మీకు ఆర్ధిక భద్రతను అందించడంతో పాటు ఆరోగ్య సమస్యలకు కూడా కవరేజీని అందించేది ఇన్సూరెన్స్ పాలసీ. ఇన్సూరెన్స్ పాలసీలు అన్నీ కూడా ఒక వ్యక్తి అవసరాల ప్రకారం కస్టమైజ్ చేయబడతాయి. అత్యవసర సమయాల్లో మిమ్మల్ని ఇవి సురక్షితం చేస్తుంటాయి. అందుకే అందరూ కూడా బీమా పాలసీ తీసుకోవడం మంచి ఆలోచన అని చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే యాక్సిడెంట్ కావడం వల్లనైనా లేదా ఆకస్మిక మరణం వల్ల బీమా చేసిన వ్యక్తి చనిపోతే.. క్లెయిమ్ మొత్తాన్ని నామినీ లేదా అతడి కుటుంబసభ్యులకు అందజేస్తారు. అయితే ఒకవేళ బీమా చేసిన వ్యక్తి తప్పిపోయినా.. లేదా అతడి మరణం గురించి ఎలాంటి సమాచారం లభించకపోయినా.. అప్పుడు క్లెయిమ్‌ను తీసుకోవడం కష్టతరం అవుతుంది.
పాలసీదారుడి మరణ ధృవీకరణ పత్రంతో పాటు మిగిలిన నిబంధనలను అన్నీ పాటిస్తేనే క్లెయిమ్ తీసుకోవడం వీలుపడుతుంది. ముఖ్యంగా తుఫాను, కొండచరియలు విరిగిపడటం, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో పాలసీదారుడు తప్పిపోయినట్లయితే, క్లెయిమ్ తీసుకోవడం మరింత కష్టం అవుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం బీమా మొత్తాన్ని పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తప్పిపోయిన వ్యక్తి జీవిత బీమా పాలసీని కలిగి ఉంటే, అతడి కుటుంబం ఆ పాలసీను క్లెయిమ్ చేయడం ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చు. అయితే, తప్పిపోయిన వ్యక్తి చనిపోయినట్లుగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. అందుకోసం లీగల్ ప్రొసీజర్‌ను పూర్తి చేయాలి.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో పాలసీదారుడు తప్పిపోయినా/ మరణించినా.. ముందుగా కుటుంబం అతడి/ఆమె మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి. అలాగే, కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తి అదృశ్యమైనట్లు నిరూపించడానికి, చట్టపరమైన వారసులు ఎఫ్ఐఆర్ కాపీని, నాన్-ట్రేసబుల్ పోలీస్ రిపోర్టును సమర్పించాలి. దర్యాప్తులో వ్యక్తి తప్పిపోయినట్లు నిర్ధారించబడితే, అతడు చనిపోయినట్లుగా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుంది. అలాంటి పరిస్థితిలో కోర్టు. బీమా సంస్థను చెల్లింపుల కోసం ఆదేశిస్తుంది.
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సెక్షన్ 108 ప్రకారం, తప్పిపోయిన వ్యక్తి కోసం కుటుంబం ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించలేకపోతే, ఏడేళ్ల తర్వాత బీమా క్లెయిమ్ చేయవచ్చు.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా బీమా చేసిన వ్యక్తి తప్పిపోయినట్లయితే, ప్రభుత్వం వారిని మరణించినట్లుగా భావిస్తుంది. అలాగే, తప్పిపోయిన వారి జాబితా జారీ చేయబడితే, అప్పుడు కుటుంబసభ్యులు బీమా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, ఏడు సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదు.