో అంటే ఇ-వెరిఫై అలాగే ఆఫ్‌లైన్. అలాగే రిటర్న్ ఫైలింగ్ సమయంలో వెరిఫికేషన్ కోసం మూడు ఎంపికలు ఉన్నాయి. అవి ఇప్పుడే ధృవీకరించండి. తర్వాత ధృవీకరించండి అలాగే ITR-V ద్వారా ధృవీకరించండి. ఇలా మూడు ఆప్షన్స్‌ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

వికాస్ లాగా మీరు కూడా రిటర్న్ ఫిల్ చేసిన తర్వాత వెరిఫై చేయడం మర్చిపోయి ఉంటే.. మీరు ఈ-వెరిఫై చేసుకోవచ్చు. రిటర్న్‌ను ఇ-ధృవీకరించడానికి, ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి. ఇ-ఫైల్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌కి వెళ్లి, ఇ-వెరిఫై రిటర్న్ ఎంచుకోండి. ధృవీకరణ పెండింగ్‌లో ఉంటే, రిటర్న్ ఇ-ధృవీకరణ విభాగంలో కనిపిస్తుంది. రిటర్న్‌ను ఎంచుకున్న తర్వాత ధృవీకరణ కోసం ఎంపిక కనిపిస్తుంది. OTP, డిజిటల్ సంతకం, బ్యాంక్ ఖాతా, నెట్ బ్యాంకింగ్ – డీమ్యాట్ ఖాతాల ద్వారా ఆధార్‌ను ధృవీకరించవచ్చు. ఆధార్ OTPని ఎంచుకున్న తర్వాత OTP ఆధార్‌లోని రిజిస్టర్డ్ నంబర్‌కు వస్తుంది.
మొబైల్ నంబర్ ఆధార్‌తో నమోదు కానట్లయితే బ్యాంక్ ఖాతా, డీమ్యాట్ ఖాతా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ధృవీకరణ చేయవచ్చు.

అయితే, బ్యాంక్ ఖాతా లేదా డీమ్యాట్ ఖాతా ముందుగా వెరిఫై అయి ఉండాలి. తరువాత ఎలక్ట్రానిక్ ధృవీకరణ కోడ్ (EVC) జనరేట్ అవుతుంది. ఆ తర్వాత రిటర్న్ వెరిఫై అవుతుంది. ఆఫ్‌లైన్ ధృవీకరణ కోసం రిటర్న్ రసీదుని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది సంతకం చేసి, సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC), బెంగళూరుకు పంపాలి. మీరు 30 రోజుల్లోపు స్పీడ్ పోస్ట్ లేదా సాధారణ పోస్ట్ ద్వారా పంపవచ్చు. ధృవీకరణ కోసం 30-రోజుల గడువు ముగిసిన తర్వాత మీరు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లి, క్షమాపణ అభ్యర్థనను సబ్మిట్ చేయవచ్చు. అంటే ఆలస్యానికి కారణాన్ని తెలియజేస్తూ అపాలజీ చెప్పడం. ఈ మీ అప్పెల్‌ను అంగీకరిస్తే, మీరు ఐటీఆర్ ను వెరిఫై చేయవచ్చు. ఒకవేళ అభ్యర్థన తిరస్కరించబడితే, మీరు రిటర్న్‌ను దాఖలు చేయలేదని భావిస్తారు. అలాగే ఆలస్యంగా దాఖలు చేసే నిబంధనలకు మీరు బాధ్యులవుతారు.

మీరు జూలై 31న రిటర్న్‌ను దాఖలు చేసి, ఆగస్ట్ 22న వెరిఫై చేశారనుకుందాం.. ఆ తర్వాత రిటర్న్ ఫైల్ చేసే తేదీ జూలై 31గా పరిగణిస్తారు. కానీ మీరు సెప్టెంబర్ 5న వెరిఫై చేస్తే, సెప్టెంబర్ 5 ఐటీఆర్ ఫైలింగ్ తేదీగా పరిగణిస్తారు. అటువంటి సందర్భంలో రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే ఆలస్య రుసుము రూ.5,000 అవుతుంది. అయితే ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉంటే, ఆలస్య రుసుము రూ.1000 వరకు ఉంటుంది. మీరు నష్టాన్ని ఫార్వార్డ్ చేయలేరు. ఏదైనా పన్ను బాధ్యత ఉంటే నెలకు 1% చొప్పున వడ్డీ అంటే పెనాల్టీ ఉంటుంది. ఆలస్యంగా రిటర్న్స్ మీరు డిసెంబర్ 31 వరకు మాత్రమే ఫైల్ చేయవచ్చు. మీరు రిటర్న్ ఫైల్ చేసినా వెరిఫై చేయకపోతే వికాస్ లాగా మీ రీఫండ్ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వెంటనే రిటర్న్ వెరిఫై చేయండి. అప్పుడే రిటర్న్, రీఫండ్ ప్రాసెస్ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి